E-Paper
Advertisement

AP Police: తేడాలొస్తే.. తాట తీస్తార్రోయ్.! ఏపీలో యూపీ మోడల్ పోలీస్ ట్రీట్‌మెంట్

AP Police: తేడాలొస్తే.. తాట తీస్తార్రోయ్.! ఏపీలో యూపీ మోడల్ పోలీస్ ట్రీట్‌మెంట్

AP Police: అడ్డగోలుగా నేరాలు చేస్తాం.. అరెస్ట్ అవుతాం.. అన్నొస్తాడు.. బెయిలిస్తాడు.. బయటకొచ్చేస్తాం.. అనే ఆలోచనలున్న అల్లరి, చిల్లరగాళ్లకైనా, ఒంటిమీద కంట్రోల్‌లోని కంత్రీగాళ్లకైనా.. గంజాయి బ్యాచ్‌లకైనా.. లోకల్ డాన్లుగా భ్రమపడే రౌడీలకైనా.. ఇదే హెచ్చరిక! మీరు.. ఇకనైనా ఓవరాక్షన్ ఆపకపోతే.. పోలీసులు యాక్షన్‌లోకి దిగుతారు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఒక్కటి మాత్రం క్లియర్.. ఇప్పుడు పరిస్థితులు.. ఇంతకుముందులా లేవు. నేరస్తుల విషయంలో.. ఏపీ పోలీసుల ట్రీట్‌మెంట్ మారింది. తేడాలొస్తే.. ఒక్కొక్కడి తాట తీసేస్తున్నారు. సో.. నేరం చేయడానికి ముందే.. ఆలోచించుకోండి!

ఏపీలో కొత్త తరహా పోలీస్ ట్రీట్‌మెంట్
ఏపీలో ప్రభుత్వం మారింది. పోలీసింగ్ పంథా మారింది. నేరస్తులతో.. పోలీసులు వ్యవహరించే విధానం కూడా మారిపోయింది. ఇప్పుడంతా.. అప్పటిలా లేదు. ఏపీలో.. కొత్త తరహా పోలీస్ ట్రీట్‌‌మెంట్ కనిపిస్తోంది. కంప్లైంట్ అందిన గంటల్లోనే.. నిందితులని కటకటాల్లోకి నెట్టేస్తున్నారు. నిందితులను రోడ్లపై ఈడ్చుకెళ్తున్నారు. తరచుగా నేరాలకు పాల్పడేవారిపై.. ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జనం మధ్యలోనే సరికొత్త సోషల్ ట్రీట్‌మెంట్‌తో.. నేరస్తులకు బుద్ధి వచ్చేలా చేస్తున్నారు. తిరుపతి, విజయవాడ, గుంటూరు, ఏలూరు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం.. ఇలా ఏరియా ఏదైనా, నేరం ఎలాంటిదైనా.. రౌడీలు, నేరస్తులను రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు పోలీసులు.

గ్యాంగ్ రేప్ నిందితుల్ని రోడ్డుపై లాక్కెళ్లిన పోలీసులు
గత నెలలో చిత్తూరు జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను.. ఒక్క రోజులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి సంకెళ్లు వేసి.. కోర్టు దాకా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇటీవలే.. మంగళగిరిలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకులను.. ఫిర్యాదు అందిన గంటల్లోనే కటకటాల్లోకి పంపారు. సత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కదిరి పట్టణంలోని వీధుల గుండా నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఏలూరులోనూ యువతిపై అత్యాచారం చేసిన కేసులోని
నిందితులను కూడా జనాలు చూస్తుండగానే టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు.

నిందితుల్ని నడిపిస్తూ కోర్టు దాకా తీసుకెళ్లిన పోలీసులు
నెల్లూరులోనూ ప్రైవేట్ బస్ డ్రైవర్, కండక్టర్‌పై.. బ్లేడ్లతో హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను సంతపేట పోలీసులు నగరంలో రోడ్లపై నడిపించారు. గుంటూరు జిల్లా పొన్నూరులోనూ.. మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని.. పోలీస్ స్టేషన్ నుంచి నడిరోడ్డుపై నడిపిస్తూ పొన్నూరు కోర్టు దాకా తీసుకెళ్లారు. కృష్ణా జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కూడా పోలీసులు నడి రోడ్డుపై నడిపించుకుంటూ… కోర్టుకు తీసుకెళ్లారు. తిరుపతిలోనూ ఇద్దరు రౌడీ షీటర్స్‌కి ఇదే తరహా ట్రీట్‌‌మెంట్ ఇచ్చారు. రోడ్డుపై కత్తితో హల్‌చల్ చేసిన రౌడీ షీటర్‌తో పాటు అతని స్నేహితుడిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు దాకా నడిరోడ్డుపై లాక్కెళ్లారు. ఏపీలో ఎక్కడైనా సరే.. పోలీసులు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. నేరాలకు పాల్పడే వారికి వెరైటీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.

ఏమాత్రం తేడా చేసినా.. తాట తీస్తామంటున్న పోలీసులు
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఇదే ఎగ్జాంపుల్. ఏమాత్రం తేడా చేసినా.. తాట తీస్తామంటున్నారు పోలీసులు. నేరస్తుల్లో భయం పుట్టించేందుకే.. నిందితులను ఇలా బహిరంగంగా తీసుకెళ్తున్నారు. ఘోరమైన నేరాలకు పాల్పడేవారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందనే విషయంపై.. ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో.. పోలీసులు ఇలా నిందితులను నడిరోడ్డుపై లాక్కెళుతూ.. కోర్టుల్లో హాజరుపరుస్తున్నారు.

కరుడుగట్టిన నేరస్తులకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్న పోలీసులు
కరడుగట్టిన నేరస్తులకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటమే కాదు.. తమకు ఎదురు లేదు, తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. అచ్చోసిన అంబోతుల మాదిరిగా తిరిగే రౌడీ షీటర్లకు, నేరస్తులకు.. ఏపీ పోలీసులు తమ సరికొత్త పోలీసింగ్‌తో షాకిస్తున్నారు. ఈ మధ్యకాలంలో.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడే వారికి పోలీసులు ఇస్తున్న ఈ సోషల్ ట్రీట్‌మెంట్‌కి ప్రజలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. తప్పుడు పనులు చేసినోళ్లకు షాకిచ్చేలా ఉన్న పోలీసు చర్యలతో.. ఎంతటోడైనా సరే.. చట్ట ప్రకారం చర్యలు ఖాయమనే సంకేతం వెళ్తోంది. సమాజంలో అశాంతి చెలరేగేందుకు కారణమైనా, నేరాలకు పాల్పడినా.. కఠిన శిక్షలు తప్పవని తెలియజేస్తున్నారు. ఈ తరహా చర్యలతో.. సమాజంలో భయభ్రాంతులు సృష్టించే వారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తామనేది.. ఏపీ పోలీసులు అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నారు.

శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దంటూ సీఎం ఆదేశం..
శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దంటూ.. జిల్లాల ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలకు రూపమే.. ఈ సీన్లు. అంతేకాదు.. ఏపీలో రౌడీయిజం చేస్తే సహించబోమని.. యూపీ తరహాలో.. యోగి ట్రీట్‌మెంట్ ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వార్నింగ్ ఇచ్చారు. ముందునుంచీ కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో కఠిన వైఖరితో ఉంది. ఇప్పుడు వారి హెచ్చరికలకు తగ్గట్లుగానే.. పోలీసింగ్ కూడా మారింది. నేరస్తుల పట్ల ఉక్కుపాదం మోపుతున్నారు. యూపీలో మాదిరిగా ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్లు పంపకపోయినా.. కఠిన చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. రౌడీలు, అసాంఘికశక్తుల్లో వణుకు పుట్టిస్తున్నారు. రెచ్చిపోయి అలజడులు సృష్టిస్తాం.. కత్తులు తీసి దాడులకు తెగబడతామంటే.. అంతే కఠినంగా దండిస్తామని పోలీసులు చెబుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరు భయాందోళన సృష్టించినా.. హద్దులు మీరి పోలీసులపైనే దాడులు చేసినా.. తీవ్రంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 2 వేల 599 మందిపై రౌడీషీట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల.. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వదలబోమని స్పష్టం చేస్తున్నారు ఏపీ పోలీసులు.

రాష్ట్రంలో రౌడీయిజానికి చోటు ఉండకూడదు.. పోలీసులంటే నేరగాళ్లకు భయం ఉండాలి.. అందుకోసమే.. మొత్తం రౌడీలందరినీ వెతికి పట్టుకొని మరీ.. రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అమాయకులు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడితే.. కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు జనం నుంచి కూడా వస్తున్నాయ్. అందుకనుగుణంగానే.. ఏపీ పోలీసులు కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అయితే.. ఈ చర్యలు నేరగాళ్లలో మార్పు తెస్తాయా?

రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం.. ప్రభుత్వం, పోలీసులు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేలా.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారానికి పాల్పడేవారికి.. అవే చివరి రోజులు కావాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా.. రౌడీల తాట తీస్తామని చెప్పారు. అందుకనుగుణంగానే పోలీసులు నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు అందగానే.. చర్యలు తీసుకుంటున్నారు. తమదైనశైలిలో ట్రీట్‌మెంట్ ఇవ్వడమే కాదు.. రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు.

నేరగాళ్లలో భయం కలిగించేలా పోలీసుల చర్యలు
తప్పుడు పనులు చేసిన వారిని ఇలా నడిరోడ్డుపై నడిపించడం లాంటి చర్యలు.. నేరగాళ్లలో మార్పు తెస్తాయా? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఏపీలో పెరిగిన అఘాయిత్యాలు, గంజాయి ముఠాల హల్‌చల్ లాంటి ఘటనలతో.. పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేవలం.. అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం మాత్రమే కాదు.. వారిలో భయం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై తీసుకెళ్లేటప్పుడు.. జనం చూసే చూపులు, తిట్లు, ఛీత్కారాలు.. ఎలా ఉంటాయో వారికే ప్రత్యక్షంగా తెలిసేలా చేస్తున్నారు. ఏపీలోని వివిధ పట్టణాలు, నగరాల్లో అశాంతికి రేపుతున్న రౌడీషీటర్లను అరెస్ట్ చేసి.. బహిరంగంగా వీధుల్లో నడిపించడం వల్ల.. వారి తలపొగరు దిగి నేలకొస్తోంది. అంతేకాదు.. సమాజంలో నేరగాళ్ల డామినేషన్‌ని తగ్గించడంలోనూ ఈ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయ్. కరడుగట్టిన నేరస్తులు, పదే పదే నేరాలకు పాల్పడే వారిపై.. పీడీ యాక్ట్ ప్రయోగించడమే కాదు.. వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించే యోచనలోనూ ప్రభుత్వం ఉంది. ఏపీ వ్యాప్తంగా 9 వేల మందికి పైగా ఉన్న రౌడీషీటర్ల కదలికలపై.. పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు.

రోడ్డుపై నడిపించడం వల్ల క్రిమినల్ ఇమేజ్ డ్యామేజ్
అయితే.. పోలీసుల చర్యలు నేరగాళ్లలో మార్పు తెస్తాయా? ఈ పబ్లిక్ పరేడింగ్ నిజంగానే నేరాలను తగ్గిస్తుందా? అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. నేరగాళ్లకు శిక్ష పడుతుందనే భయం కంటే.. సమాజంలో తమ పరువు పోతుందనే భయం ఎక్కువగా ఉంటుంది. నడిరోడ్డుపై పోలీసులు నడిపించడం వల్ల.. వారి క్రిమినల్ ఇమేజ్.. ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. ఇది కొత్తగా నేరాలు చేయాలనే ఆలోచన ఉన్న యువతకు.. ఓ ఒక హెచ్చరికలా పనిచేస్తుంది. అంతేకాదు.. సాధారణ ప్రజలు, మహిళలు.. రౌడీషీటర్లను చూసి భయపడకుండా, పోలీసులు తమకు అండగా ఉన్నారనే నమ్మకం కలుగుతుంది. క్రిమినల్స్‌కి.. ఏపీ పోలీసులు ఇస్తున్న ట్రీట్‌మెంట్ చూసి జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. నేరస్తులను ఇలా బహిరంగంగా అవమానించడం వల్ల.. వారు మరింత మొండిగా మారే ప్రమాదం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్. కేవలం.. ఇలా శిక్షించడం మాత్రమే కాదు.. వారికి సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారానూ కొంత మార్పు తీసుకురావొచ్చంటున్నారు. అయితే.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి.. ఇదే సరైన ట్రీట్‌మెంట్ అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్. ప్రజల భద్రత ముందు.. నేరగాళ్ల గోప్యత అంశం చాలా చిన్నది అనేది.. మెజారిటీ ప్రజల వాదన.

Also Read: కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు

ఒకప్పుడు నేరం చేయడం.. కొన్నాళ్లు జైలుకెళ్లడం, బయటకొచ్చాక పాత పద్ధతిలోనే మళ్లీ రౌడీయిజం చేయడం కామనైపోయింది. లోకల్ డాన్లుగా చలామణీ అయ్యే రౌడీ షీటర్లు, గంజాయి మత్తులో తూగే అల్లరి మూకలు.. ఏం చేసినా.. కొద్దిరోజుల్లో బయటకొచ్చేస్తాం అనే ధీమాతో రెచ్చిపోయేవారు. కానీ.. ఇప్పుడు ఏపీలో సీన్ మారింది. స్టేట్ పోలీసులు.. జీరో టాలరెన్స్ పాలసీని ఫాలో అవుతున్నారు. నేరగాళ్ల మూలాలను వెతికి మరీ పాతాళానికి తొక్కుతున్నారు. సామాన్యులను ఇబ్బంది పెట్టే కంత్రీగాళ్లకు.. లాకప్ గదుల్లో అసలైన ట్రీట్‌మెంట్ ఎదురవుతోంది. ఓవరాక్షన్ చేస్తే యాక్షన్ కచ్చితంగా ఉంటుంది అనే మెసేజ్ పంపుతున్నారు. నేరం చేస్తే.. ఎంతటివారైనా చట్టం ముందు నిలబడాల్సిందే. ఈ పబ్లిక్ పరేడింగ్‍‌తో.. సమాజంలో గౌరవం కూడా కోల్పోతారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునే వారికి ఏపీ పోలీసులు పంపుతున్న సంకేతం ఒక్కటే.. మర్యాదగా మారతారా.. తాట తీయమంటారా? అని! ఏపీలో పరిస్థితులు మారాయ్. పోలీసుల ట్రీట్‌మెంట్ మారింది. అడ్డగోలు నేరాలు మానుకోకపోతే.. కటకటాల వెనుక అంకెలు లెక్కపెట్టుకోవాల్సిందే! ఏపీలో మొదలైన ఈ సరికొత్త ట్రెండ్.. ఓ ట్రెండ్‌గా మిగిలిపోకుండా శాశ్వత శాంతికి బాటలు వేయాలి. నేరగాళ్లకు పోలీసులంటే భయం ఉండటమనేది.. ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో అవసరం.

Story By Anup, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×