India real estate price rise| కొత్త ఇల్లు నిర్మించాలన్నా, లేదా కొనాలన్నా.. ఇటుకలు, సిమెంట్, స్టీల్, కూలీల ఖర్చు మాత్రమే చూడాల్సిన రోజులు పోయాయి. కానీ మీ ఇంటి ధరలో కనిపించని మరో పెద్ద ఖర్చు ఉంది. ఇప్పుడు మీరు కొనుగోలు చేసే ఇంటి ధరలో ఆ ఇంటి కింద ఉన్న భూమి విలువ కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది. అందుకే నిర్మాణ ఖర్చుల కంటే ఇళ్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 2021 నుంచి 2025 మధ్య భారత్‌లోని ఏడు ప్రధాన నగరాల్లో నిర్మాణ ఖర్చులు 34 శాతం పెరిగాయి. అదే సమయంలో ఇళ్ల ధరలు ఏకంగా 59 శాతం పెరిగాయి.
అనరాక్ పాపర్టీ కన్‌సల్టెంట్స్ కంపెనీ చేసిన రీసెర్చ్ ప్రకారం.. 2021లో చదరపు అడుగు నిర్మాణ ఖర్చు సుమారు రూ.2,681గా ఉంది. 2025 నాటికి అది రూ.3,604కు చేరింది. అదే సమయంలో, నివాస ఆస్తుల సగటు విలువ చదరపు అడుగుకు రూ.5,826 నుంచి రూ.9,260కు పెరిగింది. నిర్మాణ ఖర్చులు ఏటా సగటున 6.9 శాతం పెరిగాయి. అయితే ఇళ్ల ధరలు దాదాపు 12 శాతం చొప్పున పెరిగాయి. నిర్మాణ ఖర్చులు ధరల పెరుగుదలలో సుమారు 66 శాతం వరకు ప్రభావం చూపించాయని అనరాక్ అంచనా వేసింది. మిగిలిన పెరుగుదలకు భూమి ధరలు, డెవలపర్ మార్జిన్లు, డిమాండ్ సప్లై పరిస్థితులు కారణమయ్యాయి.
ఇళ్ల ధరలు పెరగడానికి భూమి ధరలు ఇప్పుడు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారాయి. ఏడు ప్రధాన నగరాల్లో 2021 నుంచి 2026 మొదటి అర్ధభాగం వరకు భూమి ధరలు సుమారు 50 నుంచి 120 శాతం పెరిగాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూమి ధరలు సుమారు 70 నుంచి 130 శాతం పెరిగాయి. బెంగళూరులో ఈ పెరుగుదల దాదాపు 60 నుంచి 120 శాతంగా ఉంది. మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాలు, మెరుగైన రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు దీనికి కారణమవుతున్నాయి. కొత్త రవాణా సౌకర్యాలు ఒక ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. దాంతో అక్కడ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. భూమి ధరలు కూడా పెరుగుతాయి.
భూమితో పాటు నిర్మాణ సామగ్రి ధరలు కూడా పెరిగాయి. 2021 నుంచి 2025 మధ్య ప్రీమియం ఇళ్ల నిర్మాణ ఖర్చులు 39 శాతం పెరిగాయి. చదరపు అడుగుకు రూ.3,861 నుంచి రూ.5,370కు చేరాయి.
స్టీల్, ఇంధనం, రవాణా, టైల్స్, గ్లాస్ వంటి వస్తువుల ధరలు కూడా పెరిగాయి. కూలీల ఖర్చులు మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో 25 నుంచి 30 శాతం వరకు ఉంటాయి.
నేటి అపార్ట్‌మెంట్లలో విద్యుత్, ప్లంబింగ్, ఎయిర్ కండిషనింగ్, లిఫ్టులు, ఫైర్ సేఫ్టీ వంటి సిస్టమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో MEP ఖర్చులు 2023 నుంచి 2025 మధ్య 17 శాతానికి పైగా పెరిగాయి. 2025లో ఇవి మొత్తం నిర్మాణ ఖర్చులో దాదాపు 22 శాతానికి చేరాయి.
నిర్మాణ ఖర్చులు పెరిగిన ప్రతిసారీ డెవలపర్లు మొత్తం భారాన్ని కొనుగోలుదారులపై వేయలేరు. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు ధరలను వెంటనే మార్చడం కష్టం. కొత్త ప్రాజెక్టుల్లో ధరలను మార్చే అవకాశం ఉన్నప్పటికీ, కొనుగోలుదారుల సామర్థ్యం ఒక పరిమితిగా ఉంటుంది.
Also Read: ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే
నిర్మాణ ఖర్చులను తగ్గించేందుకు టెక్నాలజీ, మెరుగైన ప్రణాళిక ఉపయోగపడుతుంది. కానీ మంచి ప్రాంతాల్లో భూమి పరిమితంగా ఉంటుంది. అందుకే ఒకే రకమైన రెండు అపార్ట్‌మెంట్లకు కూడా చాలా భిన్నమైన ధరలు ఉండవచ్చు. వాటి నిర్మాణం ఒకేలా ఉన్నప్పటికీ, భూమి విలువ, ప్రాంతం ధరను మారుస్తాయి. కాబట్టి ఇల్లు ఎందుకు ఖరీదవుతోందని అడిగితే, గోడలు, కిటికీలను మాత్రమే చూడకండి. ఇల్లు ఉన్న భూమి ధరను కూడా చూడాలి.
Also Read: జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే