Amaravati Projects: అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగు పడింది. రాజధానిలో జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2,534 కోట్లతో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్, జీపీఆర్ఏ ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వీటి నిర్మాణం కోసం CPDWD కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించింది.
1299 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, 1235 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసం కోసం జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. కేంద్ర సర్కార్ ఆఫీసులన్నీ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనంలోనే కొలువుదీరనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మల్టీస్టోరేజ్ నివాసాలు నిర్మించనున్నారు. సుమారు 8వేల మంది అధికారులు, సిబ్బందికి సరిపోయేలా వీటిని నిర్మించనున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీని వల్ల శాఖల మధ్య సమన్వయం పెరిగి పరిపాలనా సామర్థ్యం మెరుగుపడుతుంది.
ఇప్పటికే.. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు కోసం ఇరవై రెండున్నర ఎకరాలను సీఆర్డీఏ కేటాయించింది. ఐదున్నర ఎకరాల్లో కామన్ సెక్రటేరియట్, 17 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తయింది. సీ8, సీ9 ప్లాట్లలో రెండు భారీ భవనాలను నిర్మించనున్నారు. 1800 కార్ల పార్కింగ్ సామర్థ్యంతో పోడియం పార్కింగ్ ఏర్పాటు ఉండేలా నిర్మించనున్నారు.
Also read: ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. ఈ 5 యాప్స్ ఉంటే చాలు!
గ్రిహ 4 స్టార్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో భవనాల నిర్మాణం జరగనుంది. ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్ రూల్స్‌కు అనుగుణంగా ప్రాజెక్టు చేపట్టనున్నారు. నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, పర్యావరణహిత నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ బ్యాంక్, ఏటీఎం, పోస్టాఫీస్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ లాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఉద్యోగులు, విజిటర్ల కోసం 4 క్యాంటీన్లు నిర్మిస్తారు. దివ్యాంగులకు పూర్తిగా అందుబాటులో ఉండే బారియర్-ఫ్రీ క్యాంపస్ చేపడతారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిధులతో ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందనుంది. CPDWD ద్వారా ప్రాజెక్ట్ అమలు చేయనున్నారు. ఇప్పటికే.. టెండర్లకు సంబంధించిన ప్రాసెస్ మొదలైంది.
అమరావతిలో ఇప్పటికే కొన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. అవన్నీ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయ్. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయితే వాటన్నింటిని సెక్రటేరియట్ కాంప్లెక్స్ భవనంలోకి మార్చనున్నారు. అప్పుడు ఏపీకి, కేంద్ర ప్రభుత్వ సేవలు దగ్గరిలోనే అందుబాటులోకి వస్తాయి. సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్ట్‌ని ఐకానిక్ డిజైన్‌తో, పర్యావరణహితంగా, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించనున్నారు.
అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఏసీ, కాన్ఫరెన్స్ హాల్స్ , పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తంగా సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ బిల్డింగ్ రాజధాని అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ప్రభుత్వ విభాగాలన్నీ ఒకేచోటకు చేరడం వల్ల పాలనలో వేగంతో పాటు ప్రభుత్వ సేవలన్నీ ప్రలజకు కూడా ఒకే చోట లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరగనుంది. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్‌తో రాష్ట్రంలో కేంద్ర నిధులు, ఆఫీసుల సమన్వయం మరింత సులభతరం కానుందని అధికారులు తెలిపారు.
Also read: Mohan Naik: ఏసీబీ చరిత్రలోనే మోస్ట్ కాస్ట్‌లీ తిమింగలం..కాంట్రాక్టర్ల రక్తం తాగడం ఆయన నైజం..?