TDP VS Janasena: శ్రీకాళహస్తీ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య నడుస్తున్న రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు వినూత, ఆమె భర్త అరెస్టు సమయంలో తమను కుట్ర పూరితంగా ఇరికించారని ఆరోపిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిని టార్గెట్ చేశారు. వారి ఆరోపణలు రాజకీయంగా ఎమ్మెల్యే బొజ్జలను ఇరకాటంలో పడేశాయనే టాక్ జోరుగా నడుస్తోందట.
బొజ్జలకు ఇబ్బందికరంగా మారిన వినూతి ఆరోపణలు
ఉరుము.. ఉరిమి.. మంగళం మీద పడ్డట్లైంది శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిస్ధితి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చుట్టూ శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడి హత్య కేసు వివాదం చుట్టుకుంటోంది. రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్‌గా ఉన్న కోటా వినూత, అమె భర్త చంద్రబాబు, ముఖ్య అనుచరులు నిందితులని తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ హత్య కేసు మధ్యలోకి ఎమ్మెల్యే బొజ్జలను వినూత తీసుకురావడం చర్చకు దారి తీసింది. వినూత దంపతుల ఆరోపణలు బొజ్జల సుధీర్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితిల్లోకి నెట్టాయంటున్నారు. హత్యకు నేపథ్యం ఎంటో ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికి మధ్యలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయంగా దూమారం రేపుతోంది. నిందితులుగా ఉన్న వినూత,ఆమె భర్తను జైలుకు తరలించే సమయంలో చేసిన కామెంట్స్ బొజ్జలను ఇరకాటంలో పడేశాయి.
బొజ్జల సుధీర్ కుట్ర పన్నారని వినూత భర్త ఆరోపణ
ఉమ్మడి తెలుగు రాష్టాలతో పాటు తమిళనాడు వ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు ఏదంటే శ్రీకాళహస్తి జనసేన ఇన్ చార్జ వినూత కోట పిఎ కం డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్య. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్న సమయంలో తమ మీదా బొజ్జల సుదీర్ కుట్ర పన్నాడని అందువల్ల తాము ఈస్థితిలో ఉన్నామంటు వినూత భర్త చంద్రబాబు అరోపించాడు. అసలు బొజ్జల సుదీర్ రెడ్డికి వీరి అరెస్ట్ కారణమేమిటి అంటే తమిళనాడు పోలీసుల వద్ద కూడా ఆ దంపతులు అదే స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తమిళమీడియాలో వార్తలు వస్తున్నాయి..రాజకీయంగా తమను పతనం చేయడానికి సుదీర్ రెడ్డి కుట్రపన్ని తమ వద్ద ఉన్న శ్రీనివాస్ ను లోబర్చుకోని అతని చేత తమ వ్యక్తిగత వీడియోలు తీయించి, తమ పార్టీలో వారికి పంపడమే కాకుండా తన వద్ద కూడా ఉంచుకున్నారని వినూత ఆరోపిస్తున్నారు.
శ్రీకాళహస్తిలో సంచలనం రేపుతున్న వినూత దంపతుల ఆరోపణలు
ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన నాయకురాలు వినూత, ఆమె భర్త చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. తమకు ఈ కేసులో ఇరికించడానికి బొజ్జల కీలక పాత్ర పోషించారని..తమపై తప్పుడు కేసులు పెట్టించారని వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నియోజకవర్గంలో సంచలనం సృష్టిస్తున్నాయట. హత్య కేసులో నిందితులుగా ఉన్నవారి నుండి నేరుగా ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో బొజ్జల రాజకీయంగా ఇరకాటంలో పడినట్లైందన్న టాక్ నియోజకవర్గంలో నడుస్తోందట.
ప్రతిపక్షాల కుట్రలో భాగమే అంటున్న బొజ్జల
దీంతో హత్య కేసు కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకున్నటైంది. నిందితులు డైరెక్ట్‌గా టార్గెట్ చేయడంతో ఎమ్మెల్యే బొజ్జలకు కొత్త తలనొప్పి వచ్చిపడిందనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోందట. వినూత దంపతులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, వాటిలో ఎటువంటి నిజం లేదని ఎమ్మెల్యే ఖండిస్తున్నారు. తనను రాజకీయంగా బలహీనపరచడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు వస్తున్నాయని ఆయన అంటున్నారు. హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, నిందితులు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెబుతున్నప్పటికి రాజకీయంగా బొజ్జలకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హత్య కేసుపై టీడీపీ అధిష్టానం ఆరా
బొజ్జల తనకు సంబంధంలేదని చేబుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ హత్య కేసుపై టీడీపీ అధిష్టానం కూడా అంతర్గతంగా వివరాలు సేకరిస్తుందంట. కూటమి పార్టీలో పని చేసిన నాయకులు నేరుగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం ప్రతిపక్షానికి ఆయుధంగా మారుతున్నాయి. ఇదే అదునుగా ఎమ్మెల్యేను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. వీటన్నిటికి ఎమ్మెల్యే నేరుగా సమాధానం చేప్పకపోయినా…స్థానికంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read: కేటీఆర్ సైలెంట్.. కవితకు బీఆర్ఎస్ బిగ్ షాక్
బొజ్జల తమపై కుట్ర పన్ని ఇరికించారని వినూత భర్త మీడియా ఎదుట మాట్లాడాడు. అసలెందుకు ఆ దంపతులు బొజ్జల సుధీర్‌ను టార్గెట్ చేసుకున్నారు? నిజంగా బొజ్జల సుధీర్ వారి రాజకీయ జీవితానికి చెక్ పెట్టాలని చూస్తున్నారా? లేకపోతే ఆ దంపతులే పొలిటికల్ గేమ్ ఆడలేక డకౌట్ అయ్యారా అన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. మొత్తమ్మీద బొజ్జలకు వినూత కోట దంపతులు బురద అంటించాలని చూడటం చర్చనీయాంశంగా మారింది. బొజ్జల ఇది ముందుగానే ఉహించి రాయుడి హత్య వారి వ్యక్తిగత వ్యవహారంతో జరిగిన హత్యని ప్రెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా నిందితులు బహిరంగంగా ఆరోపణల చేయడం, వైసీపీ దాన్ని సోషల్ మీడియాలో ఆయుధంగా మార్చుకోవడంతో మున్ముందు బొజ్జల ఎలా వ్యవహారించబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది.
Story By Rami Reddy, Bigtv