Upcoming Tata Electric SUVs: ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 2027లో 4 కొత్త SUVలను తీసుకురాబోతోంది. ఇంతకీ అవేంటి? వాటి ప్రత్యేకతలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా తీసుకురానున్న కొత్త ఎలక్ట్రిక్ SUVల్లో సఫారీ EV ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.24 లక్షల నుంచి రూ.32 లక్షల వరకు ఉండవచ్చు. ఈ SUVని 6, 7 సీట్ల ఆప్షన్లలో అందించనున్నట్లు తెలుస్తోంది. 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్‌లతో పాటు సింగిల్ మోటార్ రియర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ సీట్లు, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్, JBL ఆడియో సిస్టమ్, లెవల్-2+ ADAS లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.
టాటా నెక్సాన్ EV కూడా పూర్తిగా కొత్త రూపంలో రానుంది. 2027 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ మోడల్ ధర రూ.14.50 లక్షల నుంచి రూ.19.50 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. కొత్త డిజైన్‌తో పాటు విశాలమైన క్యాబిన్, మెరుగైన వెనుక సీటు స్పేస్ ఇందులో ఉండనున్నాయి. 45kWh నుంచి 55kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు లభించవచ్చని సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే అవకాశం ఉంది.
ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగుపెట్టేందుకు టాటా మోటార్స్ అవిన్య బ్రాండ్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అవిన్య X SUVని 2027 చివర్లో తీసుకురావచ్చని అంచనా. దీని ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉండవచ్చు. ఈ SUVలో 80kWh కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని అంచనా. 800V అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ దీని మరో ప్రత్యేకత కానుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు చెందిన EMA ప్లాట్‌ఫామ్ ఆధారంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు.
టాటా తీసుకురానున్న మరో కొత్త ఎలక్ట్రిక్ SUV కునో EV. ఇది నెక్సాన్ EV, సియెర్రా EVల మధ్య స్థానాన్ని దక్కించుకోనుంది. 2027-28 మధ్య మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అంచనా ధర రూ.14 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉండవచ్చు. ఈ SUVలో 55kWh, 65kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా. డ్యూయల్ స్క్రీన్ డిజిటల్ కాక్‌పిట్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ఈ కారును తయారు చేసే అవకాశం ఉంది.
Read Also: పండుగ సీజన్‌లో EV కార్లపై అదిరిపోయే డీల్స్.. టాటా నుంచి ఎంజీ వరకు లక్షల్లో ఆఫర్లు!