Kia Syros EV Real Range Tested: ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా చూసేది దాని రేంజ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు? నగరాల్లో, హైవేలపై పనితీరు ఎలా ఉంటుంది? అనే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో కియా (Kia) నుంచి వచ్చిన సైరోస్ ఈవీ (Syros EV) రియల్ వరల్డ్ రేంజ్ ఎంత ఇస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంది. తాజాగా నిర్వహించిన టెస్టులో ఈ కారు క్రేజీ రిజల్ట్స్ ను ఇచ్చింది. ఇంతకీ అవేంటంటే..
కియా సైరోస్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 42kWh, 51.4kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. రెండింటిలోనూ లిథియం-అయాన్ NMC సెల్ టెక్నాలజీని ఉపయోగించారు. చిన్న బ్యాటరీ వేరియంట్ ధర సుమారు రూ.13.5 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్ వేరియంట్ల ధర రూ.17 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంటుంది. 51.4kWh బ్యాటరీ కలిగిన ఎక్స్ టెండెడ్ రేంజ్ వెర్షన్‌లో ముందు భాగంలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 171hp పవర్, 255Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.
తాజా పరీక్షలో సైరోస్ ఈవీని Eco డ్రైవింగ్ మోడ్‌లో నడిపారు. సిటీ ప్రయాణాల్లో రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను L3 మోడ్‌లో ఉంచినప్పుడు 9.52km/kWh కెపాసిటీని కనబరిచింది. దీని ప్రకారం పూర్తి ఛార్జింగ్‌పై సుమారు 489 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. అయితే, హైవే ప్రయాణంలో రిజల్ట్స్ కొంత డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడ రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను L1 మోడ్‌లో ఉంచగా 6.14km/kWh కెపాసిటీ నమోదైంది. ఈ లెక్కన సుమారు 316 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే లభిస్తుంది. కారు బాక్సీ డిజైన్ కారణంగా హైవేపై గాలి నిరోధకత పెరిగి సామర్థ్యం తగ్గి ఉంటుందని తెలుస్తోంది.
సిటీ, హైవే ప్రయాణాల్లో నమోదైన ఫలితాలను కలిపి చూస్తే సగటు సామర్థ్యం 7.83km/kWhగా ఉంది. దీని ప్రకారం 51.4kWh బ్యాటరీతో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 402 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
ఛార్జింగ్ విషయంలోనూ సైరోస్ ఈవీ పనితీరును టెస్ట్ చేశారు. 100kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం ఛార్జింగ్‌కు 39 నిమిషాలు పడుతుందని కియా చెబుతోంది. పరీక్షలో 480kW ఛార్జర్ ఉపయోగించినప్పుడు 20 నుంచి 80 శాతం ఛార్జింగ్‌కు 35 నిమిషాలు పట్టింది. అయితే, 80 నుంచి 100 శాతం ఛార్జింగ్‌కు మరో 49 నిమిషాలు అవసరం అయ్యింది. సిటీ ప్రయాణాలకు మంచి కెపాసిటీ, సుమారు 400 కిలోమీటర్ల రియల్ రేంజ్‌తో కియా సైరోస్ ఈవీ కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: మారుతి బ్రెజ్జా టర్బో 1,200 కి.మీ. రివ్యూ.. మైలేజ్ ఎంత? పనితీరు ఎలా ఉందంటే?