Viral Bike Anti Theft Switch: సోషల్ మీడియాలో ఒక్కోసారి కనిపించే కొన్ని వీడియోలు ఆశ్చర్యపరచడమే కాకుండా ఆందోళనకు కూడా గురిచేస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బైక్‌ను దొంగల బారి నుంచి కాపాడుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా పెట్రోల్ ట్యాంక్‌కే రంధ్రం చేసి ఓ వింత పరికరాన్ని అమర్చాడు. బైక్‌కు అదనపు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో చేసిన ఈ పని ఇప్పుడు సదరు రైడర్ భద్రత మీదే ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రయోగం ఎంత ప్రమాదకరమో తెలుసుకుంటే మాత్రం ఎవరూ ఇలాంటి పని చేయడానికి సాహసించరు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. బైక్ పెట్రోల్ ట్యాంక్‌కు చిన్న రంధ్రం చేసి అందులో ఒక ప్రత్యేకమైన స్విచ్‌ను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. ప్లాస్టిక్ స్ప్రాకెట్, గొలుసు ముక్కలు, వైర్ లాంటి వస్తువులను ఉపయోగించి ఈ పరికరాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఒక రకమైన DIY యాంటీ థెఫ్ట్ కిల్ స్విచ్. అంటే, బైక్‌ను ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నించినా సులభంగా స్టార్ట్ చేయకుండా అడ్డుకోవడం దీని ఉద్దేశం. ఈ స్విచ్‌కు లింక్ చేసిన వైరును తొలగిస్తే ఇగ్నిషన్ సర్క్యూట్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా స్పార్క్ ప్లగ్ పనిచేయదు. దీంతో ఇంజిన్ స్టార్ట్ కాదు.
ఈ ప్రయోగంలోనే అసలు ప్రమాదం దాగి ఉంది. సాధారణంగా బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌ను పూర్తిగా మూసివేసి, పెట్రోల్ బయటకు రాకుండా ప్రత్యేకంగా రూపొందిస్తారు. అలాంటి ట్యాంక్ కు రంధ్రం చేసి ఎలాంటి ప్రమాణాలు లేని పరికరాలను అమర్చడం చాలా ప్రమాదకరం. వీడియోలో కూడా స్విచ్ అమర్చిన ప్లేస్ నుంచి పెట్రోల్ లీక్ అవుతున్నట్లు కనిపిస్తోంది. పెట్రోల్ లీక్ కావడం వల్ల దాని ఆవిర్లు చుట్టుపక్కల వ్యాపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న నిప్పురవ్వ తగిలినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇగ్నిషన్ వ్యవస్థకు సంబంధించిన వైర్లు, విద్యుత్ కనెక్షన్లను ఇంధన ట్యాంక్‌లోకి తీసుకెళ్లడం మరింత ప్రమాదకరం.
బైక్ ఇంజిన్‌లో ఫ్యూయల్ ని మండించడానికి స్పార్క్ ప్లగ్ నిప్పురవ్వను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ ఇంజిన్ లోని కంబషన్ చాంబర్ లో జరగాలి. అంతేకానీ, పెట్రోల్ ట్యాంక్ లో స్పార్క్ ఏర్పడే పరిస్థితి అస్సలు ఉండకూడదు. ట్యాంక్‌లో పెట్రోల్ ఆవిర్లు ఉన్నప్పుడు విద్యుత్ స్పార్క్ ఏర్పడితే అగ్నిప్రమాదం సంభవించి, బైక్ పేలిపోయే అవకాశం ఉంటుంది. మంటలు వేగంగా వ్యాపించి తీవ్రమైన ప్రమాదానికి దారితీయవచ్చు.
ఈ వీడియో పాకిస్తాన్‌కు చెందినదిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒక స్థానిక మెకానిక్ చేసిన ప్రయోగంగా చెబుతున్నారు. అయితే, ఈ ప్రయోగం మీద సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. పెట్రోల్ ట్యాంక్‌కు రంధ్రాలు చేయడం, అందులో విద్యుత్ వైర్లు, స్విచ్‌లు అమర్చడం ప్రాణాలకే ముప్పు అని నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు. బైక్ సేఫ్టీ కోసం ఆయా కంపెనీలు సూచించిన లాక్‌లు, అలారం వ్యవస్థలు, నిపుణులు ఏర్పాటు చేసే ఇమ్మొబిలైజర్లను ఉపయోగించడం మంచిదంటున్నారు. కొద్దిపాటి భద్రత కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడం మంచిది కాదంటున్నారు.
तालिबान वाले अपनी ही मोटरसाइकिलों में
इस तरह की होल क्यों करते हैं।।@grok बताओ इस का क्या कारण है?? pic.twitter.com/oSrb40nwHu
— Iqbal khan (@Iqbalkhan_737) November 17, 2026
Read Also: పల్సర్ NS125లో అదిరిపోయే అప్‌డేట్.. ఇక బైక్ స్క్రీన్‌పైనే గూగుల్ మ్యాప్స్!