Mahindra October 2026 Sales Report: భారత ఆటోమొబైల్ మార్కెట్లో పండుగ సీజన్ సందడి కొనసాగుతోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కార్ల కొనుగోళ్లు పెరగడంతో అక్టోబర్ 2026లో ప్రముఖ కంపెనీలు మంచి అమ్మకాలను నమోదు చేశాయి. ఈ లిస్టులో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా నిలిచింది. అక్టోబర్ నెలలో ఏకంగా 73,338 SUVలను విక్రయించి అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించింది. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల్లోనూ కంపెనీ అదిరిపోయే రిజల్ట్స్ సాధించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా అక్టోబర్ 2026లో 73,338 యూనిట్ల దేశీయ SUVలను అమ్మింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ప్యాసింజర్ యుటిలిటీ వెహికల్స్ విభాగంలో 2 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎగుమతులను కలుపుకుంటే అక్టోబర్ నెలలో మహీంద్రా మొత్తం 73,904 SUVలను అమ్మింది. ఇక అన్ని ఆటోమొబైల్ విభాగాలను కలిపి చూస్తే కంపెనీ మొత్తం అమ్మకాలు 1,31,109 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆటో అమ్మకాల్లో 9 శాతం వృద్ధి నమోదైంది.
అక్టోబర్ నెలలో SUVలు, పికప్ వాహనాలు, త్రీ వీలర్లకు మంచి డిమాండ్ కనిపించిందని మహీంద్రా వెల్లడించింది. పండుగ సీజన్‌లో కొనుగోలుదారుల నుంచి వచ్చిన స్పందన అమ్మకాల పెరుగుదలకు కారణం అయ్యిందని కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ నెల తమ కంపెనీకి ఎంతో ప్రత్యేకమని మహీంద్రా ఆటోమోటివ్ బిజినెస్ ప్రెసిడెంట్ ఆర్. వేలుస్వామి వెల్లడించారు. SUVల అమ్మకాలు 73,338 యూనిట్లకు, మొత్తం వాహనాల అమ్మకాలు 1,31,109 యూనిట్లకు చేరినట్లు తెలిపారు.
కంపెనీ ఇటీవల పరిచయం చేసిన తన తొలి CNG వాహనం XUV 3XO ZNGకు కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని మహీంద్రా తెలిపింది. కొత్త మోడళ్లతో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాహనాలకు వచ్చిన డిమాండ్ కూడా అమ్మకాల వృద్ధికి తోడ్పడింది.
2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మహీంద్రా దేశీయ యుటిలిటీ వాహనాల అమ్మకాలు 4,31,480 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. రాబోయే నెలల్లోనూ కొత్త మోడళ్లు, పండుగల తర్వాత కొనుగోళ్ల ట్రెండ్ కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపనున్నాయి.
Read Also: మారుతి అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 4 కొత్త కార్ల ఎంట్రీ!