Khajaguda Land Kabja Issue: 3 వేల కోట్లు విలువైన భూమి.. చక్రం తిప్పిన మాజీ మంత్రి. ఇంకేముంది.. పేర్లు మార్చి, ఫోర్జరీలు చేసి.. అనుకున్నవాళ్లకు కట్టబెట్టేశారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడలో 3 వేల కోట్ల విలువైన భూముల కబ్జా వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి.. హైదరాబాద్ లో చక్రం తిప్పిన మాజీ మంత్రి అండదండలతో.. వంశీరాం సుబ్బారెడ్డి రూ.3 వేల కోట్ల విలువైన భూములను కాజేయడానికి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే 2023 వరకు రికార్డుల్లో పోరంబోకుగా ఉన్న భూమిని.. సడెన్‌గా పట్టా భూమిగా మారుస్తూ.. నిర్ణయాలు తీసుకున్నారు అప్పటి కలెక్టర్, CCLA అధికారులు. అత్యంత విలువైన, వివాదాస్పద భూమిని వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి అంటగట్టడంలో విస్తుపోయే ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి. పట్టా భూమిగా ఉత్తర్వులు ఇస్తే 1960 నుంచి 1995 వరకు అనుభవదారుని కాలమ్ లో ఉన్న 20 మంది రైతులకు రక్షిత కౌలుదారు చట్టం-1950 వర్తిస్తుంది.
అయితే.. ఈ వ్యవహారంపై ఒరిజినల్ సూట్ లో పల్లవి స్కూల్స్ అధినేత కొమురయ్య కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదిపారు. 2006లో రైతులకే డిక్రీ ఇస్తూ రంగారెడ్డి సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. పల్లవి స్కూల్స్ లే అవుట్ చేసిన తర్వాత బేవర్లీ హిల్స్ ఓనర్స్ సొసైటీ వాళ్లు ఓఎస్ దాఖలు చేశారు. కానీ 2007లో కోర్టు కొట్టివేసింది. మళ్లీ కౌలు రైతులు 2011లో మరో సూట్ దాఖలు చేశారు. దీనిపై 2013న ఫైనల్ ఆర్డర్ వచ్చింది. కౌలుదారులకే ఈ భూమి వర్తిస్తుందని తేల్చింది. బేవర్లీ వాళ్లు అప్పీల్‌కు వెళ్తే అక్కడ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని.. ప్రభుత్వ భూమిపై ఇరు పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయి.
ఆ తర్వాత 2017లో వంద కోట్లు పెట్టినా ఎకరం భూమి దొరకని ప్రాంతం కావడంతో ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేశారు. దీంతో రైతులకు 10 కోట్ల రూపాయల వరకు పల్లవి స్కూల్స్ యాజమాన్యం తయారు చేసిన లే అవుట్స్ వాళ్లు ఇచ్చేలా MoU కుదుర్చుకున్నారు. గతంలో కోర్టుల్లో పొందిన డిక్రీ పవర్స్ అన్నీ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 48 మంది రైతులు, వారి కుటుంబాలు ఇందుకు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. అయితే.. ఇదంతా లీగల్ కాదు. ప్రభుత్వం తన భూమి అని కోర్టుల్లో అఫిడవిట్లు ఇచ్చి ఫైట్ చేస్తుంటే.. వీరంతా ఎలాంటి స్టాంప్ డ్యూటీలు లేకుండానే ఒప్పందం చేసుకున్నారు.
Also Read: లడ్డూ వివాదాన్ని లైట్ తీసుకున్న కేసీఆర్? అందుకేనా నోరు మెదపడంలేదు?
రైతులకు రూ.10 కోట్ల చెక్కులు ఇచ్చి.. కోర్టు ద్వారా లీగల్ చేసుకుందామని కె.జ్ఞానేశ్వర్, ఎం. భరతేందర్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు. కానీ, చెల్లుబాటు కాలేదు. దీంతో 2019లో మళ్లీ రైతులతో స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసుకోవాలని అనుకున్నారు. కానీ, రైతులు ముందుకు రాలేదు. దీంతో ఫోర్జరీ సంతకాలకు తెరతీశారు. 2017న జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా, జ్ఞానేశ్వర్‌కు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నట్టు అన్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్‌లో నోటరీ చేయించుకున్నారు. ఈ వ్యవహారం అంతా ఫోర్జరీలతో నిండిపోయింది. వాటిని నిశితంగా పరిశీలిస్తే.. కొన్ని చిత్రవిచిత్రాలు బయటపడ్డాయి.
2019 డిసెంబర్ 24న చేయించుకున్న ఒప్పందంలో వీరయ్య అనే రైతు ఇంగ్లీష్‌లో సంతకం చేయగలడు. కానీ, వేలిముద్ర వేసినట్టు చూపించారు. డబ్బుల చెల్లింపుల్లో వారసుల సంతకాలు లేవని ఆర్. కరుణాకర్ సంతకం ఫోర్జరీ చేశారు. ఇలా పదుల సంఖ్యలో రైతుల సంతకాలు ఫోర్జరీ అయ్యాయి. తమ ఇష్టానుసారంగా కోర్టుకు అన్నీ సమర్పించారు. అయితే.. ఎక్కడా అధికారికంగా భూమి బదలాయింపు జరగలేదు. అలా జరిగితే ప్రభుత్వానికి వ్యవసాయ భూమిగానే 27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండేది.
ఇక.. ఖాజాగూడ కొత్త చెరువు సర్వే నెంబర్ 5లో 5 ఎకరాల 25 గుంటల భూమి ఉందని CCLA రికార్డులు చెబుతున్నాయి. శిఖం భూమి సర్వే నెంబర్ 4, 27లో ఉంది. విలేజ్ మ్యాప్‌లో సర్వే నెంబర్ 27లో ఎఫ్టీఎల్ 2 ఎకరాల 20 గుంటల వరకు చొచ్చుకొచ్చింది. రెవెన్యూ అధికారులు చెరువు ఉందని చెబుతున్నారు. కానీ.. 2022లో సోహిణి బిల్డర్స్ NOC కోసం అప్లై చేసుకుంటే.. ఎమ్మార్వో లెటర్ లేకుండానే ఈఈ నారాయణ, సిటీ ప్లానింగ్ GHMCకి సర్వే నెంబర్ 27 లేకుండానే మ్యాప్ గీసి అప్పగించారు. ఇదే చెరువును నానక్ రాంగూడ కుంట అని HMDAలో రికార్డు చేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత సర్వే నెంబర్ 5లో 3 ఎకరాల 24 గుంటలు మాత్రమే ఉందని రికార్డులు మార్చి, సుమారు 150 కోట్ల FTL, బఫర్ భూమిని కబ్జా చేశారు.
వేల కోట్ల రూపాయల భూమి వివాదంలో ఉండటంతో గత ప్రభుత్వ పెద్దలు వాటాల కోసం చేతులు కలిపినట్లు తేలింది. 2023 వరకు అది ప్రభుత్వ భూమి.. దానికి ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెప్పినవారే.. 1950లో పట్టాదారులుగా ఉన్నారు కాబట్టి ఇవ్వొచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా.. కోర్టులను తప్పుదారి పట్టించి, ఫోర్జరీ సంతకాలతో లే అవుట్ పేరుతో చేసిన రిజిస్ట్రేషన్ దందాలు చాలానే ఉన్నట్లు అనుమానలు రేకెత్తిస్తున్నాయి. 1996 నుంచి వివాదంలో ఉన్న భూమిలో లే అవుట్ ఎలా వేశారు? ఎవరెవరు ఎంత దోచుకున్నారు? కమీషన్ల దందా ఎలా సాగింది?