Maruti 800 FIVA Award: భారతీయ కార్ల చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న మారుతి 800 మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకమైన FIVA వరల్డ్ వెహికల్ హెరిటేజ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును అందుకున్న తొలి, ఏకైక భారతీయ కారుగా మారుతి 800 గుర్తింపు పొందింది. ఒకప్పుడు సామాన్యుల సొంత కారు కలను నిజం చేసిన ఈ మోడల్ కు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గౌరవం దక్కింది.
చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న వాహనాలను గుర్తించేందుకు అంతర్జాతీయ సంస్థ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ వెహిక్యూల్స్ ఆన్సియన్స్ (FIVA) ఈ అవార్డులను అందిస్తోంది. ఈసారి అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లోవేనియా సహా 21 దేశాలకు చెందిన వాహనాలు ఈ గుర్తింపు కోసం ఎంపికయ్యాయి. అయితే భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక కారు మారుతి 800 కావడం విశేషం. ఈ అవార్డు ఎంపికలో కేవలం కారు విలువ, అరుదైన మోడల్ అనే అంశాలనే చూడలేదు. ప్రజల జీవితాలపై ఆ వాహనం చూపిన ప్రభావం, దేశ పారిశ్రామిక అభివృద్ధికి అందించిన సహకారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ప్రమాణాల్లో మారుతి 800 ప్రత్యేకతను చాటుకుంది.
భారత ప్రభుత్వం, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో మారుతి 800 తయారైంది. SS80 పేరుతో వచ్చిన ఈ కారు 1983 డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. తొలి మారుతి 800ను హర్పాల్ సింగ్‌కు అందజేశారు. ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్ DIA 6479. ప్రస్తుతం ఈ చారిత్రక కారును ఢిల్లీలోని మారుతి సుజుకి ప్రధాన కార్యాలయంలో భద్రపరిచి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రకటించిన FIVA అవార్డు కూడా ఈ మొదటి మారుతి 800కే దక్కడం మరో విశేషం.
మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్.సి. భార్గవ ఈ అవార్డు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన మారుతి 800, దేశ ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుగుదలకు బలమైన పునాది వేసిందన్నారు. నాణ్యమైన కార్లను దేశీయంగా తయారు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని ఈ మోడల్ నిరూపించిందన్నారు.
చారిత్రక వాహనాల పరిరక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ FIVA. దీనికి యునెస్కోతో ప్రభుత్వేతర భాగస్వామ్యం కూడా ఉంది. వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాకుండా, ఒక దేశ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధిలో భాగమని ఈ సంస్థ గుర్తుచేస్తోంది. ఈ నేపథ్యంలో మారుతి 800కు లభించిన అవార్డు భారత ఆటోమొబైల్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. లక్షలాది కుటుంబాల కారు కలను నిజం చేసిన ఈ మోడల్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు.
Read Also: కియా సైరోస్ EV vs టాటా నెక్సాన్ EV.. రేంజ్ టెస్ట్‌లో గెలిచిందెవరో తెలుసా?