Honda Rebel 300 Delivery Date: హోండా బైక్ ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హోండా రెబెల్ 300 బైక్ డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నవంబర్ నెలలోనే ఈ బైక్‌ను కొనుగోలుదారులకు అందించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న కొంతమంది కస్టమర్లకు డీలర్ల నుంచి డెలివరీలకు సంబంధించి ఫోన్లు వస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకేసారి డెలివరీలు ప్రారంభం కాకపోవచ్చని తెలుస్తోంది.
హోండా ఈ ఏడాది జూలైలో తన కొత్త ఉత్పత్తుల్లో భాగంగా రెబెల్ 300ను పరిచయం చేసింది. ఈ బైక్ ధరను రూ.2.22 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో ఇ-క్లచ్ వెర్షన్ కావాలంటే అదనంగా రూ.40,000 చెల్లించాలి. కొంతమంది కొనుగోలుదారులకు నవంబర్ 6 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని డీలర్లు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో నవంబర్ 10 నుంచి డెలివరీలు ఉండవచ్చని చెప్తున్నారు. అయితే, కొన్ని హోండా బిగ్ వింగ్ షోరూమ్‌లు నవంబర్ చివరి వారం లేదంటే డిసెంబర్ మొదటి వారంలో బైక్‌లను అందిస్తామని వెల్లడించాయి.
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని హోండా బిగ్‌వింగ్ డీలర్ల నుంచి అందిన సమాచారం ప్రకారం డెలివరీ షెడ్యూల్ వేర్వేరుగా ఉంది. ఢిల్లీలో నవంబర్ మొదటి వారంలో డిస్ ప్లే మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ మధ్య నుంచి చివరి వరకు డెలివరీలు ప్రారంభం కావచ్చని అంచనా. హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో నవంబర్ మధ్యలో బైక్‌ల డిస్పాచ్‌లు ప్రారంభమై, డిసెంబర్ మొదటి వారంలో డెలివరీలు జరిగే అవకాశం ఉంది. పూణేలో మాత్రం జనవరి 2027 వరకు వేచి చూడాల్సి రావచ్చని తెలుస్తోంది.
హోండా రెబెల్ 300లో 286cc ఇంజన్‌ను అందించారు. ఇది 27.6hp పవర్‌తో పాటు 24.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో స్టాండర్డ్, ఇ-క్లచ్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ బరువు 173 కిలోలు కాగా, ఇ-క్లచ్ వెర్షన్ బరువు 176 కిలోలు. రెండు మోడళ్లలోనూ 11.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. సీటు ఎత్తు 690mm కావడంతో తక్కువ ఎత్తు ఉన్నవారికి కూడా ఈ బైక్ నడపడం సౌకర్యంగా ఉంటుంది.
రెబెల్ 300లో సర్క్యులర్ TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ, USB-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇ-క్లచ్ వేరియంట్‌లో అదనంగా క్లచ్ ఆపరేషన్ సౌకర్యం లభిస్తుంది. మార్కెట్లో ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350, జావా 42 బాబర్, జావా పెరాక్ లాంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. అయితే, హోండా ఇప్పటివరకు అధికారికంగా డెలివరీ తేదీలను ప్రకటించలేదు. బైక్ బుక్ చేసుకున్నవాళ్లు కచ్చితమైన సమాచారం కోసం బిగ్ వింగ్ షోరూమ్‌ను కాంటాక్ట్ కావడం మంచిది.
Read Also: నార్టన్ కొత్త రోడ్‌స్టర్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!