AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో జరిగే అవకాశముంది. ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్ ముందు నుంచి అసెంబ్లీ గైర్హాజరవుతున్నారు. తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు రారంటున్నారు. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారి బడ్జెట్ సమావేశాలకు వస్తారా…రారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. వరసగా అరవై రోజులు సభకు హాజరుకాకపోతే అనర్హత పడే అవకాశం ఉందని అధికార కూటమి నేతలు అంటున్నారు. సభకు రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. మరి ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి డుమ్మా కొడితే ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలల గడిచింది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావడం లేదు. తమ అధ్యక్షుడు జగన్‌కి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతామని ఆ పార్టీ భీష్మించుకుని కూర్చుంది. ఈ వ్యవహారంపై చివరకు జగన్ న్యాయస్థానం తలుపు కూడా తట్టారు. మరోవైపు అసెంబ్లీలో అవసరమైనంత సమయం మైక్ ఇవ్వరని, సెషన్స్ జరిగే సమయాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తానని జగన్ అంటున్నారు.
ప్రజాధనంతో జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి గైర్హజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేలా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుంది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం, టీఏ, డీఏలను పొందడంపై ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కోరుతున్నా వారు స్పందించడం లేదు.
ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు… ఈ సమావేశాలకు జగన్ ఆయన ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నామని రఘురామకృష్ణంరాజు మరోసారి పునరుద్ఘాటించారు. ఏ సభ్యుడైనా అరవై రోజుల పాటు సాగే అసెంబ్లీ పని దినాలలో… ఒక్క రోజైనా హాజరు కాకపోతే ఆయన మీద అనర్హత వేటు పడుతుందనే నిబంధనను గుర్తు చేస్తున్నారు డిప్యూటీ స్పీకర్. జగన్ కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి హాజరు కాకపోతే వారిపై చర్యలు తప్పవని రూల్స్‌ని గుర్తు చేస్తూ వస్తున్నారు.
బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారా…రారా అన్నది చర్చినీయంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే అంశంపై ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నైతిక విలువల కమిటీ ఇప్పటికే సమావేశం అయింది. వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు హాజరుకాకుండానే, అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నారనే ఫిర్యాదులపై ఈ కమిటీ చర్చించింది. మరో అయిదుగురు ఎమ్మెల్యేలు మాత్రం దొంగచాటుగా అసెంబ్లీకి వస్తూ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తున్నారంట.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనలను ధిక్కరిస్తూ, సభా కార్యక్రమాలకు గైర్హాజరవుతున్న ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది. శాసనసభ సమావేశాలకు రాకుండా పార్టీ నిర్ణయం పేరుతో బయటే ఉంటున్న ఈ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఖజానా నుండి అందే జీతాలు, టీఏ , డీఏ లను మాత్రం క్రమంతప్పకుండా తీసుకుంటున్నట్లు కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. ప్రజాప్రతినిధులుగా ప్రజల గొంతుకను సభలో వినిపించాల్సిన బాధ్యతను విస్మరించి, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం పదవులను వాడుకోవడం నైతికంగా నేరమని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
స్పీకర్ కూడా ఈ విషయంలో అత్యంత కఠినంగా ఉండాలని భావిస్తున్నారంట. సభకు రావడం అనేది ఎమ్మెల్యేల హక్కు మాత్రమే కాదు, అది వారి ప్రాథమిక బాధ్యత. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ సభను బహిష్కరించడం శాసనసభను అవమానించడమే అని స్పీకర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం, స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరుకాకపోతే సదరు సభ్యత్వంపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉంటుంది. ఆ క్రమంలో వారి నుంచిజీతాల రికవరీ , ఇతర కఠిన చర్యల దిశగా అడుగులు పడుతున్నాయంట.
శాసనసభ నిబంధనల ప్రకారం ఎథిక్స్ కమిటీ స్పీకర్‌కు సిఫారసులు చేసే అవకాశం ఉంది. సభకు హాజరుకాని రోజులకు సంబంధించిన జీతాన్ని, అలవెన్సులను నిలిపివేయడం లేదా రికవరీ చేయడం, నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి నిర్దిష్ట కాలం పాటు సభ నుండి సస్పెండ్ చేయడమో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, నిరంతరం గైర్హాజరవుతున్న వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలనో సభకు నివేదిస్తుంది.
మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఆరుగురు సభ్యులు అసెంబ్లీకి అసలు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నట్లు ఎథిక్స్ కమిటీ గుర్తించిందట. మిగిలిన ఐదుగురు సభ్యులు ఏదో ఒక సమయంలో సభకు వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తున్నట్లు రికార్డుల్లో ఉందట. అంటే, బయటకు బహిష్కరణ అని చెబుతూనే, సాంకేతికంగా పదవిని కాపాడుకోవడానికి, అలవెన్సులు పొందడానికి దొంగచాటు సంతకాల వ్యూహాన్ని అనుసరిస్తున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు పోటీలు నిర్వహించిన సమయంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో సైతం వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చ జరిగేలా ఒక స్కిట్ వేశారు. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది.
ప్రస్తుతం ఈ వ్యవహారంలో సభకు డుమ్మా కొడుతున్న ఆరుగురు ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు కూడా రాకపోతే.. నోటీసులు జారీ చేసి, వివరణ కోరాలని కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. విపక్ష హోదా లేదన్న సాకుతో సభకు రాకుండా తప్పించుకుంటున్న ఎమ్మెల్యేలకు ఈ పరిణామం ఒక పెద్ద హెచ్చరికగా మారనుంది. ఆ క్రమంలో సభకు హాజరుకావాలని డిప్యూటీ స్పీకర్ , విజ్ఞప్తుల పట్లు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో ఈసారి కూడా సభకు వైసీపీ ఎమ్మెల్యేలు గైరహాజరు అవుతారా….అన్నది చర్చనీయాంశంగా మారింది.
Story by: Apparao, Big Tv