Telangana MLAs: కాంగ్రెస్‌కి అత్యధిక స్థానాలు దక్కేలా చేయడంలో ఈ ముగ్గురు నేతలు కీలకపాత్ర పోషించారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ అప్పటి బీఅర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు సాగించి ప్రజల్లో పరపతి పెంచుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ముగ్గురు నేతలు కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పటికీ జిల్లా అధ్యక్ష పదవిలో వారే ఉండడంతో పార్టీ కార్యక్రమాలలో దృష్టి పెట్టలేకపోతున్నారనే చర్చ కొనసాగుతుంది. ఇంతకీ ఆ ముగ్గురు నేతలు ఎవరు?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పునర్విభజనలో మూడు జిల్లాలుగా విడిపోయింది. కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడ్లూరి లక్ష్మణ్‌కూమార్ కొనసాగుతున్నారు. ఆది శ్రీనివాస్ వేములవాడ నుండి ఎమ్మెల్యే గా విజయం సాధించి, ప్రభుత్వ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా ధర్మపురి నుండి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యే గా విజయం సాధించి ప్రభుత్వం విప్ గా కొనసాగుతున్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మానుకొండూరు ఎమ్మెల్యే గా గెలిచారు.
ఈ ముగ్గురు నేతలు కూడ ప్రభుత్వం లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంకా కాంగ్రెస్ కొత్త జిల్లా అధ్యక్షులని నియమించలేదు. ఎమ్మెల్యేలుగా గెలిచిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జోడు పదవుల సవారీతో పార్టీకి సరైన న్యాయం చేయలేకపోతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. దానికి తగ్గట్లే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతుంది. పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉండడంతో.. పార్టీలో ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారించే నేతలు కరువు అయ్యారని కేడర్ అంటుంది.
గ్రామ స్థాయి, మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలు అంతంతా మాత్రంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత స్థబ్ధుగా తయారైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మూడో స్థానానికే పరిమితమైంది. ఆ క్రమంలో పార్టీ కార్యక్రమాలు కూడా నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడు జిల్లాల అధ్యక్షులు ఎమ్మెల్యేలుగా గెలిచాక వారి అసెంబ్లీ నియోజకవర్గంలకే పరిమితం అవుతున్నారు. కనీసం కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యలయాల్లో కూడ అడుగు పెట్టడం లేదు. ఒకవేళ అడుగు పెట్టినా ఏదైనా ముఖ్యమైన పార్టీ కార్యక్రమం ఉంటేనే అటెండెన్స్ వేయించుకుంటున్నారంట.
Also Read: కరీంనగర్ కాంగ్రెస్‌లో పురుమల్లు చిచ్చు..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేఫధ్యంలో పార్టీకి బలమైనా నాయకత్వం లేకపోతే ఇబ్బందులు ఎదురు అవుతాయని క్యాడర్‌లో చర్చ సాగుతోంది. ఆ క్రమంలో మూడు జిల్లాలకు పార్టీ కోసం ఫుల్‌టైం పనిచేసే కొత్త అధ్యక్షులని నియమించాలని కేడర్ పీసీసీని కోరుతుందంట. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ముగ్గురు నేతలు పార్టీ పదవులని వదులుకోవడానికి సిధ్ధంగా ఉన్నా.. కొత్తవారిని నియమించే విషయంలో అధిష్టానం జాప్యం చేస్తుందంటున్నారు. దాంతో నేతలు జోడు పదవుల సవారీ చేస్తున్న జిల్లాలలో పార్టీ కార్యక్రమాలు అనుకున్నంత స్థాయిలో వేగంగా ముందుకు వెళ్ళడం లేదని కాంగ్రెస్ కేడర్ మధన పడుతోంది.
ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధం కావాలంటే ఖచ్చితంగా నాయకత్వం మార్పు జరగాలని స్థానికసంస్థల టికెట్ ఆశావహలు, కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా కోరుతున్నారు. ఈసారి స్థానిక సంస్థలలో సత్తా చాటారని కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో బీఆర్ఎస్ కంటే బీజేపీ నుంచే కాంగ్రెస్‌కు సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఇటు కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తమ పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో ఇప్పటికీ భారీగా బీజేపీ సభ్వత్వాలు నమోదు చేయించారు. ఈ నేఫధ్యంలో కాంగ్రెస్‌కి బీజేపీ నుంచి గట్టి పోటీ తప్పదని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టానికి పూర్తి సమయం కేటాయించే డీసీసీ అధ్యక్షులు అవసరమని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.