Smart 2 Electric Car: చిన్న కార్లు సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. తక్కువ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవడం, ట్రాఫిక్ లో ఈజీ నడిపే అవకాశం ఉండటంతో ఎక్కువగా వీటిని ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ (Smart) కంపెనీ తీసుకొచ్చిన కొత్త స్మార్ట్ 2 ఎలక్ట్రిక్ కారు అందరినీ క్రేజీగా ఆకట్టుకుంటుంది. చూడటానికి చిన్నగా, క్యూట్‌గా ఉండటంతో పాటు లేటెస్ట్ డిజైన్‌తో వావ్ అనిపిస్తుంది. అయితే, ఈ కారు ధర భారత్ లో కేవలం రూ.5 లక్షలేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, దీని ధర అంత తక్కువగా ఉండే అవకాశం లేదు.
కొత్త స్మార్ట్ 2 ప్రత్యేకత కాంపాక్ట్ డిజైన్. ఇందులో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది. కారు పొడవు కేవలం 2.75 మీటర్లు మాత్రమే. దీని టర్నింగ్ సర్కిల్ 6.95 మీటర్లు కావడంతో ఇరుకు రోడ్ల మీద కూడా ఈజీగా మలుపులు తీసుకోవచ్చు. సిటీల్లో ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఈ కారు చాలా బాగుంటుంది.
ఈ చిన్న ఎలక్ట్రిక్ కారులో 35.8kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 290 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. ఛార్జింగ్ విషయంలోనూ ఈ కారు చాలా అనుకూలంగా ఉంది. 65kW DC ఫాస్ట్ ఛార్జర్ తో కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా స్మార్ట్ 2 ధర రూ.5 లక్షలు కాదు. చైనా మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు 99,900 యువాన్లు. అంటే, భారత కరెన్సీలో దాదాపు రూ.11.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది. యూరప్‌లో ఈ కారు ధర 19,990 యూరోల నుంచి ప్రారంభమవుతోంది. మన కరెన్సీలో సుమారు రూ.18 లక్షలు.
ఈ కారును మెర్సిడెస్ బెంజ్, గీలీ సంస్థల కలిసి అభివృద్ధి చేస్తున్నారు. అయితే, భారత మార్కెట్లో స్మార్ట్ 2 విడుదలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ భారత్‌లోకి దిగుమతి చేసుకుంటే పన్నులు, దిగుమతి సుంకాల కారణంగా ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండవచ్చు. తక్కువ ధరలో చిన్న ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ప్రస్తుతం ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) అందుబాటులో ఉంది. ఈ కారు సుమారు రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల మధ్య లభిస్తోంది. దీనికి స్మార్ట్ 2 పోటీగా వచ్చే అవకాశం ఉంది.
Read Also: BYDకి భారీ షాక్.. Ti7 SUV అమ్మకాలపై కోర్టు నిషేధం! JLR ఎందుకు కేసు వేసిందంటే?