Bajaj Pulsar 180 Discontinued Again: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన పాపులర్ మోడళ్లలో ఒకటైన పల్సర్ 180 (Pulsar 180)ని మరోసారి నిలిపివేసినట్లు సమాచారం. ఇటీవల బజాజ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ బైక్ కనిపించడం లేదు. దీంతో పల్సర్ 180 ఉత్పత్తిని దశలవారీగా నిలిపివేస్తున్నట్లు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ మోడల్ నిలిచిపోవడం ఇది రెండోసారి కావడం విశేషం.
బజాజ్ పల్సర్ 180ను తొలిసారిగా 2022లో మార్కెట్ నుంచి తొలగించింది. అయితే, ఈ మోడల్‌కు ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని, ఈ ఏడాది ఏప్రిల్‌లో మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్లో టీవీఎస్ అపాచీ RTR 180కు పోటీగా ఈ బైక్‌ను తిరిగి ప్రవేశపెట్టినట్లు భావించారు. కానీ, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి ఈ మోడల్ వెబ్‌సైట్ నుంచి మాయమైంది. ఇటీవల బజాజ్, కేటీఎం ఇండియా వెబ్ సైట్లను అప్‌డేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పల్సర్ 180ను ‘ఒరిజినల్’ విభాగం నుంచి తొలగించారు. అయితే, పల్సర్ 125, 150, 220F మోడళ్లు మాత్రం వెబ్‌సైట్‌లో కొనసాగుతున్నాయి.
పల్సర్ 180ను తిరిగి తీసుకొచ్చినప్పటికీ, బజాజ్ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. పల్సర్ 125, 150 మోడళ్లకు ఇటీవల ఇంజిన్, ప్లాట్ ఫామ్ పరంగా మరిన్ని అప్ డేట్స్ ఇచ్చిన సంస్థ.. పల్సర్ 180 విషయంలో మాత్రం అలాంటి మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ బైక్ నిలిపివేతపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పల్సర్ 180లో 178.6cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8,500rpm వద్ద 17hp పవర్, 6,500rpm వద్ద 15Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. ఈ బైక్ ధర రూ.1.22 లక్షలు (ఎక్స్ షోరూమ్). టీవీఎస్ అపాచీ RTR 180తో పోలిస్తే ఇది సుమారు రూ.4,000 తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
పల్సర్ 180ను దశలవారీగా మార్కెట్ నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే డీలర్ షిప్ లలో ఉన్న స్టాక్ మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చు. ఈ బైక్ పై ఆసక్తి ఉన్నవారు సమీపంలోని బజాజ్ షోరూమ్‌లో స్టాక్ వివరాలు తెలుసుకోవడం మంచిది. భవిష్యత్తులో డిమాండ్ పెరిగితే ఈ మోడల్ ను మళ్లీ తీసుకొచ్చే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేం.
Read Also: ఇండియాలోకి నార్టన్ న్యూ బైక్.. 585cc ఇంజిన్‌తో రాబోతున్నఅట్లాస్!