AP Results: గవర్నమెంట్ స్కూళ్లలో వచ్చిన టెన్త్ క్లాస్ ఫలితాల గురించి ఇలాంటి యాడ్స్ ఎప్పుడైనా చూశారా? మీరే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటిది ఇప్పుడే ఫస్ట్ టైమ్. ఏపీ విద్యా వ్యవస్థలోనే.. కూటమి ప్రభుత్వం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పదో తరగతి ర్యాంకులు వీడియో యాడ్ రూపంలోనూ, న్యూస్ పేపర్ యాడ్స్‌గానూ వేయడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇది కేవలం.. ఓ ప్రకటన కాదు. లక్షలాది మంది హృదయాలకు దగ్గరైన ఓ వాస్తవం. పిల్లల భవితకు భరోసానిచ్చే ప్రభుత్వ బడి గొప్పతనం తెలియజేసిన ఫలితాలు.. సగర్వంగా ప్రభుత్వ విద్య వైపు నిలబడిన తరుణమిది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సృష్టించిన ప్రభంజనానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 మంది విద్యార్థులు 595కి పైగా మార్కులు సాధించారు. 200 మంది స్టూడెంట్స్‌కి.. 590కి పైగా మార్కులు వచ్చాయ్. 580కి పైగా సాధించిన వాళ్లు వందల్లో.. 500లకు పైగా మార్కులు సాధించిన వాళ్లు వేలల్లో ఉన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా.. టెన్త్ ఫలితాల్లో.. ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన ఫలితాలు, వారి ప్రతిభను చాటి చెప్పేలా.. విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనలు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ఇండియాగా మారాయ్. సాధారణంగా టెన్త్ ఫలితాలు ఎప్పుడొచ్చినా.. మరుసటి రోజు న్యూస్ పేపర్ల ఫస్ట్ పేజీలో కార్పొరేట్ స్కూళ్ల యాడ్స్ కనిపిస్తుంటాయ్. ఈసారి.. ఏపీలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాక.. ఏపీ ప్రభుత్వమే పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. సర్కార్ బడుల్లో చదివి స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫోటోలను చూపిస్తూ.. ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించాలని కోరింది ప్రభుత్వం.
ఈ సంవత్సరం టెన్త్ క్లాసులో 85 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైంది. ఎప్పటిలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ శాతం పాసయ్యారు. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు సైతం కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకకు దీటుగా మార్కులు సాధించారు. దాంతో.. ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ.. సగర్వంగా నిలబడి అనే క్యాప్షన్‌తో.. ప్రభుత్వ బడులను ప్రమోట్ చేస్తూ.. యాడ్స్ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన నలుగురు విద్యార్థినులకు ఏకంగా 596 మార్కులు రాగా.. 9 మంది 595 మార్కుల చొప్పున సాధించారు. బైట్స్.. స్టూడెంట్స్, పేరెంట్స్.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది.
జగన్ హయాంలో నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే ప్రయత్నం జరిగింది. అమ్మ ఒడి పేరిట విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా 15 వేల చొప్పున జమ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. లీప్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇన్ ఏపీ లాంటి కొత్త ప్రాజెక్టుతో.. ప్రభుత్వ విద్యా రంగం స్వరూపాన్నే మార్చేస్తోంది. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. విద్యార్థులని ఒత్తిడికి గురి చేయకుండా, ఆటపాటలతో అన్నీ నేర్చుకునేలా విద్యాబోధన చేస్తున్నారు. బోధనా పద్ధతుల్లో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేలా టీచర్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఏఐ టెక్నాలజీ, డిజిటల్ టూల్స్ వినియోగంపై వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నారు. 2029 నాటికి విద్యారంగంలో ఏపీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నారా లోకేశ్ మార్గదర్శకత్వంలో.. విద్యాశాఖ అధికారులు పని చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో.. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తేనే మంచి మార్కులు వస్తాయనే భ్రమలు తగ్గేలా చేశారు. డబ్బు లేకున్నా నాణ్యమైన విద్యను సర్కారు బడుల్లోనే పొందొచ్చని నిరూపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన, అత్యాధునిక సౌకర్యాలు, ఈ స్థాయి ఫలితాలు రావడానికి అనేక ఆసక్తికర అంశాలున్నాయ్. మొట్టమొదటగా.. ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. కేవలం భవనాలకు రంగులు వేయడమే కాకుండా, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించింది. తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో.. విద్యార్థులకు విజువల్ లెర్నింగ్ అలవాటు అయింది.
విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. మెరుగైన వసతులు కల్పించారు. అంతేకాదు.. ప్రభుత్వ పాఠాశాలల్లో పనిచేసే టీచర్ల నైపుణ్యానికి పదును పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులకు నిరంతరం శిక్షణ ఇస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా.. ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా.. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు.
సిలబస్‌లో మార్పులతో.. ద్వారా విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నెగ్గేలా తీర్చిదిద్దుతున్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ కూడా బాగా రావాలనే లక్ష్యంతో ఇంగ్లీష్ మీడియం బోధనని పటిష్టం చేశారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక కారణాలతో వెనుకబడొద్దని.. ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, షూస్ లాంటివి కూడిన కిట్లను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందిస్తున్నారు. స్కూల్లోనే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తూ.. విద్యార్థుల్లో పోషకాహార లోపం లేకుండా చూస్తున్నారు. ఇప్పుడు.. అత్యుత్తమ విద్యా బోధన సర్కార్ బడుల స్పెషాలిటీ అని, పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
రెగ్యులర్ మానిటరింగ్, విద్యాశాఖ అధికారులు పాఠశాలలను సందర్శించి లోటుపాట్లను సరిదిద్దడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. పేరెంట్స్ కమిటీలు వేసి.. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తున్నారు. టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంపై పెడుతున్న వ్యయాన్ని ఖర్చులా కాకుండా.. పెట్టుబడిలా చూస్తోంది. రేపటి తరం భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లలో లక్షలు ఖర్చు చేసినా దక్కని నాణ్యమైన విద్య, ఇప్పుడు.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందుతోంది. కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యలతో.. అట్టడుగు వర్గాల పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్ విద్యార్థులతో పోటీ పడే స్థాయికి ఎదుగుతున్నారు.
ఏపీ గవర్నమెంట్ స్కూల్స్‌లో వచ్చిన టెన్త్ ఫలితాలు.. ఒక స్పష్టమైన, బలమైన సందేశాన్నిచ్చాయ్. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించడం రాష్ట్ర విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులకు అద్దం పడుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే పేద విద్యార్థులకే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ, ఈ ఫలితాలు ఆ నమ్మకాన్ని మార్చేశాయి. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం, విద్యార్థులు టాప్ మార్కులు తెచ్చుకోవడంపైనే అంతటా చర్చ జరుగుతోంది. ఇప్పుడు.. ఏపీలో స్కూల్స్ రూపురేఖలు మారాయ్. ఆహ్లాదకరమైన తరగతి గదులు, ఆధునిక వసతులు విద్యార్థుల్లో చదువుకోవాలనే తపనని, నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచాయ్. ముఖ్యంగా.. ట్యాబ్స్ ద్వారా విద్యార్థులు డిజిటల్ కంటెంట్‌ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నారు. టెక్నాలజీని చదువుకు జోడించడం వల్ల.. క్లిష్టమైన అంశాలు కూడా సులభంగా బోధించవచ్చని ఈ ఫలితాలు చాటి చెప్పాయి.
ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా స్పెషల్ క్లాసులు నిర్వహించడం, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసిన తీరు కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఎంతోమంది నిరుపేద కుటుంబాల విద్యార్థులు.. ప్రభుత్వం అందించే సాయంతో.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి విజయం సాధించారు. కాస్త కష్టపడితే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి కూడా అద్భుతాలు చేయొచ్చని ఈ ఫలితాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయ్. ఈ ఫలితాలు కేవలం అంకెలు మాత్రమే కాదు. ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. నాణ్యమైన విద్య కేవలం సంపన్నులకే కాదు సామాన్యులకు కూడా ఉచితంగా అందుబాటులో ఉందని ఈ ఫలితాలు నిరూపించాయ్. టెన్త్ రిజల్ట్స్‌లో వచ్చిన ఈ విజయం కేవలం ప్రారంభం మాత్రమే! రాబోయే రోజుల్లో ఏపీ విద్యావ్యవస్థ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందనే చర్చ జరుగుతోంది.
Also Read: కేసీఆర్ కు కొద్దిగా మతిభ్రమించింది.. అందుకే అలా..? ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
Story by: Anup, Big Tv