BGauss Electric Scooter Sales: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త కొత్త కంపెనీలు మార్కెట్లోకి వస్తుండగా, ఇప్పటికే ఉన్న సంస్థలు కూడా అమ్మకాల్లో పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ BGauss కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలో తన స్కూటర్ల మొత్తం అమ్మకాలు లక్ష యూనిట్ల మార్కును దాటినట్లు ప్రకటించింది. ముఖ్యంగా 2026లో ఈ సంస్థ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి.
BGauss సంస్థ 2022 ఆగస్టులో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి 2026 నవంబర్ 9 వరకు మొత్తం 1,00,595 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది. దీంతో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 9 వరకు మాత్రమే 41,849 యూనిట్లు అమ్ముడయ్యాయి. కంపెనీ, ఇప్పటివరకు సాధించిన మొత్తం విక్రయాల్లో ఇవి దాదాపు 42 శాతం. గత ఏడాదితో పోలిస్తే 2026లో ఇప్పటి వరకు అమ్మకాలు 104 శాతం వృద్ధి చెందాయి. దీంతో ఈ ఏడాది సంస్థకు అత్యుత్తమ సంవత్సరంగా మారింది.
BGauss స్కూటర్లకు ఇటీవల మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నట్లు నెలవారీ అమ్మకాల లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2026 జూలై నుంచి అక్టోబర్ వరకు వరుసగా నాలుగు నెలల పాటు కంపెనీ 5,000 యూనిట్లకు పైగా స్కూటర్లను విక్రయించింది. గత నాలుగు నెలల అమ్మకాల వివరాలు చూస్తే.. జూలైలో 5,560 యూనిట్లు, ఆగస్టులో 5,046 యూనిట్లు, సెప్టెంబర్ లో 5,024 యూనిట్లు, అక్టోబర్ లో 5,556 యూనిట్లు సేల్ అయ్యాయి. 2025 చివరి నాటికి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్లలో BGauss ఏడో స్థానంలో నిలిచింది. 2026లోనూ ప్రతి నెలా టాప్ 10 బ్రాండ్ల లిస్టులో కొనసాగుతోంది.
అమ్మకాలను మరింత పెంచుకునే ప్రయత్నంలో భాగంగా BGauss ఇటీవల తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ C12 MaxRను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.60 లక్షలుగా నిర్ణయించింది. కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన ప్రీమియం మోడల్‌గా దీన్ని పరిచయం చేసింది. ఈ స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా లాంటి మోడళ్లతో పోటీ పడుతోంది.
2026లో ఇప్పటికే 41,849 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసిన BGauss.. ఏడాది ముగిసేలోపు 50 వేల యూనిట్ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. అయితే, టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ల జాబితాలో మరింత మెరుగైన స్థానం సంపాదించాలంటే నెలవారీ అమ్మకాలను 7,000 యూనిట్లకు పైగా పెంచుకోవాల్సి ఉంటుంది. రాబోయే నెలల్లో కంపెనీ ఎలాంటి అమ్మకాలను సాధిస్తుందో చూడాలి.
Read Also: ఒకేసారి స్కూటర్, బైక్‌కు పేటెంట్లు.. విన్‌ఫాస్ట్ ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!