Mahindra’s SUV Sales 2026: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని మహీంద్రా కంపెనీ చక్కగా ఉపయోగించుకుంటోంది. వరుసగా రెండో ఏడాది కూడా 6 లక్షలకు పైగా SUVలను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. 2026లో మరో రెండు నెలలు మిగిలి ఉండగానే 7 లక్షల వాహనాల అమ్మకాల మైలురాయిని చేరుకునే దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో అమ్మకాలు కంపెనీకి మరింత జోష్ ను కలిగించాయి.
మహీంద్రా అక్టోబర్ 2026లో ఏకంగా 73,338 SUVలను అమ్మింది. కంపెనీ చరిత్రలోనే ఇదే అత్యధిక నెలవారీ అమ్మకాలు కావడం విశేషం. దీంతో వరుసగా రెండో ఏడాది 6 లక్షల వార్షిక SUV విక్రయాల మార్కును క్రాస్ చేసింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 6,15,280 SUVలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 5,18,321 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 19 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఏడాది విక్రయాలు 6,25,603 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ ముగిసే సమయానికే ఆ సంఖ్యకు మహీంద్రా దగ్గరగా చేరుకుంది.
ప్రస్తుత అమ్మకాల జోరు ఇలాగే కొనసాగితే 2026 క్యాలెండర్ సంవత్సరంలో 7 లక్షల SUVల విక్రయాలను మహీంద్రా ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా 7.5 లక్షల యూనిట్ల మార్కును కూడా చేరుకోవచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 1,83,800 వాహనాలు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 1,74,745 యూనిట్లు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు 1,83,397 యూనిట్లు విక్రయించింది. థర్డ్ క్వార్టర్ లో గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 40 శాతం వృద్ధి సాధించింది.
మహీంద్రా ఇటీవల తన తొలి CNG SUV అయిన XUV 3XO ZNGని మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు CNG వాహనాలకు కూడా డిమాండ్ పెరుగుతుండటంతో ఈ మోడల్ అమ్మకాలు కంపెనీకి కలిసొచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా SUV మార్కెట్లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించాలని సంస్థ భావిస్తోంది.
మహీంద్రా అమ్మకాలు భారీగా పెరుగుతున్నప్పటికీ, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు టాటా మోటార్స్ 6,49,477 వాహనాలను అమ్మి రెండో స్థానంలో ఉంది. మహీంద్రా 6,15,280 యూనిట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. టాటా మోటార్స్ ప్రస్తుతం మహీంద్రా కంటే 34,197 యూనిట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు మారుతి సుజుకి 17.9 లక్షల యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది.
Read Also: 130 కి.మీ వేగం.. 320 కి.మీ ప్రయాణం.. దేశంలోనే లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!