JSW Motors Reveals Logo: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో కొత్త కార్ల తయారీ సంస్థ అడుగుపెట్టబోతోంది. JSW మోటార్స్ పేరుతో కార్ల కంపెనీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంపెనీ కొత్త బ్రాండ్ లోగోను అధికారికంగా ఆవిష్కరించింది. డిసెంబర్ 3, 2026న ఫస్ట్ మోడల్ ను ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఈ లోగోను విడుదల చేసింది. ఈ కొత్త బ్రాండ్ నుంచి మార్కెట్లోకి రానున్న మొదటి కారు JSW కాంబాట్ (JSW Combat) SUV. ఇప్పటికే ఈ కారుపై ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి నెలకొంది.
JSW మోటార్స్ కొత్త లోగోలో కంపెనీ మెయిన్ గ్రూప్ లోగోలో కనిపించే రెక్కల లాంటి డిజైన్ ను ఉపయోగించారు. అయితే, దీనికి కొన్ని మార్పులు చేశారు. రెక్కల డిజైన్‌ను పైకి వాలినట్లుగా రూపొందించి, మధ్యలో ప్రత్యేకమైన కట్‌ను ఇచ్చారు. ఈ మొత్తం డిజైన్ ను ఓ సర్కిల్ లోపల ఫిక్స్ చేశారు. గత వారం లీకైన JSW కాంబాట్ SUV స్పేర్ వీల్ కవర్ పైనా ఇదే లోగో కనిపించింది. ఇక JSW మోటార్స్ పేరును రాసిన ఫాంట్ కూడా గ్రూప్ లోగోలోని అక్షరాల కంటే డిఫరెంట్ గా ఉన్నాయి.
JSW మోటార్స్ తన బ్రాండ్ తో పాటు తొలి SUV అయిన కాంబాట్‌ను కూడా డిసెంబర్ 3న పరిచయం చేయనుంది. కస్టమర్లు నవంబర్ 16న ప్రారంభమైన కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను ఎంటర్ చేసుకోవచ్చు. మరోవైపు, భారత ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ARAI)తో కూడా JSW మోటార్స్ ఒప్పందం చేసుకుంది. కొత్త ఫ్యూయల్ వెహికల్స్ డెవలప్ మెంట్, టెస్టింగ్స్, సేఫ్టీ, బ్యాటరీ టెక్నాలజీ, ADAS, సైబర్ సెక్యూరిటీ లాంటి సెగ్మెంట్లలో రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఇండియన్ రోడ్స్, వెదర్ కండీషన్స్ కు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేయనున్నాయి.
JSW కాంబాట్ SUV అంతర్జాతీయ మార్కెట్లోని జెటూర్ T2 (Jetour T2) ఆధారంగా రూపొందుతోంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.4kWh బ్యాటరీ ప్యాక్ ఉండనున్నాయి. ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కలిపి 360hp పవర్, 610Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3-స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్ మిషన్ ద్వారా ఫ్రంట్ వీల్స్ కు పవర్ అందుతుంది. ఈ SUV ఎలక్ట్రిక్ మోడ్‌లో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మొత్తం పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ కలిపి 1,200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
JSW కాంబాట్ SUV ధర సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. అయితే, డిసెంబర్ 3న కంపెనీ అధికారికంగా ధరలను వెల్లడించనుంది. కొత్త బ్రాండ్‌గా JSW మోటార్స్ భారత మార్కెట్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Read Also: 310 కి.మీ రేంజ్‌తో కొత్త ఇగ్నిస్ EV.. సుజుకి నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు!