Renault Duster Hybrid Deliveries Start: భారత మార్కెట్లో రెనాల్ట్ డస్టర్ కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ SUV కొనాలనుకునే వారికి కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. డస్టర్ హైబ్రిడ్ వెర్షన్ డెలివరీలను దేశ వ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటికే ఈ మోడల్ ధరలను ప్రకటించిన రెనాల్ట్, తాజాగా వినియోగదారులకు వెహికల్స్ ను అందించడం మొదలుపెట్టింది.
రెనాల్ట్ గత నెలలో డస్టర్ హైబ్రిడ్ ధరను ప్రకటించింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.16.99 లక్షలుగా నిర్ణయించింది. అధికారికంగా ఈ మోడల్‌ను రెనాల్ట్ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇ-టెక్ 160 (Duster Strong Hybrid E-Tech 160) అని పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కస్టమర్లకు డెలివరీలు అందుబాటులోకి వచ్చాయి.
కొత్త డస్టర్ హైబ్రిడ్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4kWh సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీని జత చేశారు. ఈ మూడు కలిసి పనిచేయడం వల్ల మెరుగైన పనితీరుతో పాటు ఇంధన సామర్థ్యం కూడా లభిస్తుంది. ఈ హైబ్రిడ్ SUV మొత్తం 160bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మల్టీ మోడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ద్వారా ఇంజిన్ పవర్ వీల్స్ కు చేరుతుంది. ముఖ్యంగా ARAI కన్ఫర్మేషన్ ప్రకారం లీటర్ పెట్రోల్‌కు 29 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ లెక్కలు ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఆకర్షణీయంగా ఉండనుంది.
ఇప్పటికే రెనాల్ట్ డస్టర్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ను మూడో ఎంపికగా తీసుకొచ్చింది. డీజిల్ ఇంజిన్‌కు ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ టెక్నాలజీని అందించడం ఈ మోడల్‌లో మరో ప్రత్యేకత.
కొత్త డస్టర్ హైబ్రిడ్‌కు భారత మార్కెట్లో గట్టి పోటీ ఎదురుకానుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి సుజుకి విక్టోరిస్ లాంటి హైబ్రిడ్ SUVలతో పోటీ పడుతోంది.
రూ.16.99 లక్షల ప్రారంభ ధర, 160bhp పవర్, 29kmpl మైలేజీతో వచ్చిన డస్టర్ హైబ్రిడ్ భారత SUV మార్కెట్లో కొత్త పోటీకి తెరలేపనుంది. ముఖ్యంగా మంచి పనితీరుతో పాటు ఎక్కువ మైలేజీ కోరుకునే కస్టమర్లను ఈ మోడల్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Also: రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. డస్టర్‌పై ఏకంగా రూ.2.10 లక్షల బెనిఫిట్స్!