BigTV English

Karimnagar Congress: కరీంనగర్ కాంగ్రెస్‌లో పురుమల్లు చిచ్చు..

Karimnagar Congress: కరీంనగర్ కాంగ్రెస్‌లో పురుమల్లు చిచ్చు..

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం.. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్‌గా ఉంటూ వస్తుంది. 2023 ఎన్నికల్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్‌లు తలపడటంతో ఆ సెగ్మెంట్ పొలిటికల్ క్రేజ్ మరింత పెరిగింది. అంతకు ముందు రెండు ఎన్నికల్లో కూడా బండి సంజయ్ బీజేపీ నుంచి పోటీ చేసిన గంగుల చేతిలో పరాజయం మూటగట్టుకున్నారు.

అయితే గత ఎన్నికల్లో ఆయన ఎంపీ హోదాలో ఉండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడంతో కరీంనగర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మూడో సారి కూడా బండి సంజయ్‌కి అసెంబ్లీ మెట్లెక్లే అవకాశం రాలేదు. అటువంటి చోట అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే.. గత మూడు ఎన్నికల్లో హస్తం పార్టీకి మూడవ స్థానమే దక్కింది. అసలు టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి జరిగిన పది ఎన్నికల్లో కరీంనగర్‌‌లో కాంగ్రెస్‌ గెలిచింది ఒక్కసారే అంటే అక్కడ ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హస్తం పార్టీ హవా కొనసాగి ఆ పార్టీ ఎనమిది సీట్లలో విజయం సాధించింది. అయితే కరీంనగర్‌లో మాత్రం ముక్కీ మూలిగి తృటిలో డిపాజిట్ దక్కించుకుని 40వేల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయింది. టీడీపీ నుంచి తొలి సారి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి, కారెక్కిన గంగుల కమలాకర్.. తన విజయపరంపర కొనసాగిస్తూ మొన్నటి ఎన్నికల్లో నాలుగో సారి ఎమ్మెల్యే అయ్యారు. బీజేపీ నుంచి కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ రంగంలోకి దిగినా ఎమ్మెల్యేగా మాత్రం గెలవలేకపోయారు.

సరైన ప్రణాళిక లేకపోవడం, ఎన్నికలు దగ్గరకు వచ్చాక అభ్యర్థిని ప్రకటించడం వల్లే కాంగ్రెస్‌కు ఆ పరిస్థితి వచ్చిందని అప్పట్లో ఆ పార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కరీంనగర్‌లో పరిస్థితి చక్కబడుతుందని ఆశించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. ఏడాది గడిచినా ఏ మాత్రం మార్పు కనిపించడం లేదని వాపోతున్నారు. పార్టీ పుంజుకోవడం మాట అటుంచితే పుండుమీద కారం చల్లినట్టుగా పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పురుమల్ల శ్రీనివాస్ అసమ్మతి రాగం అందుకోవడంతో కాంగ్రెస్ కేడర్లో అయోమయం మొదలైందట.

విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజుల వ్యవధిలోనే పురుమల్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోగలిగారు. భూకబ్జాలాంటి ఆరోపణలతో వివాదస్పద నేతగా పేరున్న శ్రీనివాస్ అభ్యర్ధిత్వాన్ని స్థానిక నాయకత్వం వ్యతిరేకించినప్పటికీ పార్టీ పెద్దలు ఆయన వైపే మొగ్గు చూపారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో అదే బాటలో కాంగ్రెస్ కూడా సేమ్ సామాజికవర్గానికే చెందిన పురుమల్లకు టికెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు గట్టి పోటీ ఇస్తాడని అంతా భావించినప్పటికీ ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

Also Read: కేసీఆర్‌కు నిద్రలేకుండా చేస్తున్న కేటీఆర్

అంతకుముందు జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన ఓట్ల కంటే పురుమల్ల శ్రీనివాస్ కాస్త ఎక్కువ ఓట్లు సాధించారు తప్ప సొంత ఓట్లు ఏమీ లేవనే అభిప్రాయం వ్యక్తమైంది. అధికారం వచ్చిన కొత్తలో పార్టీ పెద్దగా పట్టించుకోక పోవడంతో ఆయన సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ఓడిన అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల్లో ఇన్చార్జులుగా ఉంటారని సీఎం రేవంత్ ప్రకటించడంతో మళ్లీ కాస్త యాక్టివ్ అయ్యారాయన. అప్పటి నుంచి నిన్నామొన్నటి వరకు అంతా బాగానే సాగింది.

అయితే సడన్‌గా పురుమల్ల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం అంటూ హడావుడి చేసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనే ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి మీడియాను అనుమతించకుండా ఇంటర్నల్ పేరుతో నడిపించారు. సమావేశానికి వచ్చిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి సుధీర్ఘ ప్రసంగం కూడా చేసారట. అ స్పీచ్ మొత్తం ఆత్మస్తుతి, పరనింద అన్నట్టుగానే సాగిందంటున్నారు. జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై.. జిల్లాకు చెందిన ఓ మంత్రిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారంట.

కాంట్రాక్ట్ పనులు కార్యకర్తలకు ఇవ్వకుండా మొత్తం ఆ మంత్రి కి చెందిన వారే పనులు చేస్తున్నారని కేడర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారానే ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో సమర్ధవంతమైన నేతలమని చెప్పుకుంటున్న వారు గత ఎన్నికల్లో కరీంనగర్ కార్పోరేషన్‌లో ఒక్క కార్పొరేటర్‌ను కూడా ఎందుకు గెలిపించుకోలేక పోయారని విమర్శలు గుప్పించారంట. అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్వర్యంలో ఛలో రాజ్‌భవన్ కార్యక్రమానికి ముఖ్య నేతలు రావాలని పీసీసీ ఆదేశించింది. దాన్ని పట్టించుకోని పురుమల్ల శ్రీనివాస్ అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించడంపై సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట.

డీసీసీ అధ్యక్షుడికి, నగర అధ్యక్షుడికి చెప్పకుండా.. సమావేశం ఎలా నిర్వహిస్తారు..? పార్టీలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే.. ఎవరిని అడగకుండా ఇలాంటి మీటింగ్‌లు ఏంటని? పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసారట. అసలు సమావేశం నిర్వహించడానికి పురుమల్ల శ్రీనివాస్‌కు ఉన్న అర్హతలు ఏంటని పలువురు నేతలు సీరియస్‌గా ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసిన తమను కాదని కొత్తగా వచ్చిన వారిని నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని కొందరు నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరినీ కలుపుకునిపోకుండా.. ఓటర్లకు కనిపించకుండా.. కనీసం కాంగ్రెస్ లీడర్లకు కూడా దొరకకుండా తిరిగిన వ్యక్తి పార్టీ నాయకులపై విమర్శలు చేయడం ఏంటని? పీసీసీకి ఫిర్యాదులు చేస్తున్నారంట.

చత్తీస్ ఘడ్ సీఎం కరీంనగర్లో ఎన్నికల ప్రచారానికి వస్తే కనీసం వెయ్యిమందిని సమీకరించలేని పురుమల్ల పెద్ద నాయకులు రాకపోవడం వల్లే ఓడిపోయానని అంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గంలో ప్రచారానికి రాకపోవడాన్ని ఆయన ఎత్తి చూపడం కేడర్ ఆగ్రహానికి కారణమవుతుంది.

ప్రభుత్వం తరపున జిల్లాకు బాస్‌ లాంటి ఇన్చార్జ్ మంత్రిపైనే నేరుగా విమర్శలు చేసేంత ధైర్యం ఎవరిచ్చారు..? పురుమల్ల శ్రీనివాస్ వ్యాఖ్యల వెనక ఎవరున్నారు..? అనేది కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా రెండు మూడు సమావేశాలు జరుగుతాయని పురుమల్ల సమావేశంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారంట. మరి ఆయన మరిన్ని మీటింగులు పెట్టడం ఏమో కాని.. ఇన్చార్జ్ మంత్రి, పార్టీ పెద్దలను టార్గెట్ చేసిన పురుమల్లపై పీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

 

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×