Maruti Dzire 35 Lakh Units: భారత కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు సరిపోయే కార్ల విషయంలో మారుతి మోడళ్లకు మంచి ఆదరణ ఉంది. ఈ జాబితాలో డిజైర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఈ సెడాన్ మరో అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటింది. ఈ రికార్డును సాధించడానికి డిజైర్‌కు 18 సంవత్సరాల 9 నెలల సమయం పట్టింది. ఆల్టో, స్విఫ్ట్, వాగన్ ఆర్ తర్వాత 35 లక్షల ఉత్పత్తి మార్కును అధిగమించిన నాలుగో మారుతి మోడల్‌గా డిజైర్ నిలిచింది.
మారుతి డిజైర్ ఉత్పత్తి జనవరి 2008లో ప్రారంభమైంది. అదే ఏడాది మార్చిలో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. మొదట్లో దీనిని స్విఫ్ట్ డిజైర్ పేరుతో విక్రయించేవారు. అయితే 2017లో మూడో తరం మోడల్ పరిచయంతో ‘స్విఫ్ట్’ పేరును తొలగించి కేవలం డిజైర్‌గా కొనసాగించారు. ప్రస్తుతం ఈ సెడాన్ నాలుగో తరం మోడల్‌లో అందుబాటులో ఉంది. ఈ కొత్త తరం కారును 2024లో మారుతి మార్కెట్లోకి తీసుకొచ్చింది.
డిజైర్ మొదటి 5 లక్షల యూనిట్ల ఉత్పత్తిని పూర్తి చేయడానికి సుమారు 4 సంవత్సరాల 6 నెలలు పట్టింది. 2012 జూలైలో ఈ మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత ఉత్పత్తి వేగం పెరిగింది. తదుపరి 5 లక్షల యూనిట్లను కేవలం 2 సంవత్సరాల 9 నెలల్లోనే తయారు చేసింది. ఆ తర్వాత మరో 2 సంవత్సరాల 3 నెలల్లోనే 15 లక్షల యూనిట్ల ఉత్పత్తి మార్కును దాటింది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఉత్పత్తి వేగం కొంత తగ్గింది. 25 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడానికి జూన్ 2022 వరకు సమయం పట్టింది. అక్కడి నుంచి 35 లక్షల యూనిట్ల స్థాయికి చేరుకోవడానికి మరో 4 సంవత్సరాల 4 నెలలు పట్టింది. డిజైర్‌కు ఆదరణ పెరుగుతున్న కొద్దీ ఉత్పత్తి కూడా వేగంగా పెరిగింది.
ప్రస్తుతం మారుతి డిజైర్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తోంది. ఇది 83hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్‌లో 70hp పవర్ అందించే ఆప్షన్ కూడా ఉంది. పెట్రోల్, CNG వేరియంట్లు మాన్యువల్, AMT గేర్ బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధరలు రూ.6.31 లక్షల నుంచి రూ.9.54 లక్షల వరకు ఉన్నాయి.
భారత మార్కెట్లో డిజైర్‌కు టాటా టిగోర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా లాంటి సెడాన్లు పోటీగా ఉన్నాయి. అయినప్పటికీ, 35 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం డిజైర్‌కు ఉన్న డిమాండ్ ను తెలియజేస్తోంది.
Read Also: డిసెంబర్ 2న హోండా సంచలనం.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ!