BYD Denza D9 India Debut: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్ రాబోతోంది. చైనాకు చెందిన BYD ప్రీమియం బ్రాండ్ డెంజా (Denza) నుంచి వస్తున్న D9 ఎలక్ట్రిక్ MPV తాజాగా భారత్ లో తొలిసారిగా కనిపించింది. నవంబర్ 13న ఈ మోడల్‌తో పాటు Z9 GT కూడా దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే Z9 GT రోడ్లపై కనిపించగా, ఇప్పుడు D9 కూడా ఎలాంటి కవరింగ్ లేకుండా దర్శనమిచ్చింది.
డెంజా D9ను పూర్తిగా నిర్మించిన యూనిట్ (CBU) రూపంలో భారత్‌కు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. సో, దీని ధర రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉండొచ్చని అంచనా. మార్కెట్లోకి వస్తే MG M9కు నేరుగా పోటీ ఇవ్వనుంది. అలాగే టయోటా వెల్ ఫైర్ కు ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో డెంజా D9 ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. భారత్ కు పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో 103.36kWh BYD బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లలో లభిస్తుంది. FWD వెర్షన్ 313hp పవర్, 360Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. AWD వెర్షన్‌లో రెండు మోటార్లు ఉండగా, ఇవన్నీ కలిపి 374hp పవర్, 470Nm టార్క్ ను అందిస్తాయి. భారత్ లో ఏ వేరియంట్‌ను తీసుకొస్తారనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
డెంజా D9 చూడటానికి పెద్దగా, అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో ప్రత్యేకమైన డిజైన్‌తో కూడిన భారీ క్లోజ్డ్ గ్రిల్, LED హెడ్‌లైట్లు, DRLలు ఉన్నాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్డ్ స్లైడింగ్ డోర్లు, వెనుకవైపు పూర్తి వెడల్పుతో ఉండే LED టెయిల్ లైట్ బార్ ఉంటుంది.
ఈ MPVలో మూడు వరుసల్లో మొత్తం ఏడు సీట్లు ఉంటాయి. నప్పా లెదర్ సీట్లు, వుడ్ ఇన్‌సర్ట్స్, స్వెడ్ ఫినిషింగ్‌తో క్యాబిన్‌కు ప్రీమియం లుక్ ఇచ్చారు. రెండో వరుసలో ఉండే కెప్టెన్ సీట్లకు వెంటిలేషన్, హీటింగ్, మసాజ్, పవర్డ్ అడ్జస్ట్ మెంట్ సదుపాయాలు ఉన్నాయి. వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు, టచ్‌స్క్రీన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి.
డ్యాష్‌బోర్డుపై 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. వీటితో పాటు 14 స్పీకర్ల డైనాడియో సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ADAS, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, TPMS కూడా ఉన్నాయి. అయితే, పూర్తి వివరాలు, ధరలను నవంబర్ 13న కంపెనీ వెల్లడించనుంది.
Read Also: రోల్స్ రాయిస్ ను తలదన్నేలా BYD కొత్త లగ్జరీ కారు.. సింగిల్ ఛార్జ్ తో 1,000 కి.మీ రేంజ్!