Bengaluru Murder: పిల్లలు పుట్టలేదనే నిరాశే కాపురం లో చిచ్చుపెట్టింది. పదే పదే ‘గొడ్రాలు’ అంటూ భర్త చేసే వేధింపులు ఆ భార్యలో ఆవేశాన్ని రగిలించాయి. చివరికి అదే ఆవేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
రోజువారీ వేధింపులే ప్రాణం తీశాయి
బెంగళూరులోని కెంపేగౌడనగర లక్ష్మీపురలో రాజశేఖర్ (43), మాలశ్రీ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా వీరికి సంతానం కలగలేదు. ఈ ఒక్క లోపంతోనే రాజశేఖర్ రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ‘నువ్వు గొడ్రాలివి’ అంటూ ఆమెను మానసికంగా తీవ్రంగా వేధించేవాడు. నిత్యం జరిగే ఈ వేధింపులు ఆ భార్యను మానసికంగా నరకం అనుభవించేలా చేశాయి.
అసలేం జరిగింది?
బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఇదే విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త మాటలతో తీవ్ర మనస్తాపానికి, ఆగ్రహానికి గురైన మాలశ్రీ సహనం కోల్పోయింది. వెంటనే వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి రాజశేఖర్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. ఛాతీ భాగంలో బలంగా కత్తితో పొడవడంతో ఆయన కుప్పకూలిపోయాడు.
కేసు నమోదు..
గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే రాజశేఖర్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భర్తను హతమార్చిన మాలశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క మాట.. ఒక క్షణపు ఆవేశం ఇద్దరి జీవితాలను అర్ధంతరంగా ముగించింది.
Also Read: మోదీకి భజన చేసుకో.. అమిత్ షాకు పూజ చేసుకో..! కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సెటైర్లు