Social Media Politics AP: తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా డైలాగ్ లు కట్టు తప్పుతున్నాయి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తున్నారు. వాటిని అలాగే యూట్యూబ్ లో అలాగే అప్ లోడ్ చేసేస్తున్నారు. అడిగే వారు లేరనుకుంటున్నారు. ఓవర్ నైట్ హీరో అవుదామనుకుంటున్నారు. రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి. అంతేగానీ.. రాజకీయ నేతల భార్యలే టార్గెట్ గా ఇప్పుడు కొత్త రాజకీయం నడుస్తోంది. నాడు నారా భువనేశ్వరి, ఇప్పుడు వైఎస్ భారతి. సోషల్ సైన్యాలకు వీరే టార్గెట్ అయ్యారు. తాజాగా భారతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో చేబ్రోలు కిరణ్ తీరుపై టీడీపీ గరంగరంగా ఉంది.
నీచపు మాటలు..
కారు కూతలు..
నోటికి ఎంతొస్తే అంత..
లైన్ దాటుతున్న సోషల్ మీడియా..
తెలుగు రాష్ట్రాల్లో విష సంస్కృతి
సెన్సార్ లేకుండానే యూట్యూబ్ వీడియోలు
ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్.. ఏది చూసినా.. చాలా కంటెంట్ వల్గర్ లాంగ్వేజ్ తో హై వ్యూస్ తో నడుస్తున్నాయి. నిజానికి సోషల్ మీడియాలో ఎవరికైనా స్వీయ నియంత్రణ అవసరం. సెన్సార్ కట్ చేసుకోవాలి. సభ్య సమాజానికి చూపించేది బోల్డ్ గా, ఇష్టం వచ్చినట్లు ఉంటే కరెక్టేనా? ఇది చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. అవతలి వాళ్లను కావాలనే టార్గెట్ చేసేలా వీడియోలు పెడుతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచితంగా మాట్లాడిన వారి వీడియోలను AS IT IS గా యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఆ ఘటనలో అరెస్టులు కూడా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం అలాంటి వీడియోలు అప్ లోడ్ చేసే వారికి ఘాటు వార్నింగ్ లు కూడా ఇచ్చింది.
హీరో అవుదామనుకుంటే జీరో మైలేజ్
ఇప్పుడు ఏపీ విషయానికొద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు చోబ్రోలు కిరణ్. ఐటీడీపీ కార్యకర్త. రెగ్యులర్ పని చేసుకుంటూ వెళ్తే బాగుండేది. కానీ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఉద్దేశపూర్వకంగా ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం అంగీకరించని భాష వాడాడు. ఇక్కడ కిరణ్ ఇంటెన్షన్ ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అవుదామనుకున్నాడు. పని చేస్తున్నది టీడీపీలో. జగన్ సతీమణిని.., లైన్ దాటి టార్గెట్ చేస్తే మైలేజ్ వస్తుందనుకున్నాడు. టీడీపీ నేతల దృష్టిలో హీరో అవుతాననుకున్నాడు. కానీ అడ్డంగా బుక్కైపోయాడు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతను విమర్శించినా పెద్దగా రియాక్షన్ ఉండకపోయేది. కానీ ప్రతిపక్ష నేత సతీమణిని టార్గెట్ చేయడంతో మ్యాటర్ గరంగరం అయింది. మహిళలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమే తప్పు. అందులోనూ సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడిన వీడియోలను ఉన్నది ఉన్నట్లు పెట్టడం ఇంకా పెద్ద తప్పు.
రాజకీయాల్లో లేని వారి టార్గెట్ కరెక్టేనా?
వైఎస్ భారతిని ఉద్దేశించి చేబ్రోలు కిరణ్ చేసిన కామెంట్స్ గురించి తెలియగానే.. టీడీపీ హైకమాండ్ సీరియస్ గా రియాక్ట్ అయింది. అతన్ని వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అటు మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వైసీపీ సానుభూతిపరుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు చేపట్టారు. రాజకీయాన్ని రాజకీయంతో ఎదుర్కోవాలి. అంతేగానీ.. రాజకీయాలతో సంబంధంలేని వారి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడడంతో చేబ్రోలు కిరణ్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో కిరణ్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ – ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరు తరలించారు. కోర్టు ముందు నిలబెట్టారు.
మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజు: చంద్రబాబు
మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది. సోషల్ మీడియాలో అరాచకపు మాటలు పెరగడంతో సొంత పార్టీవారైనా సరే ఇక కటకటాలే అని సిగ్నల్స్ ఇచ్చారు. పని చేస్తే సమాజహితం కోసం పని చేయాలని, మహిళలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడితే క్షమించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగానే సందేశమిచ్చారు. అసభ్య పోస్టులు పెట్టిన వారికి అదే చివరి రోజు అన్నారు. సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోతున్నారన్నారు. అందుకే కిరణ్ ఘటనను తీవ్రంగా తీసుకుని ఫాస్ట్ గా చర్యలు చేపట్టింది ప్రభుత్వం.
కిరణ్ పై పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు
సో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై కఠిన చర్యలతో సోషల్ మీడియా వారియర్లకు ప్రభుత్వం ఘాటు సందేశం పంపినట్లైంది. సొంత పార్టీ కార్యకర్తల్నే అరెస్ట్ చేస్తే ఇక ప్రత్యర్థి పార్టీలో ఇలాంటి చర్యలకు పాల్పడితే అంతే సంగతులన్న క్లారిఫికేషన్ ఇచ్చింది. అందుకే కిరణ్ పై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం – BNS 79, వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రేరేపించడం, అనుచిత వ్యాఖ్యలు , నేరపూరిత కుట్ర, వ్యవస్థీకృత నేరం, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 (ఏ) వంటి బెయిల్‌కు వీల్లేని సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేశారు.
కిరణ్ క్షమాపణల వీడియోలపై నెటిజన్ల ఫైర్
ఇక మ్యాటర్ చాలా సీరియస్ అయ్యే సరికి సదరు వ్యక్తి.. అరెస్ట్‌కు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. వైఎస్ భారతిగారు తనను క్షమించాలని, మహిళలు అంటే గౌరవం ఉందని, ఇంటర్వ్యూలో అసభ్యకరంగా మాట్లాడినందుకు కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడుగుతున్నా అని చెప్పుకొచ్చాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహిళలంటే గౌరవం ఉండి ఉంటే.. ఇంటర్వ్యూలో అలా ఎలా మాట్లాడుతారు.. ఆ వీడియోను కట్ చేయకుండా ఎలా అప్ లోడ్ చేస్తారన్న ప్రశ్నల్ని నెటిజన్లు సంధిస్తున్న పరిస్థితి.
మాజీ మంత్రి విడదల రజినీపైనా అసభ్య పోస్టులు
చేబ్రోలు కిరణ్ నోటి దురుసు ఇదొక్కటే కాదు.. సోషల్ మీడియాల్లో గతంలో చాలా సార్లు, చాలా మందిపై వల్గర్ లాంగ్వేజ్ తో కంటెంట్ వదిలాడని పోలీసులు గుర్తించారు. ఈ అనుచిత వ్యాఖ్యల విషయంలో కిరణ్‌కుమార్‌పై తాడేపల్లి, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు కేసులున్నాయని, ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి నగరంపాలెం, గన్నవరం పీఎస్‌ల్లో మరో రెండు కేసులున్నాయని గుంటూరు ఎస్పీ సతీష్ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాల్లో ఈయన పదే పదే అసభ్య దూషణలు చేస్తున్నారని, గతంలో మాజీ మంత్రి విడదల రజినిపైనా అసభ్య పోస్టులు పెట్టారన్నారు.
లోకేశ్ పై అసభ్య కామెంట్లతో గోరంట్ల మాధవ్ పై కేసు
కిరణ్ చేసిన కామెంట్స్ పై ప్రభుత్వమే స్పందించి వేగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటే.. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసుల సమక్షంలోనే కిరణ్‌పై దాడికి యత్నించారు. పోలీసులు నిందితుడిని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వాహనంలో తీసుకెళుతుండగా చుట్టుగుంట సెంటర్ వద్ద గోరంట్ల మాధవ్ తన కారు ముందుపెట్టి ఆ వాహనాలను అడ్డుకున్నారు. అంతే కాదు వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి నారా లోకేశ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు గోరంట్ల మాధవ్. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఇది ఆగడం లేదు.
సోషల్ మీడియా ముసుగులో అరాచకాలు
ఏపీలో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాలు కొత్త కాదు. ఏపీలో రాజకీయ యుద్ధాలు బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడది తారస్థాయికి చేరింది. టీడీపీ, వైసీపీ అభిమానుల ముసుగులో కొందరు సోషల్ మీడియాల్లో రెచ్చిపోతున్నారు. తమ పార్టీల తరపున వకాల్తా పుచ్చుకుని అవతలి వారిని ఇష్టం వచ్చినట్లు క్యారక్టర్ హసాసినేషన్ చేస్తున్నారు. పైవారి మెప్పు కోసం చేస్తున్నారా.. లేదంటే ఓవర్ రియాక్ట్ అవుతున్నారోగానీ.. ప్రత్యర్థి నేతలనే.. కాదు.. వారి భార్యలపైనా వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్న పరిస్థితి.
మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ వీడియోలు
వైసీపీ హయాంలో ఇలాంటి అసభ్య కామెంట్ల వ్యవహారం జోరుగా సాగింది. నారా భువనేశ్వరి గురించి కూడా నాటి వైసీపీ నేతలు చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. మహిళల గురించి, రాజకీయాల్లో లేని వారి గురించి ఇలా పోస్టులు పెట్టడం కొత్తకాదు. అసత్య ప్రచారాలు హద్దులు దాటేసి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల రేంజ్ వరకూ తీసుకెళ్లారు. ప్రత్యర్థి పార్టీలను విమర్శించే క్రమంలో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి నేతల కుటుంబాలను, మహిళలను టార్గెట్ చేయడం రెండు ప్రధాన పార్టీల సానుభూతి పరులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా కొంతకాలం నుంచి వైఎస్సార్ సీపీ మహిళలపై, నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులపై అసభ్యకరంగా మార్ఫింగ్‌లు చేసి పోస్టులు పెడుతున్నారని వైసీపీ నేతలు తాజాగా ఇస్తున్న కంప్లైంట్లలో పేర్కొంటున్న పరిస్థితి.
చంద్రబాబు, లోకేష్, పవన్, భువనేశ్వరి..
అటు టీడీపీలోనూ మహిళా నాయకురాళ్ల పరిస్థితి ఏమంత బాగాలేదు. సోషల్ మీడియాలో గతంలోనూ, ఇప్పుడూ వారిపై మార్ఫింగ్ వీడియోలు, వ్యక్తిత్వ హననాలు చాలానే జరిగాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, భువనేశ్వరి, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, ఇప్పుడు వైఎస్ భారతి.. ఇలా ఎవరినీ విడిచిపెట్టకుండా సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 680 మందికి నోటీసులు ఇవ్వగా 147మంది మీద కేసులు నమోదు చేశారు. 50 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అనుచిత పోస్టులు పెట్టిన వారిలో ఒక వర్రా రవీందర్ రెడ్డి ఉన్నారు. ఒక పోసాని, ఒక వర్మ, ఒక సజ్జల భార్గవ్ రెడ్డి ఇలా లిస్టు పెద్దదిగానే ఉంది.
వ్యక్తిత్వాలను కించపరిచే పోస్టులు పెట్టారని వర్మపై కేసు
ఎన్నికలకు ముందు విడుదలైన వ్యూహం సినిమా ప్రమోషన్ టైంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారని రాంగోపాల్ వర్మ మీద కేసు గతంలోనే నమోదైంది. గతంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్‌గా ఉన్న సజ్జల భార్గవరెడ్డిపైనా కేసులు నమోదయ్యాయి. పవన్ కల్యాణ్‌తో పాటు చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ పాలనలో ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పని చేసిన సినీనటుడు పోసాని కృష్ణ మురళి మీద కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ కూడా అయ్యారు. ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన వారు మిగిలే ఉన్నారు.
వ్యక్తిత్వ హననాలపై చంద్రబాబు సీరియస్
సోషల్ మీడియాను మంచికి వాడుదామంటూ ఏపీలో కూటమి ప్రభుత్వం 4 నెలల క్రితం నుంచే ప్రచారం చేపట్టింది. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాలో చెడు పోస్టులు వద్దంటూ క్యాంపెయిన్ చేపట్టింది. సోషల్ మీడియాను మంచికి వాడుదామంటూ భారీ హోర్డింగ్‌లు కూడా పెట్టారు. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయించారు. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదామంటూ ప్రజలకు పిలుపునిచ్చింది కూడా. ఇంత చేసినా వ్యక్తిత్వ హననం ఆగలేదు. వైఎస్ భారతిపై చేసిన కామెంట్ల తర్వాత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే అదే వారికి చివరి రోజు అని స్వయంగా సీఎం చంద్రబాబు అన్నారంటే ఇకపై ఎంత సీరియస్ గా మ్యాటర్ ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలకు షర్మిల డిమాండ్
సో సోషల్ మీడియాలో అరాచకాలు సృష్టించే వారికి ఇది ఫైనల్ కాల్ అని చెప్పొచ్చు. వైఎస్ భారతిపై కామెంట్ల విషయంలో సొంత పార్టీ కార్యకర్తపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేగంగా రియాక్ట్ అయిన ప్రభుత్వం.. ఇక ప్రతిపక్ష కార్యకర్తల కామెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదు. దీనికి పుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడే వాళ్లపై, రేటింగ్స్ కోసం ఎంటర్‌టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని వైఎస్ షర్మిల హెచ్చరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలని అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉందన్నారు. ఈ విష సంస్కృతికి బీజం వేయొద్దని, సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్లపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని అన్నారు. కొంతమంది రక్త సంబంధాన్ని మరిచారని.. మనిషి పుట్టుకను సైతం అనుమానించి రాక్షసానందం పొందారన్నారు.
వ్యక్తిత్వ హననం ఏపీలోనే ఉందన్న షర్మిల
ఫైనల్ గా సోషల్ మీడియా యుద్ధం ఏపీలో తారస్థాయికి చేరింది. దీనికి పుల్ స్టాప్ పెట్టే దిశగా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ చేపట్టబోతోంది. అది చేబ్రోలు కిరణ్ కుమార్ అరెస్ట్ నుంచే మొదలైంది. విపక్షం, స్వపక్షం కాదు.. ఏ పక్షమైనా ఖేల్ ఖతమే ఇక అంటోంది సర్కార్.