పండిత పుత్ర పరమ శుంఠ అన్నట్టుగానే ఉంది సీఎం రేవంత్ కేటీఆర్ గురించి. ఇక్కడ కేసీఆర్‌ను పండితుడు అనేందుకు రేవంత్‌కు మనసు రాదనుకో. అది వేరే ముచ్చట. కానీ ఇలాంటి వెర్రి బాగులోడిని కన్నందుకు థ్యాంక్స్..అని కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇదెలా ఉందంటే.. కేటీఆర్‌ను కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా. కెలికి కయ్యం పెట్టుకున్నట్టు.. రెచ్చగొట్టి.. నాతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది ..అన్నట్టుగా!
టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్బంగా తన ప్రసంగంలో చివరలో ఇలా ఇవాళ ఈ పంచులు వేశాడన్నమాట. తామే టిమ్స్ ఆసుపత్రికి నాంది పలికామని, పనులు మొదలు పెట్టామని చెబుతూ తిరుగుతున్నాడని.. ఈ విధంగా ఆరోపణలు చేశాడు రేవంత్. కేటీఆర్, బీఆరెస్ అన్నదాంట్లో తప్పేం లేదు. వాస్తవానికి అది కేసీఆర్ మదిలోంచి వచ్చిన ఆలోచన. నగరానికి నాలుగు వైపులా ఇలా మల్టి స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టాలి.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే కేసీఆర్ ఆలోచించాడు. దానికి శ్రీకారం కూడా చుట్టాడు.
ఆ పదేండ్ల కాలంలో ఆయన ప్రయార్టీస్ వేరేలా ఉన్నాయి. కాళేశ్వరంపై పెద్ద ఫోకస్ పెట్టాడు. అందుకే నిధులన్నీ అటే. టైమంతా దానికే. అందుకే ఈ ఆస్పత్రి భవన నిర్మాణం నత్తనడకన నడిచింది. చేసిన అభివృద్ధి పనులకూ బిల్లులు లేవప్పుడు. జీతాలు ఆలస్యం.. ఆర్థిక సంక్షోభం.. కారణం కాళేశ్వరం. అది వేరే ముచ్చట.
మళ్లీ టిమ్స్‌కు వద్దాం. రేవంత్ గుడ్డిగా ఆరోపించినట్టు.. కేటీఆర్ ఎర్రోడేమీ కాదు. ఎర్రగడ్డలో చికిత్సలు చేయించే అవసరం లేదు.కేసీఆర్‌లా జనాధరణ పొందిన నేతైతే కాదు. అంత వరకు ఓకే. కానీ ఇది పక్కా రాజకీయ వ్యూహంలో భాగంగానే రేవంత్ ఆరోపించారని తెలుస్తోంది. అప్పుడు కొబ్బరికాయ కొట్టేందుకు, ప్రారంభించేందుకు ఎందుకు సమయం దొరకలేదనే ప్రశ్న సరైనది. దానికి మనం పైన చెప్పుకున్న కొన్ని కారణాలు కూడా.
అయితే ఇప్పుడు ఇంకా రెండు ఆస్పత్రులను కూడా మేం చేపడతామన్నాడు రేవంత్. ఇది మంచి పరిణామమే. కానీ ఎలాంటి క్రెడిట్ బీఆరెస్‌కు ఇచ్చే ఉద్దేశం ఏ కోశానా రేవంత్‌లో లేదు. అసలు పచ్చిగా చెప్పాలంటే హుందా రాజకీయాలు అనే మాట రేవంత్ నరనరాన ఉండదు.. లేదు అని ఆయనకు ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు.
ఇకపై తాను నిజాలు చెబతూ వస్తానని కూడా అన్నాడు. అంటే ఇందులో మర్మం.. కేటీఆర్‌ను మరెన్ని ఆస్పత్రులను తిప్పుతాడో. ఎన్ని రోగాలు అంటగడుతాడో.. ఎన్ని నిందలు వేసి బట్టకాల్చి మీదేస్తాడోననే అర్థమూ ఉంది. ఎందుకంటే..జనాలు మొదట తిట్టినప్పుడు చేసిన ఎంజాయ్ కాస్తా తరువాత ఏవగింపు దిశగా మారుతుంది. ఇప్పుడు అదే స్థితికి చేరబోతుంది.
కానీ పనులు చేసుకుంటా తిడితే కొంచెం బెటర్. అందుకే ఆరు నెలలకో ఆస్పత్రి కడుతాననే మాటకు కట్టుబడి ఆ ప్రారంభోత్సవంలో మరోసారి తుక్కుతుక్కు తిట్టినా జనం పురోగతిని లెక్కలోకి తీసుకోవడం మూలంగా సీఎం మాటలకు కాస్తైనా విలువుంటుంది.