Krishna: సినీ జీవితంలో ధైర్యంగా ముందుకెళ్లిన కథానాయకుడాయన. ప్రయోగాలతో హిట్ కొట్టిన హీరో. తెలుగు తెరపై కొత్తదనాన్ని తీసుకొచ్చిన స్టార్. ఆయనే టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ. మూడేళ్ల వ్యవధిలో సూపర్ స్టార్ కృష్ణ ముగ్గురు ఆత్మీయులను కోల్పోయారు. ఆయనకు ఈ ఏడాది చేదుజ్ఞాపకాలను మిగిల్చింది. పెద్ద కుమారుడిని, భార్యను కోల్పోయారు. నెలరోజుల క్రితమే సెప్టెంబర్ 28న భార్య ఇందిరాదేవి చనిపోయారు. ఈ ఏడాది జనవరిలో పెద్దకుమారుడు రమేష్ బాబు మృతి చెందారు. మూడేళ్ల క్రితం మరో జీవిత భాగస్వామి విజయనిర్మల మృతిచెందారు. ఈ ముగ్గురి మరణం సూపర్ స్టార్ కృష్ణకు తీరని మనోవేదన మిగిల్చింది.
మూడేళ్ల క్రితం:
సూపర్ స్టార్ కృష్ణకు సినీప్రయాణంలోనే కాకుండా జీవిత భాగస్వామిగా కూడా తోడుగా నిలిచిన విజయనిర్మల మూడేళ్ల క్రితం చనిపోయారు. 1967 లో సాక్షి సినిమాతో మొదలైన వీరి పరిచయం 5 దశాబ్దాలపాటు సాగింది. కృష్ణ సుదీర్ఘ సినీ కెరీర్ లో ఆమె అండగా ఉన్నారు. ఆయన నటించిన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ నటించిన సినిమాల బాధ్యతలు చూసుకున్నారు. ఏ సినిమా ఫంక్షన్లకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. సినిమాల పరంగానే కాకుండా జీవితంలోనూ కృష్ణకు తోడుగా నిలిచారు విజయనిర్మల. సినిమాలతో మొదలైన వారి బంధం..భార్యభర్తల బంధంగా మరింత బలపడింది. ఇలా వృద్ధాప్యంలో తోడుగా నిలిచారు. అయితే 2019 జూన్ 27న విజయనిర్మల మృతిచెందారు. ఆమె మరణం కృష్ణను మానసికంగా దెబ్బతీసింది. విజయనిర్మల మరణం తర్వాత ఒంటరిగానే కొన్ని సినిమా ఫంక్షన్లకు హాజరయ్యారు కృష్ణ. అయితే ఏదో తెలియని బాధ ఆయన ముఖంలో కనిపించేది. వృద్ధాప్యంలో తోడుగా ఉన్న విజయనిర్మల మరణం కృష్ణకు తీవ్ర మనోవేదన కలిగించింది.
కుమారుడి మరణం..
2022 జనవరి 8న కృష్ణ పెద్దకుమారుడు రమేష్ బాబు మృతిచెందారు. ఆరోగ్య సమస్యలతో 56 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. రమేష్ బాబు 1974 లో 9 ఏళ్ల వయస్సులో అల్లూరి సీతారామరాజు సినిమాలో బాలనటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తండ్రి బాటలోనే కథానాయకుడయ్యారు. తండ్రితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. సామ్రాట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 15 సినిమాల్లో కథానాయకుడిగా నటించిన రమేష్ బాబు …ఆ తర్వాత నిర్మాత గా మారారు. అయితే అనారోగ్య సమస్యలతో రమేష్ బాబును కోల్పోవటం కృష్ణను కుంగదీసింది.పెద్ద కుమారుడి మరణంతో తీవ్ర మనోవేదన చెందారు.
భార్య మృతితో..
కుమారుడి మరణం నుంచి కోలుకోకముందే కృష్ణ భార్య ఇందిరాదేవి మృతిచెందారు. ఆరోగ్య సమస్యలతో 2022 సెప్టెంబర్ 28న ఆమె తుదిశ్వాస విడిచారు. జీవితభాగస్వామి మరణం కృష్ణకు తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఏడాది లోపు కుమారుడిని, భార్యను కోల్పోయిన కృష్ణ మానసికంగా మరింత కుంగిపోయారు. 80 ఏళ్ల వయస్సులో ఉన్న కృష్ణకు ఆత్మీయుల మరణాలు ఆవేదన కలిగించాయి.