Anirudh – Kavya:సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం లేదా ఏ ఇతర సాంప్రదాయంలో వివాహం జరిగినా.. కచ్చితంగా మత పెద్దలు లేదా పురోహితుడు ఉండాల్సిందే. అయితే ఇటీవల గ్రీస్ వేదికగా జరిగిన ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ (Anirudh Ravi Chander) , సన్ రైజర్స్ సీఈవో కావ్య మారన్ (Kavya Maran) వివాహానికి ఎటువంటి పురోహితుడు , మత పెద్దలు లేకుండానే వీరి పెళ్లిని జరిపించారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత గ్రాండ్ గా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ లో పురోహితుడు లేకుండా వివాహం జరగడం ఏంటి అంటూ కొంతమంది ప్రశ్నిస్తుండగా.. డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి క్లారిటీ ఇచ్చారు. వీరి వివాహం స్వాభిమానం పద్ధతిలో జరిగినట్లు తెలిపారు. మరి అనిరుధ్ , కావ్య వివాహ వేడుకలో ప్రత్యేకంగా నిలిచిన ఈ ‘స్వాభిమానం వివాహం’ అంటే ఏంటో? ఇది ఎప్పుడు ? ఏ విధంగా ఆవిర్భవించిందో? ఇప్పుడు చూద్దాం..
అనిరుధ్ – కావ్య పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అందులో కావ్య మెడలో అనిరుధ్ ఒక గొలుసు వేస్తున్నట్టు కనిపించిన ఫోటో వైరల్ గా మారడంతోనే.. వీరిది స్వాభిమానం వివాహమా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి డాక్టర్ టీఆర్బీ రాజా పెళ్లి వేడుకలో జరిగిన ఆచారాలపై స్పష్టత ఇచ్చారు. అనిరుధ్ , కావ్య మారన్ స్వాభిమానం పద్ధతిలో వివాహం చేసుకున్నారు అని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ వివాహ వేడుకలు దంపతులిద్దరూ ఒకరికొకరు పూలమాలలు, గొలుసులు మార్చుకున్నారని ,ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు , నూతన దంపతులను ఆశీర్వదించారని తెలిపారు.
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ..” కావ్య – అనిరుధ్ ఇద్దరూ కూడా స్వాభిమాన పద్ధతిలో వివాహం చేసుకున్నారు. మొదట ఒకరినొకరు పూలమాలలు వేసుకున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ అందించిన గొలుసులను ఒకరికొకరు మార్చుకున్నారు . కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఆశీస్సులతో వారి హృదయాల కలయిక జరిగింది ” అంటూ ఆయన వివరించారు.
స్వాభిమానం వివాహం అంటే ఏమిటి? అనే విషయానికి వస్తే తమిళనాడులో సామాజిక సంపర్క పెరియార్ ఈవీ రామసామి మొదలుపెట్టిన స్వాభిమానం ఉద్యమం నుంచి ఈ వివాహ సాంప్రదాయం పుట్టుకొచ్చింది. కుల వివక్ష, సాంప్రదాయ వివాహ ఆచారాలు, పెళ్లిళ్లలో మత పెద్దల ఆధిపత్యాన్ని ఇక్కడ ప్రశ్నిస్తూ.. ఈ ఉద్యమం ముందుకు సాగుతుంది. ఇక్కడ వధూవరులు ఒకరినొకరు జీవిత భాగస్వామ్యలుగా అంగీకరిస్తూ..తమ నిబద్ధతను ప్రకటిస్తారు దీని కోసం ఉంగరాలు లేదా పూలమాలలు కూడా మార్చుకోవచ్చు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. ఇక ఇలాంటి వివాహానికి ఎటువంటి మతపరమైన క్రతువులు , పురోహితుడు అవసరం లేదు.
also read:మౌళి ‘దొంగ నా కొడుకు’ మూవీ రివ్యూ!
అయితే తమిళనాడులో ఈ వివాహ పద్ధతికి 1967లోనే చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. హిందూ వివాహ చట్టానికి చేసిన సవరణ ద్వారా సాంప్రదాయ మతపరమైన వేడుకలు లేకుండా ఈ వివాహాలను చట్టబద్ధంగా నిర్వహించుకునే అవకాశం కూడా కల్పించారు. ఇలా కావ్య – అనిరుద్ దంపతులు తమ వివాహ వేడుకలో స్వాభిమానం వివాహ పద్ధతిని అనుసరించినట్లు వెల్లడించడంతో ఈ పద్ధతి గురించి మరోసారి నెట్టింట చర్చ మొదలయ్యింది. ఏది ఏమైనా ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే చట్టబద్ధమైన ఈ వివాహ వేడుకను మళ్లీ ఈ దంపతులు తెరపైకి తీసుకురావడం గమనార్హం.