BigTV English

Ajmer Sharif Dargah: మొన్న అయోధ్య.. నిన్న కాశీ.. ఇప్పుడు అజ్మీర్.. తెర వెనుక కథ ఇదేనా..?

Ajmer Sharif Dargah: మొన్న అయోధ్య.. నిన్న కాశీ.. ఇప్పుడు అజ్మీర్.. తెర వెనుక కథ ఇదేనా..?

దాదాపు 3,500 దేవాలయాలు నాటి విదేశీ దాడుల్లో నేలమట్టం


“మనం గతంలో కాదు, భవిష్యత్తులో జీవించాలి”

ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మాట్లాడుతూ.. నా దేశం మారిపోయిందని అన్నారు. “గతం అంతా మరచిపోతాం” అని కూడా అన్నారు. కాశీ, మధురలోని దేవాలయాలను హిందువులకు అప్పగించాలని కూడా ఆయన ముస్లిం సమాజాన్ని కోరారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన సర్వే నివేదికలో.. పురాతన హిందూ దేవాలయ అవశేషాలపై మసీదు నిర్మించారిని భారత పురావస్తు శాఖ రిపోర్ట్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే, ఇటీవల లోక్‌సభ ఎన్నికల నుండీ దీనికి విరుద్ధంగా బిజెపి నేతల వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ అయితే దాదాపు అన్ని వేదికలపై దేవాలయాల పున:స్థాపన నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. ఇటీవలి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల సందర్భంలోనే ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలోనే, ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్‌లో షాహీ జామా మసీదు విషయంలో స్థానిక కోర్టు సర్వేకు అనుమతి ఇచ్చింది. అది అక్కడ మత వివాదానికి దారి తీసింది.

అజ్మీర్ దర్గాకు చాదర్‌ను సమర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఈ తాజా వివాదం గురించి రాజ్యసభ ఎంపీ, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడైన కపిల్ సిబల్ కూడా ఘాటుగా స్పందించారు. ఈ దేశం ఎటు వెళ్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభజనను సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనీ.. దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నామో అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి విభజన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు.

నిజానికి, ఇలాంటి ప్రశ్నలు సామాన్యుల నుండీ మేథావుల వరకూ చాలా మంది మెదడును తొలిచేస్తున్న ప్రశ్నలే. అందులోనూ, అజ్మీర్ దర్గాను భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుండీ ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ వరకూ అందరూ గౌరవించే వారే. ఆ దర్గాకు దేశ ప్రధానమంత్రి హోదాలో మోడీ కూడా చాదర్‌ను పంపించారు. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడం విషయంలో వివాదాన్ని సృష్టించడం, దాని నుండి రాజకీయ లబ్దీని పొందడం అనేది ఆందోళన కలిగించే విషయం అన్నది చాలా మంది చెబుతున్న మాట.

మొయినుద్దీన్ చిస్తీ 13వ శతాబ్దానికి చెందిన సూఫీ సన్యాసి, తత్వవేత్త

ఎవరి పేరుతో అయితే ఈ దర్గా ఉందో.. ఈ మొయినుద్దీన్ చిస్తీ 13వ శతాబ్దానికి చెందిన సూఫీ సన్యాసి, తత్వవేత్త. మొయినుద్దీన్ మరణించిన తర్వాత ఆయన్ను గొప్ప సాధువుగా అందరూ పరిగణించారు. ముయిన్ అల్-దీన్ దర్గాను 1236 మార్చిలో నిర్మించారు. ఇది తర్వాత శతాబ్దంలో అత్యంత గౌరవనీయమైన ప్రదేశంగా మారింది. అప్పటి నుండీ అన్ని సామాజిక వర్గాలు దీన్ని గౌరవిస్తూ వచ్చారు. ఈ సమాధిని ఈ యుగంలోని అత్యంత ముఖ్యమైన సున్నీ పాలకుల గౌరవంగా చూసుకున్నారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ తన పాలనా కాలంలో పద్నాలుగు సార్లు ఈ దర్గాను సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది. 1566లో తన హిందూ భార్య మరియం-ఉజ్-జమానీతో కలిసి, వారికి బిడ్డలు పుట్టాలనే ఆశతో.. చెప్పులు లేకుండా ఈ సమాధికి తీర్థయాత్ర చేసినట్లు తెలుస్తోంది.

1800వ సంవత్సరంలో దర్గాపై కవచాన్ని నిర్మించిన బరోడా మహారాజు

మధ్యయుగ కాలం నుండి ముస్లింలతో పాటు భారీగా హిందువులు కూడా ఈ స్థలాన్ని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. బరోడా మహారాజు 1800 సంవత్సరంలో దర్గాపై కవచాన్ని నిర్మించారు. ప్రస్తుతం, మొయినుద్దీన్ చిస్తీ సమాధి భారత ఉపఖండంలోని సున్నీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన సందర్శనా స్థలాలలో ఒకటి. భారత ఉపఖండం నలుమూలల నుండి వందల, వేల మంది ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. 2019లో, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద దర్గా కాంప్లెక్స్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2015లో, మొయినుద్దీన్ చిస్టీ 808వ ఉర్స్‌లో ముస్లిం మతపెద్దలతో జరిగిన కార్యక్రమంలో.. అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించిన ‘చాదర్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించారు.

ఉత్తమ నాయకుడు ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరించడు

ఎంతో చరిత్ర ఉన్న ఈ దర్గా పలు వివాదాలకు కూడా కేంద్రంగా ఉంది. 1992 అజ్మీర్ రేప్ కేసు నుండీ.. 2007లో టిఫిన్ క్యారియర్ బాంబు ఘటన వరకూ ఈ ప్రదేశం పాపులర్ అయ్యింది. రంజాన్ మాసంలో ఉపవాస ప్రార్థనల తర్వాత జనాలు గుమ్మిగూడిన ప్రదేశంలో బాంబు పేలింది. ఈ పేలుడులో ఏడుగురు చనిపోగా, 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యేక న్యాయమూర్తి దినేష్ గుప్తా.. 149 మంది సాక్షుల వాంగ్మూలాలు, 451 పత్రాల ఆధారంగా దాదాపు 500 పేజీల తీర్పును సమర్పించారు.

జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం దీనికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ ప్రచారక్‌లు కారణమని తేల్చింది. నేరస్థులకు జీవిత ఖైదు విధించారు. అలాగే, 5 జూలై 2022న, ముహమ్మద్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సస్పెండ్ అయిన భారతీయ జనతా పార్టీ ప్రతినిధి నూపుర్ శర్మ తల నరికేయాలని చెప్పిన దర్గా సంరక్షుడు సల్మాన్ చిస్తీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఏ దశలోనూ రాముడు ప్రతికార రాజకీయాలను ప్రోత్సహించలేదు

నిజానికి, హిందువులు దేవుడిగా పూజించే రాముడు ఎప్పుడూ తాను పరమాత్మనని ప్రకటించుకోలేదు. సాధారణ మనిషిగానే జీవించాడు, చెప్పుకున్నాడు. రావణుడిపై యుద్ధం కూడా అలాగే పలువురి సహకారంతో చేశాడు. ముఖ్యంగా, రాముడికి పదవీకాంక్ష లేదు. ఇంద్ర పదవిని కూడా నాకొద్దని తిరస్కరించిన వ్యక్తి. ఉత్తమ నాయకుడు ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరించడనే సిద్ధాంతం చెప్పిన గొప్ప రాజు. ఏ దశలోనూ తాను ప్రతికార రాజకీయాలను ప్రోత్సహించలేదు.

యుద్ధం యోధులతోనే.. సామాన్య ప్రజలు మనకు శత్రువులు కాదని స్పష్టం చేశాడు. రాముడికి ఉన్న ఆ విచక్షణా గుణమే.. నాయకులలో ఉత్తమ నాయకుడిగా, యోధులలో మహాయోధుడిగా, పాలకులలో అత్యుత్తమ పాలకుడిగా నిలింది. అదే రామ సార్వభౌముడికి పట్టాభిషేకం చేసింది. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో కావలసింది సరిగ్గా ఇలాంటి నాయకత్వమే. అప్పుడే, ఇలాంటి విభజన రాజకీయాలకు ముగింపు వస్తుందనేది చాలా మంది అభిప్రాయం.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×