Upcoming Electric Scooters November 2026: దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో 2026 చివరి నాటికి కొన్ని కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. టీవీఎస్, సుజుకి, ఓబెన్, అల్ట్రావయోలెట్ లాంటి సంస్థలు కొత్త మోడళ్లు, ప్లాట్ ఫామ్ పై పని చేస్తున్నాయి. వీటిలో కొన్ని కుటుంబ అవసరాలకు, మరికొన్ని స్పోర్టీ రైడింగ్, రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్నాయి.
టీవీఎస్ పాపులర్ జూపిటర్ స్కూటర్ కుటుంబాన్ని కొత్త పవర్ ట్రెయిన్‌లతో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో CNG, ఎలక్ట్రిక్ వెర్షన్లు ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. వీటి ధర సుమారు రూ.90,000 నుంచి రూ.1.30 లక్షల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. 2026 చివరి నుంచి 2027 ప్రారంభం మధ్య అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు రేంజ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ లాంటి ఫీచర్లు ఉండవచ్చని సమాచారం. అయితే, ఈ వివరాలను టీవీఎస్ అధికారికంగా కన్ఫార్మ్ చేయలేదు.
సుజుకి నుంచి రానున్న మరో ఆసక్తికరమైన మోడల్ బర్గ్ మన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్. ఇప్పటికే ఈ స్కూటర్ ను పలు సందర్భాల్లో పరీక్షించినట్లు సమాచారం. మాక్సీ స్టైల్ డిజైన్‌తో ప్రీమియం అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.1 లక్ష నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండవచ్చు. 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, మోటార్ వివరాలు ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు.
ఓబెన్ ఎలక్ట్రిక్ తన O100 ప్లాట్‌ఫామ్ ఆధారంగా చౌకైన కమ్యూటర్ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని ధర సుమారు రూ.80,000గా ఉండవచ్చని అంచనా. 2026 నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. 100cc నుంచి 125cc పెట్రోల్ బైక్‌లను ఉపయోగించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్ ను రూపొందిస్తున్నారు. ఇందులో చైన్ డ్రైవ్, మిడ్-మౌంటెడ్ IPM మోటార్ ఉండవచ్చని తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం 3.4 kWhగా చెప్తున్నప్పటికీ, తుది వివరాలు అధికారిక ప్రకటన తర్వాతే వెల్లడికానున్నాయి.
అల్ట్రావయోలెట్ నుంచి టెసరాక్ట్ పేరుతో పనితీరుకు ప్రాధాన్యమిచ్చే అర్బన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ రానున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. 2026 చివరలో లేదంటే 2027 ప్రారంభంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇక టీవీఎస్ M1-S ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ కూడా ఆసక్తి రేపుతోంది. ఇందులో 12.5 kW మోటార్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 150 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని అంచనా. అయితే, దీని ధర, విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల సెగ్మెంట్ లో ఎంపికలు మరింత పెరుగుతాయి. తక్కువ ధరలో కమ్యూటర్ బైక్ కావాలనుకునేవారికి ఓబెన్ మోడల్, ప్రీమియం స్కూటర్ కోరుకునేవారికి సుజుకి బర్గ్ మన్ ఎలక్ట్రిక్ లాంటి ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.
Read Also: కొత్త లుక్‌లో హీరో డెస్టిని 110.. క్లాసిక్ ఎడిషన్ ధర ఎంతంటే?