Maruti Suzuki August 2026 Price Hike: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 2026 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈసారి గరిష్టంగా రూ.30,000 వరకు ధరలు పెరగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తక్కువ వ్యవధిలోనే ధరలను పెంచడం ఇది రెండోసారి కాగా, 2026 సంవత్సరంలో ఇది మూడో ధరల పెంపు. ఇంతకుముందు జూన్ నెలలో కూడా మారుతి సుజుకి తన కార్ల ధరలను రూ.30,000 వరకు పెంచింది. ఇప్పుడు రెండు నెలలు కూడా పూర్తికాకముందే మరోసారి ధరలను సవరించాలని నిర్ణయించింది. దీంతో కొత్త కారు కొనాలని భావిస్తున్న వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన అధికారిక సమాచారంలో కార్ల పెంపు నిర్ణయానికి గల కారణాలను కంపెనీ వివరించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు పెరగడం, దేశంలో ద్రవ్యోల్బణం కొనసాగడం వల్ల తయారీ వ్యయం గణనీయంగా పెరిగిందని తెలిపింది. ఈ పెరిగిన ఖర్చును పూర్తిగా సంస్థ భరించడం కష్టంగా మారడంతో, కొంతభాగాన్ని ధరల రూపంలో వినియోగదారులపైకి మళ్లించాల్సి వచ్చిందని తెలిపింది. ధరలు పెరగకుండా ఉండేందుకు కంపెనీ తనవంతుగా అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు అంతర్గతంగా పలు మార్పులు చేయడంతో పాటు, ఖర్చులను నియంత్రించే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపింది. అయినప్పటికీ ముడిసరుకుల ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ధరల సవరణ తప్పనిసరైందని వివరించింది.
ఆగష్టులో ధరల పెంపు అన్ని కార్లపై ఒకే విధంగా ఉండవు. ఏ మోడల్, ఏ వేరియంట్ అనేదానిపై ఆధారపడి ధరల పెంపు మారుతుంది. కొన్ని మోడళ్లలో స్వల్ప పెరుగుదల ఉండగా, మరికొన్ని వాహనాలపై గరిష్టంగా రూ.30,000 వరకు పెరగవచ్చు. పూర్తి వివరాలను కంపెనీ ఆగస్టు ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది.
ఇటీవల ఆటోమొబైల్ రంగంలో ధరల పెంపు సాధారణంగా మారుతోంది. తయారీ వ్యయం పెరగడం, విడిభాగాల ధరలు ఎక్కువ కావడం, సరఫరా ఖర్చులు పెరగడం లాంటి కారణాలతో పలు కార్ల తయారీ సంస్థలు ధరలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మారుతి సుజుకి కూడా మరోసారి ధరలు పెంచుతోంది. కొన్ని వారాల్లో మహీంద్రా, టాటా మోటార్స్, BYD లాంటి కంపెనీలు కూడా తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. దీంతో కార్ల మార్కెట్లో ధరల సవరణలు కొనసాగుతున్నాయి. కొత్త కారు కొనాలని భావిస్తున్న వారు ఆగస్టు ముందు బుకింగ్ పూర్తి చేస్తే ప్రస్తుత ధరల బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అయితే బుకింగ్ తేదీ, డెలివరీ నిబంధనలు, డీలర్ పాలసీలను ముందుగానే తెలుసుకోవడం మంచిది.
Read Also: లాంచ్‌కు ముందే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ సీక్రెట్స్ లీక్.. కొత్త ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!