TVS Jupiter 1 Crore Milestone: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లో టీవీఎస్ (TVS) జూపిటర్ కు ఉన్న ప్రత్యేకత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కుటుంబ అవసరాలకు అనుగుణంగా మంచి ఫీచర్లు, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ స్కూటర్ మరో అరుదైన ఘనత సాధించింది. జూపిటర్ 110, జూపిటర్ 125 మోడళ్లను కలిపి ఇప్పటి వరకు కోటి యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు టీవీఎస్ ప్రకటించింది. కేవలం 13 ఏళ్లలోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.
టీవీఎస్ తొలిసారిగా 2013లో జూపిటర్ 110 స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను రూపొందించింది. అప్పటి నుంచి నెమ్మదిగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత 2021లో జూపిటర్ 125ను పరిచయం చేసింది. ఆ తర్వాత అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. 2022 నాటికి జూపిటర్ స్కూటర్ల ఉత్పత్తి 50 లక్షల యూనిట్లను దాటింది. అక్కడి నుంచి మరో 50 లక్షల యూనిట్ల ఉత్పత్తిని చేరుకోవడానికి కేవలం నాలుగేళ్లు మాత్రమే పట్టింది. అంటే, గతంతో పోలిస్తే ఈ స్కూటర్‌కు డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది.
జూపిటర్ అమ్మకాలు పెరగడంలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కూడా చేసింది కంపెనీ. ముఖ్యంగా 2024లో టీవీఎస్ జూపిటర్ 110కు కీలక మార్పులు చేసింది. కొత్త ఛాసిస్, అప్‌డేటెడ్ డిజైన్, ముందు భాగంలో ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ లాంటి మార్పులను తీసుకొచ్చింది. అంతేకాకుండా, జూపిటర్ 125 నుంచి తీసుకున్న కొత్త ఇంజిన్‌ను కూడా ఇందులో ఫిట్ చేసింది. అయితే, జూపిటర్ 125 మాత్రం 2021లో విడుదలైనప్పటి నుంచి పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతోంది.
భారత స్కూటర్ మార్కెట్లో హోండా యాక్టివా (Honda Activa) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, టీవీఎస్ జూపిటర్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. జూపిటర్‌తో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ (iQube) అమ్మకాలు కూడా టీవీఎస్ రెండో అతిపెద్ద స్కూటర్ తయారీ సంస్థగా ఎదగడానికి కారణం అయ్యాయి. ప్రస్తుతం జూపిటర్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాప్ డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ.90,525గా ఉంది. ఇది హోండా యాక్టివా 6G (రూ.91,082), హీరో డెస్టినీ 110 (రూ.83,800) వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుంది. 13 ఏళ్లలో కోటి యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం టీవీఎస్ జూపిటర్‌కు పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ స్కూటర్ అమ్మకాలు మరింత పెరగనున్నట్లు కంపెనీ ఆశాభావం వ్యకంతం చేసింది.
Read Also: సుజుకి యాక్సెస్ 125లో బిగ్ ఛేంజెస్.. ఇక ఆ వేరియంట్ కనిపించదు!