MG Comet New Price: ఎంజీ మోటార్ (MG Motor) చిన్న ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీ (Comet EV) ధరల్లో మరోసారి మార్పులు చేసింది. ఈసారి కొన్ని వేరియంట్ల ధరలను పెంచగా, మరికొన్ని వేరియంట్ల ధరలను తగ్గించింది. ముఖ్యంగా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) విధానంలో కొనుగోలు చేసే టాప్ స్పెక్ వేరియంట్లకు ధరలు తగ్గించింది. ఈ ధరల మార్పులు ఎవరిపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటే..
ఎంజీ కామెట్ ఈవీ ధరలు ఈ ఏడాది ఇప్పటికే రూ.17,000 వరకు పెరిగాయి. తాజాగా కంపెనీ మరోసారి కొన్ని వేరియంట్లపై రూ.10,000 వరకు ధర పెంచింది. ఎగ్జిక్యూటివ్ (Executive), ఎక్సైట్ (Excite), ఎక్సైట్ ఎఫ్‌సీ (Excite FC), ఎక్స్ క్లూజివ్ డ్యూయల్ టోన్ (Exclusive Dual Tone), ఎక్స్ క్లూజివ్ ఎఫ్‌సీ డ్యూయల్ టోన్ (Exclusive FC Dual Tone) వేరియంట్ల ధరలు పెరిగాయి. ఈ వేరియంట్లలో ధరల పెరుగుదలతో కామెట్ ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఎక్కువ ఖర్చు తప్పదు.
సాధారణ ధరలు పెరిగినప్పటికీ, BaaS విధానంలో లభించే టాప్ వేరియంట్ల ధరలను కంపెనీ రూ.10,000 వరకు తగ్గించింది. ఎక్స్ క్లూజివ్ డ్యూయల్ టోన్, ఎక్స్ క్లూజివ్ ఎఫ్‌సీ డ్యూయల్ టోన్ వేరియంట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. సాధారణ కొనుగోలు విధానంలో బ్యాటరీతో కలిపి కామెట్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.7.90 లక్షల నుంచి రూ.10.17 లక్షల మధ్య ఉన్నాయి. అదే BaaS విధానంలో కారు ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.26 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఈ విధానంలో బ్యాటరీ ఖర్చు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి కిలోమీటర్‌కు రూ.3.3 చొప్పున అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
కామెట్ ఈవీ నాలుగు సీట్లతో వచ్చే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. చిన్న కుటుంబాలకు, ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్, ఎలక్ట్రిక్ ORVMలు, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, మాన్యువల్ ఏసీ, పవర్ విండోస్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, మాన్యువల్ IRVM కూడా అందించారు.
ఈ ఎలక్ట్రిక్ కారులో 17.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఫ్రంట్ వీల్స్ కు పవర్ ను అందించే ఎలక్ట్రిక్ మోటార్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మోటార్ 41bhp పవర్, 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. 3.3kW, 7kW AC ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. అయితే, ఇందులో DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం లేదు.
Read Also: హోండా తొలి ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. ఇంటీరియర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!