TTD Ghee Case: అప్పన్న.. ఈ పేరు వినగానే సింహాచలం అప్పన్న స్వామి గురించి చెబుతున్నారేమో అనుకోకండి. ఇక్కడ చెప్పే అప్పన్న తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక సూత్రధారి. ఇప్పుడు సింహాచలం అప్పన్న బదులు రాష్ట్రమంతా ఈ అప్పన్న గురించే చర్చ జరుగుతుంది. రెండు రాజకీయ పార్టీలు ఈ అప్పన్న తమ వాడు కాదంటే తమ వాడు కాదంటూ మీడియా సమావేశాలు పెట్టి క్లారిటీ ఇస్తున్నాయి. దీంతో సింహాచలం అప్పన్న కంటే ఈ అప్పన్నే ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఈ అప్పన్న ఎవరి వాడు? ఏ పార్టీకి చెందిన వాడు?
అప్పన్న.. రెండు ప్రధాన పార్టీల స్టేట్‌మెంట్లతో ఫేమస్
అప్పన్న.. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. రెండు రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ఈ అప్పన్న గురించి ఇస్తున్న స్టేట్మెంట్లతో రాష్ట్రం మొత్తం అప్పన్న పేరు ఫేమస్ అయిపోయింది. తిరుమల కల్తీ నెయ్యి స్కామ్‌లో అప్పన్న నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన చెందిన వ్యక్తి. నెయ్యి కల్తీ స్కామ్ లో తెరపైకి వచ్చిన ఈ అప్పన్న తమకు చెందిన వాడు కాదు అంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కామెంట్ చేయడంతో పాటు వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన చర్చకు కారణమయ్యాయి. అప్పన్న వాస్తవానికి వైసీపీకి చెందిన సానుభూతి పరుడనే ప్రచారం ఉంది. కొద్దిరోజుల పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేశారని టాక్ ఉంది. అప్పుడు వేమిరెడ్డి వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయితే వైవీ సుబ్బారెడ్డికి ఎలాంటి పదవి లేని సమయంలో ఆయనను పనిలో పెట్టుకోమని రెకమండ్ చేసింది మాత్రం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అంటున్నారు.
షాడో వైవీ సుబ్బారెడ్డిగా చక్రం తిప్పినట్లు ప్రచారం..
కొద్దిరోజుల పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసిన అప్పన్న.. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆయన చెంత చేరాడు. అప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారాల్లో షాడో వైవీ సుబ్బారెడ్డిగా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. టీటీడీలో దర్శనాల నుంచి ఇతర కార్యకలాపాల వరకు అన్నిట్లో అప్పన్నే అనే విధంగా తానే టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్ని వ్యవహారాలను అప్పన్న తన మార్కు ఉండేలా కార్యకలాపాలు చక్కబెడుతూ మెలిగాడట. నెయ్యి సప్లై చేసే డెయిరీ వాళ్లతో కమీషన్లు తీసుకుని కిలోకి 25 రూపాయలు చొప్పున వసూలు చేశాడని కూడా సమాచారం. దీంతో కల్తీ నెయ్యి స్కామ్‌లో అప్పన్న నిందితుడిగా ఉన్నాడు ప్రస్తుతం. ఈ కేసు నెల్లూరు ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది.
జగన్ వ్యాఖ్యలు బాధిస్తున్నాయని వేమిరెడ్డి ఆవేదన..
ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అప్పన్న తమకు సంబంధించిన వ్యక్తి కాదు.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. అప్పన్న తన పీఏ కాదు అంటూ మరో స్టేట్‌మెంట్ ఇచ్చారు వైవీ. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. అప్పన్నకు తాను 50 వేలు చెక్కు ఇచ్చి సహాయం మాత్రమే చేశానని, అయితే ఆ సహాయం చేయమని చెప్పింది ఎవరో మీకు తెలీదా అంటూ మాజీ సీఎం జగన్‌కు చురకలు అంటించారు. అప్పన్న విషయం తన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు ఆయన. తాను ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటానని, ఆ లిస్టులో అప్పన్న కూడా ఒకరని చెప్పారు. చేసిన సహాయానికి బండలు మోయాల్సి వస్తుందని.. జగన్ వ్యాఖ్యలు బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పన అనే వ్యక్తి కుటుంబానికి జరుగు బాటు లేకపోవడంతోనే తాను సేవా భావంతో 50 వేల చెక్కు ఇచ్చానని స్పష్టం చేశారు. అంతేకాకుండా జగన్, వైవీ సుబ్బారెడ్డి చాలా మందిని పంపించారు… వారందరికీ కూడా తాను సేవా భావంతో సాయం చేశానని తెలిపారు.
Also Read: బీఆర్ఎస్ పై కవిత మరో బ్రహ్మాస్త్రం.. ఈసారి దెబ్బ తండ్రికే!
ఏదేమైనా అప్పన్న కొద్దిరోజులపాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉండి.. అనంతరం వైవీ సుబ్బారెడ్డి దగ్గర పనిచేశారనేది అందరికి తెలిసిన విషయమే అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపించే మాట. వైసీపీపై పడ్డ మరకను తుడుచుకునేందుకే అప్పన్న విషయం వేరే వారి పైన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇరు పార్టీల నేతలు అప్పన్న వ్యవహారంలో తమకు సంబంధం లేదు అంటూ ప్రకటించుకోవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అనే చెప్పాలి.
Story By Vamshi Krishna, Bigtv