Electric Scooter Boom in India: దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్ స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ మోడళ్లను ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్న కొత్త మోడళ్లు ఈ విభాగానికి మరింత ఊపునిస్తున్నాయి. 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు దేశ వ్యాప్తంగా ఏకంగా 13,09,127 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 8,23,310 యూనిట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 4.86 లక్షల యూనిట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో అమ్మకాలు సుమారు 60 శాతం పెరిగాయి.
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025లో ఏడాది మొత్తం 12.92 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే 2026లో కేవలం మొదటి ఎనిమిది నెలల్లోనే ఆ సంఖ్యను అధిగమించడం విశేషం. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం.. ఆగస్టు 2026లో సుమారు 1.75 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. జూలైలో నమోదైన దాదాపు 1.98 లక్షల యూనిట్లతో పోలిస్తే ఆగస్టులో అమ్మకాలు తగ్గాయి. వర్షాకాలంలో వాహనాల కొనుగోళ్లు కొంత మందగించడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
2026 జూలై ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌కు ప్రత్యేకమైన నెలగా నిలిచింది. ఆ నెలలో దాదాపు రెండు లక్షల యూనిట్లు అమ్ముడవడంతో ఇప్పటివరకు అత్యధిక నెలవారీ విక్రయాలు నమోదయ్యాయి. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద లభించే ప్రయోజనాలు జూలై చివర్లో ముగుస్తాయనే అంచనాలు కూడా కొనుగోళ్లను ముందుకు తీసుకొచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ పథకాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించడంతో ఆగస్టులో కొనుగోళ్లపై కొంత ప్రభావం పడింది.
ఆగస్టులో అమ్మకాలు తగ్గినప్పటికీ, రాబోయే పండుగ సీజన్‌పై కంపెనీలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. నవరాత్రి నుంచి దీపావళి వరకు దేశవ్యాప్తంగా వాహనాల కొనుగోళ్లు సాధారణంగా పెరుగుతాయి. శుభ ముహూర్తాల కోసం చాలామంది వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం కూడా ఆగస్టు గణాంకాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. FADA రిటైల్ డేటా ప్రకారం, ఆగస్టులో మొత్తం టూ వీలర్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ మోడళ్ల వాటా 10.68 శాతానికి చేరింది. అంటే ప్రతి 100 టూ వీలర్స్ లో పది కంటే ఎక్కువ వాహనాలు ఎలక్ట్రిక్ మోడళ్లే కావడం విశేషం. గమనార్హం.
ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణకు మరో కారణం కొత్తగా వస్తున్న సరసమైన మోడళ్లు. పెట్రోల్ స్కూటర్ల ధరలకు దగ్గరగా ఉండేలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడంతో సాధారణ వినియోగదారులకు కూడా ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. ఓలా S1Z, ఏథర్ కోనార్క్ లాంటి కొత్త మోడళ్లు ఈ సెగ్మెంట్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. ధరలు తక్కువగా ఉండటం, కొత్త మోడళ్లు పెరగడం, ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
Read Also: సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!