Keesara ACB: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్.. ప్రజల భూ సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ కార్యాలయం.. రెండూ అవినీతి ఆరోపణలతో వార్తల్లోకెక్కాయి. కీసర మండలంలో వరుసగా వెలుగుచూస్తున్న ఏసీబీ కేసులు అధికార యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పోలీస్‌శాఖలో ఒకరి తర్వాత మరొకరిపై లంచం ఆరోపణలు రావడం.. మరోవైపు రెవెన్యూ శాఖలోనూ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన వ్యవహారం బయటపడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన ఖాకీలే లంచాల ఆరోపణల్లో చిక్కుకోవడం.. ప్రజల భూముల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే డబ్బుల కోసం వేధించారనే ఫిర్యాదులు రావడం కీసరలో పాలన తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కీసర పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, అందులో రూ.5 లక్షలు స్వీకరించేందుకు ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కీసర చెరువు సమీపంలో కారులో నగదు తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు పాత్రపైనా ఆరోపణలు రావడంతో ఆయనను సైతం విచారించారు.. గణేష్ నిమజ్జన విధుల్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది.
రెవెన్యూ శాఖలోనూ అవినీతి ఆరోపణలు బయటపడ్డాయి. వ్యవసాయ భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేసిన కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌కుమార్‌రెడ్డి, అందులో భాగంగా రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో వీఆర్వో విజయ్‌కుమార్, ప్రైవేటు వ్యక్తి బాలకృష్ణ పాత్రపైనా విచారణ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Also Read: బిగ్ బ్రేకింగ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!
కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్ చార్జిషీట్‌లో అనుకూలంగా వ్యవహరించడంతోపాటు త్వరగా దాఖలు చేసేందుకు ఓ బాధితుడి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు. బాధితుడు అంత మొత్తం చెల్లించలేనని చెప్పడంతో చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరింది. నగదు కోసం ఎస్‌ఐ తరచూ ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు అధికారుల సూచన మేరకు రూ.2 లక్షలను కవర్‌లో పెట్టుకుని నాగారం పరిధిలోని శిల్పానగర్ కాలనీకి వెళ్లాడు. అక్కడ నగదు స్వీకరిస్తున్న ఎస్‌ఐను ఏసీబీ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఒకే మండలంలో పోలీస్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులపై వరుసగా ఏసీబీ కేసులు వెలుగుచూడటం యాదృచ్ఛికమా? లేక కార్యాలయాల్లో వేళ్లూనుకున్న అవినీతి వ్యవస్థకు నిదర్శనమా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తేనే పనులు జరుగుతున్నాయా? సాధారణ ప్రజలకు లంచం లేకుండా ప్రభుత్వ సేవలు అందడం లేదా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం పట్టుబడిన అధికారులపైనే కాకుండా, ఈ వ్యవహారాల వెనుక ఉన్న ఇతరుల పాత్రపైనా సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వరుస ఏసీబీ దాడులతోనైనా కీసరలో అవినీతి అధికారుల తీరు మారుతుందా? ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల బెడదకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది? అన్నది వేచి చూడాలి.
Also read: హైదరాబాద్‌లో హ్యాకర్ల సునామీ.. మూడు NBFCలపై సైబర్ దాడి, రూ. 18 కోట్లు స్వాహా!