Jeep Compass Diesel Automatic: జీప్ ఇండియా తన కంపాస్ ఎస్‌యూవీ లైనప్ లో కొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది. కంపాస్ స్పోర్ట్ డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్‌ను రూ. 21.99 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎంట్రీ లెవల్ స్పోర్ట్ వేరియంట్ లో మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు తొలిసారిగా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది. దీంతో ఇది కంపాస్ శ్రేణిలో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఆటోమేటిక్ వేరియంట్ గా గుర్తింపు పొందింది. ఈ కారు డెలివరీలు 2026 నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నాయి.
కొత్త కంపాస్ స్పోర్ట్ ఆటోమేటిక్‌లో ప్రత్యేకమైన డిజైన్ మార్పులు పెద్దగా లేకపోయినా, ఆకర్షణీయమైన రూపాన్ని కొనసాగించింది. ఇందులో LED హెడ్ ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), క్రోమ్ విండో సరౌండ్స్, 17 అంగుళాల సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ ORVMలు, రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా అందించారు. అదనంగా రూ. 29,900 చెల్లించి యాక్సెసరీ ప్యాక్ ను కొనుగోలు చేయవచ్చు. ఇందులో స్వూష్ డీకాల్స్, మడ్ ఫ్లాప్స్, ఆల్ వెదర్ ఫ్లోర్ మ్యాట్స్, యాంబియంట్ లైటింగ్, డాష్ క్యామ్ లాంటి సౌకర్యాలు ఉంటాయి.
కారు లోపల డార్క్ క్యాబిన్ థీమ్‌తో పాటు డాష్ బోర్డ్, డోర్ ప్యాడ్స్ పై గ్రే ఫ్యాబ్రిక్ ఇన్‌సర్ట్స్ ఇచ్చారు. సీట్లపై బ్లూ స్టిచింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, 8.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉన్నాయి. నాలుగు స్పీకర్ల సౌండ్ సిస్టమ్, 3.5 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి.
మాన్యువల్ వేరియంట్ తో పోలిస్తే ఆటోమేటిక్ మోడల్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఆటో హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్ లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ సెన్సార్లతో కూడిన రివర్సింగ్ కెమెరా అందుబాటులో ఉన్నాయి.
జీప్ కంపాస్ స్పోర్ట్ ATలో 2.0 లీటర్ల నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 170hp శక్తితో పాటు 350Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ను 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ యాడ్ చేశారు. ఇందులో ముందు చక్రాలకు మాత్రమే పవర్ అందుతుంది. మెరుగైన ప్రయాణ సౌకర్యం కోసం ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డాంపింగ్ (FSD) సస్పెన్షన్‌ను కొనసాగించారు.
మొత్తంగా చూస్తే.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో కూడిన కంపాస్ ను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జీప్ కొత్త కస్టమర్లను ఆకర్షించాలని చూస్తోంది. అయితే, కొనుగోలు చేసే ముందు ఆన్ రోడ్ ధర, అందుబాటులో ఉన్న ఫీచర్లు, ఇతర వేరియంట్ల గురించి తెలుసుకోవడం మంచిది.
Read Also: మహీంద్రా థార్ E To హ్యుందాయ్ ఇన్‌స్టర్.. నవంబర్ లో ఎంట్రీ ఇవ్వనున్నక్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!