Top 5 EVs With 600 Km Plus Range: ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకునే చాలామందికి ఎదురయ్యే ఫస్ట్ క్వశ్చన్ రేంజ్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు? దూర ప్రయాణాల్లో ఛార్జింగ్ కోసం పదేపదే ఆగాల్సి వస్తుందా? అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో 600 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి టాప్ 5 ఈవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మహీంద్రా BE 6 ఈ లిస్టులో ఎక్కువ రేంజ్ అందించే మోడళ్లలో మొదటి స్థానంలో ఉంది. దీని 79 kWh బ్యాటరీ ప్యాక్ తో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 682 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. INGLO ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ కారు స్పోర్టీ కూపే తరహా డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. దీని ధర సుమారు రూ.18.90 లక్షల నుంచి రూ.26.90 లక్షల వరకు ఉంది.
టాటా మోటార్స్ నుంచి వస్తున్న సియెర్రా EV కూడా లాంగ్ రేంజ్ కోరుకునే వారికి మంచి ఆప్షన్. ఈ ఎలక్ట్రిక్ SUV గరిష్టంగా 665 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని అంచనా. పాత సియెర్రా గుర్తుకొచ్చే రెట్రో డిజైన్‌కు ఆధునిక టెక్నాలజీని జోడించారు. దీని అంచనా ధర రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల వరకు ఉంది.
మహీంద్రా XEV 9e మరో ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ఇందులో 79 kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా, గరిష్టంగా 656 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు దీని ప్రత్యేకతలు. ఈ మోడల్ ధర సుమారు రూ.21.90 లక్షల నుంచి రూ.30.50 లక్షల వరకు ఉంది.
ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో కియా EV6 ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వేరియంట్‌ను బట్టి 663 నుంచి 708 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ఇందులో 800V ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండటం మరో ప్రత్యేకత. తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ.60.95 లక్షల నుంచి రూ.69.70 లక్షల వరకు ఉంది.
టాటా హారియర్ EV కూడా లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ SUVల జాబితాలో నిలుస్తోంది. ఇందులో 75 kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా, గరిష్టంగా 627 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ ఉండటం దీని ప్రత్యేకత. దూర ప్రయాణాలతో పాటు పవర్ ఫుల్ SUV కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర సుమారు రూ.21.49 లక్షల నుంచి రూ.30.23 లక్షల వరకు ఉంది.
Read Also: కార్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.. ఏకంగా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లు!