Supreme Court: స్వేచ్ఛ బ్యూరో: ఏదైనా క్రిమినల్ కేసులో ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా పోలీసు లేదా జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
ఉద్యోగం నుంచి సస్పెండ్
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జే.బీ.పార్దివాలా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పునిచ్చింది. బీహార్ లోని సమస్తీపూర్ సదర్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ విశ్వజీత్ సింగ్ 4వేల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ తర్వాత ఆయన దాదాపు 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దాంతో ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు.
సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
కాగా, కస్టడీ తర్వాత సదరు ఉద్యోగి సస్పెన్షన్ ను రద్దు చేసి తిరిగి అదే ఆస్పత్రిలో, అదే పోస్టులో నియమించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని వెంటనే పరిశీలించాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ రూల్ 10(2)(ఏ) ప్రకారం ‘డీమ్డ్ సస్పెన్షన్’ నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. అయితే, చాలా చోట్ల అధికారులు దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకునేందుకు కీలకంగా మారనుంది.
Also Read: మూడు రోజుల్లో 500 కోట్లు.. మరి రూ.5వేల కోట్ల లెక్కేంటి..?