New Vespa Electric Scooter Range: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ వెస్పా (Vespa) ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. ఈ లైనప్ లో స్ప్రింట్ ఎస్ (Sprint S), ప్రిమవెరా (Primavera), ప్రిమవెరా టెక్ (Primavera Tech) అనే మూడు మోడళ్లు ఉన్నాయి. ఎప్పటి లాగే వెస్పా ప్రత్యేకమైన డిజైన్ ను కొనసాగిస్తూనే.. కొత్త ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్, అత్యాధునిక ఫీచర్లను వీటిలో అందించింది.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలోనూ వెస్పా తన ఐకానిక్ సిల్హౌట్ ను కొనసాగించింది. మోనోకోక్ ఛాసిస్, ట్రైలింగ్ లింక్ ఫ్రంట్ సస్పెన్షన్ లాంటి అంశాలు వీటిలో ఉన్నాయి. సాధారణ పెట్రోల్ వెస్పా స్కూటర్లతో పోలిస్తే ఎగ్జాస్ట్ లేకపోవడం ప్రధానమైన తేడా. మూడు మోడళ్లలోనూ ఆల్ ఎల్ఈడీ లైటింగ్, 12/11 ఇంచ్ వీల్ సెటప్ ఉన్నాయి.
స్ప్రింట్ ఎస్, ప్రిమవెరా మోడళ్లలో 2.3kWh తొలగించగల బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. వీటిలో 3.1kW మోటార్ ఉంటుంది. ఇది 2.7kW నిరంతర శక్తిని, 200Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు స్కూటర్ల గరిష్ఠ వేగం గంటకు 45 కిలోమీటర్లు కాగా, WMTC ప్రమాణాల ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 68 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 500W ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు నాలుగు గంటలు పడుతుంది. బ్యాటరీతో కలిపి ఈ స్కూటర్ల బరువు 111 కిలోలు.
ఈ మూడు మోడళ్లలో ప్రిమవెరా టెక్ టాప్ వేరియంట్. ఇందులో పెద్దదైన 4.2kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీని ఎలక్ట్రిక్ మోటార్ 3.6Kw కంటిన్యూయస్ పవర్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ కారణంగా WMTC ప్రకారం 80 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఈవీలో ఫీచర్ల విషయానికి వస్తే.. 4.3 ఇంచ్ TFT డిస్‌ప్లే, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కీలెస్ ఇగ్నిషన్, ఫైండ్ మై స్కూటర్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను కూడా అందించారు. ఈ స్కూటర్ బరువు 130 కిలోలు.
మూడు స్కూటర్లలోనూ ముందు 200mm డిస్క్, వెనుక 140mm డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. అయితే, ప్రిమవెరా టెక్ లో అదనంగా సింగిల్-ఛానల్ ABS సదుపాయం కల్పించారు. ప్రస్తుతం వెస్పా భారత మార్కెట్లో పెట్రోల్ స్కూటర్లను విక్రయిస్తోంది. అయితే, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్ లో విడుదల చేసే విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఇవి దేశీయ మార్కెట్లోకి వస్తే బజాజ్ చేతక్‌కు గట్టి పోటీ ఇవ్వవచ్చు. అలాగే హీరో, టీవీఎస్, హోండా, సుజుకి, ఏథర్, రివర్ లాంటి సంస్థల ఎలక్ట్రిక్ స్కూటర్లతోనూ పోటీ పడాల్సి ఉంటుంది.
Read Also: హీరోను దాటేసిన హోండా.. టూవీలర్ మార్కెట్లో బిగ్ ట్విస్ట్!