Telangana BJP: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా రాష్ట్ర నాయకత్వంలోని విభేదాలు బహిర్గతమయ్యాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలన్న అధిష్ఠానం ప్రయత్నాలకు నేతల వ్యవహారశైలి విఘాతం కలిగిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి వచ్చినా.. ఆయన పాల్గొన్న కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాదయాత్ర అటుంచితే.. కనీసం స్వాగతం పలికేందుకు కూడా రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య దూరం మరోసారి స్పష్టమైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
నితిన్ నబీన్ పర్యటనలో భాగంగా నిర్వహించిన లోక్తంత్ర బచావో.. అరాచకత హఠావో యాత్రకు బీజేపీ ప్రజాప్రతినిధుల్లో పలువురు దూరంగా ఉండటం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. కనీసం జాతీయ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు కూడా కొందరు నేతలు రాకపోవడం చర్చకు దారితీసింది. గైర్హాజరైన వారిలో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, గోడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలిలో పార్టీ పక్ష నేత ఏవీఎన్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హజరైన పాదయాత్రకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపీ ఈటల రాజేందర్ గైర్హాజరవ్వడం ప్రధానంగా చర్చకు దారితీసింది. నగరంలోనే ఉన్నా.. నితిన్ నబీన్ కు స్వాగతం పలకగపోగా.. అదే సమయంలో కూకట్పల్లిలో నిర్వహించిన ధర్నాకు హాజరుకావడం రాజకీయంగా చర్చకు కారణమైంది. నితిన్ నబీన్ టూర్ తో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు మరోసారి బయటపడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలంటే నేతలంతా సమన్వయంతో పనిచేయాలని భావించిన అధిష్ఠానం.. ఇటీవల ఇరువురి మధ్య సయోధ్యకు ప్రయత్నించింది. ఇకపై కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం జాతీయ అధ్యక్షుడి పర్యటనకు దూరంగా ఉండటం చర్చకు దారితీసింది. గతంలో బండి సంజయ్కు సంబంధించిన భగీరథ వ్యవహారంలో అర్వింద్ పాత్ర ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్కు సంబంధించిన కార్యక్రమానికి అర్వింద్ దూరంగా ఉన్నారా? లేక ఇతర రాజకీయ, వ్యక్తిగత కారణాలున్నాయా? అన్న చర్చ మొదలైంది. ఒకవైపు అధికార పార్టీపై పోరాటానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తుంటే.. మరోవైపు సొంత పార్టీలోనే నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడి పర్యటన వంటి కీలక సందర్భంలోనూ నేతలంతా ఒకే వేదికపైకి రాకపోవడం పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బీజేఎల్పీ నేత, మండలి పక్ష నేత సైతం గైర్హాజరు కావడం సాధారణ పరిణామంగా చూడలేమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లోక్తంత్ర బచావో.. అరాచకత హఠావో పేరుతో సాగుతున్న యాత్ర పార్టీ సమష్టి కార్యక్రమంగా కాకుండా బండి సంజయ్ వ్యక్తిగత కార్యక్రమంగా కొందరు నేతలు భావిస్తున్నారా? అన్న చర్చ కూడా కాషాయ శ్రేణుల్లో వినిపిస్తోంది. జాతీయ అధ్యక్షుడి పర్యటనను కూడా నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మార్చుకోవడం పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్లాలని భావిస్తున్న బీజేపీకి అంతర్గత విభేదాలు సవాలుగా మారుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం, ప్రజాప్రతినిధులు, కీలక నేతల మధ్య సమన్వయం లేకుంటే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. అధిష్ఠానం ఎన్ని సయోధ్య ప్రయత్నాలు చేసినా నేతల వైఖరిలో మార్పు కనిపించకపోతే పార్టీ ఐక్యత ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి. జాతీయ అధ్యక్షుడి పర్యటనతోనైనా విభేదాలకు తెరపడుతుందని ఆశించిన కార్యకర్తలకు తాజా పరిణామాలు నిరాశ కలిగించాయన్న చర్చ సాగుతోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ కమలంలో కలహాల కుంపటి ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చర్చించుకుంటున్నారు.
Also read: బీజేపీ డౌన్ అవుతుంది.. మోదీ మళ్లీ అధికారంలోకి రారు: వి. హనుమంత రావు