April Rules: ఏప్రిల్ ఫస్ట్ అనగానే.. ఫూల్స్ డే అనేస్తారు. కానీ.. ఏప్రిల్ ఫస్ట్ అంటే.. ఇండియాలో రూల్స్ డే కూడా! ఫూల్స్ సంగతి పక్కనబెడితే.. కొత్తగా వచ్చే రూల్స్.. ఒక్కొకరూ ఫుల్ మీల్స్ తిన్నా అరగంటలోనే అరిగిపోయేలా చేస్తాయ్. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ.. చాలా కొత్త రూల్స్ రాబోతున్నాయ్. ఏప్రిల్ 1 నుంచి మన చుట్టూ జరిగే వ్యవహారాలు చాలా వరకు మారబోతున్నాయ్. వీటిలో కొన్ని పరోక్షంగా ప్రభావం చూపితే.. ఇంకొన్ని నేరుగా ఇంపాక్ట్ చూపనున్నాయ్. కొన్ని రూల్స్.. మన జేబులోని పర్సుని డైరెక్ట్‌గా తాకనున్నాయ్. ఈ ఆర్థిక సంవత్సరంలో.. కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయ్. ఈ ప్రభావం.. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరి ఖర్చులపై స్పష్టంగా కనిపించనుంది. గ్యాస్ ధరల నుంచి మొదలుపెడితే, ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్, పాన్ కార్డు మార్పులు, రైల్వే టికెట్ల నిబంధనలు.. ఇలా ప్రజలపై నేరుగా ఇంపాక్ట్ చూపేవి చాలానే ఉన్నాయ్.
ఏప్రిల్ 1 నుంచి బ్యాంకింగ్ రూల్స్ సహా కొత్త ఐటీ చట్టం అమల్లోకి రానుంది. ఇది, 1961 నాటి పాత పన్ను చట్టాన్ని భర్తీ చేయనుంది. ఇందులో.. చాలా మార్పులే చేసింది కేంద్రం. పన్ను ప్రక్రియని మరింత సులభతరంగా, సరళంగా ఉండనుంది. అసెస్మెంట్ ఇయర్, ప్రీవియర్ ఇయర్ స్థానంలో.. టాక్స్ ఇయర్ ఒక్కటే ఉండనుంది. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87ఏ కింద టాక్స్ రిబేట్ పరిమితిని పెంచారు. 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ 75 వేలతో కలిపి.. మొత్తం 12 లక్షల 75 వేల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రత్యేకంగా పాత పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే.. ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానం కిందే ట్యాక్స్ లెక్కిస్తారు. కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. సెక్షన్ 80C లాంటి మినహాయింపులు ఉండవు. ఈ ఏప్రిల్ ఒకటి నుంచే టీడీఎస్ ఫామ్స్‌లోనూ మార్పులు రానున్నాయి. ఫామ్-16, ఫామ్-16ఏ ని.. ఫామ్ 130, 131తో భర్తీ చేస్తున్నారు. టాక్స్ ఫైలింగ్ సమయంలో ఇది గందరగోళాన్ని తొలగించనుంది. ఆదాయ పన్ను రిటర్న్స్‌లో తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి ఇచ్చే సమయాన్ని 9 నెలల నుంచి 12 నెలలకు పెంచారు. అయితే, 9 నెలల గడువు దాటిన తర్వాత రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేస్తే కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు ఖర్చు లేకుండా రివైజ్ చేయాలనుకునే వారు పాత పద్ధతిలోనే.. 9 నెలల లోపు పూర్తి చేయాలి.
సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై పన్ను మినహాయింపుని కుదించారు. ఇప్పటివరకు మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. ఆ బాండ్‌ని నేరుగా ఆర్బీఐ దగ్గర కొన్నా, స్టాక్ మార్కెట్‌లో కొన్నా ఈ మినహాయింపు ఉండేది. ఏప్రిల్ 1 నుంచి, ఈ పన్ను మినహాయింపు కేవలం ఆర్బీఐ ద్వారా నేరుగా కొన్న వారికి మాత్రమే ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి బాండ్లు కొనుగోలు చేసి ఉంటే, మెచ్యూరిటీ లాభాలపై.. ఇకపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక.. పాన్ కార్డుకు సంబంధించి ఐటీ శాఖ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆధార్ ఉంటే సులభంగా పాన్ కార్డు ఇచ్చేవారు.
కానీ, ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు కోసం ఆధార్‌తో పాటు ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా సమర్పించాలి. టెన్త్ మెమో, ఓటర్ ఐడీ, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికెట్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక.. కొన్ని రకాల లావాదేవీలకు పాన్ కార్డు సమర్పించాల్సిన పరిమితులను పెంచారు. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు చేసేటప్పుడు పాన్ ఇవ్వాల్సిన పరిమితిని.. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఖాతాలో 10 లక్షలు, అంతకంటే ఎక్కువ నగదు జమ చేసినా, విత్ డ్రా చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
కొత్త ఆర్థిక సంవత్సరంలో.. ఉద్యోగుల జీతభత్యాల విషయంలోనూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయ్. కొత్త ఐటీ చట్టం, కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి రానుండటంతో.. ప్రతి నెలా ఉద్యోగుల చేతికి అందే టేక్ హోమ్ శాలరీలో మార్పులు రానున్నాయ్. బేసిక్ పే 50 శాతంగా ఉండాలని కొత్త రూల్స్ చెబుతున్నాయ్. బేసిక్ శాలరీ పెరిగితే అందుకు అనుగుణంగా.. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. ఫలితంగా.. ఉద్యోగుల చేతికి వచ్చే నగదు కొంచెం తగ్గే అవకాశాలున్నాయ్. ఇది.. వారి రిటైర్మెంట్ సేవింగ్స్‌ని పెంచుతుంది. ఇకపై.. ఉద్యోగుల పే స్లిప్‌లు కొంత భిన్నంగా కనిపిస్తాయ్. బేసిక్ పే, అలవెన్సులు, పన్ను కోతల లాంటివన్నీ.. కొత్త రూల్స్‌కి అనుగుణంగా మారతాయ్.
కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి రానుండటంతో.. ఉద్యోగులకు అత్యంత అనుకూలమైన మార్పు ఒకటి రాబోతోంది. ఉద్యోగులకు అత్యంత అనుకూలమైన సంస్కరణ ఇదే అని చెప్పాలి. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ సమయాన్ని భారీగా తగ్గించారు. గతంలో.. ఉద్యోగం మానేసిన వారు తమ జీతం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర బకాయిల కోసం 30 నుంచి 90 రోజుల దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది. దాంతో.. కొత్త ఉద్యోగంలో చేరే సమయంలో వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే.. ఏప్రిల్ నుంచి ఓ ఉద్యోగి రాజీనామా చేసినా, తొలగించినా, మరే ఇతర కారణం చేత సంస్థ నుంచి విడిపోయినా, వారి చివరి పని దినం నుంచి రెండు పని దినాలలోపే వేతన సంబంధిత బకాయిలన్నీ కంపెనీ చెల్లించాలి.
సెటిల్‌మెంట్ ఆలస్యం చేయడం అనేది ఇకపై చట్ట ఉల్లంఘన అవుతుంది. బాధితులు లేబర్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించి, ఆలస్యమైన పేమెంట్లకు వడ్డీని కూడా క్లెయిమ్ చేయవచ్చు. అయితే, గ్రాట్యుటీ, ఈపీఎఫ్ బదిలీలు ఈ రెండు రోజుల నిబంధన కిందకు రావు. ఈపీఎఫ్ విత్ డ్రా నిబంధనలను కూడా సులభతరం చేశారు. విత్ డ్రా రూల్స్‌ని.. కేవలం 3 కేటగిరీలుగా కుదించారు. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అడ్వాన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని 5 లక్షలకు పెంచారు.
ఇక, విదేశీ టూర్లు వెళ్లేవారు, విదేశాల్లో విద్య, వైద్యం కోసం ఖర్చు చేసేవారికి.. ఏప్రిల్ ఒకటి నుంచి టీసీఎస్ తగ్గింపు వర్తిస్తుంది. గతంలో విదేశీ టూర్ ప్యాకేజీలపై 7 లక్షల లోపు 5 శాతం, ఆ పైన 20 శాతం టీసీఎస్ ఉండేది. ఏప్రిల్ నుంచి ఎలాంటి పరిమితి లేకుండా.. అన్నింటికి 2 శాతం ఫ్లాట్ రేటు వర్తిస్తుంది. బ్యాంకుల ఏటీఎం నిబంధనల్లోనూ మార్పులు రాబోతున్నాయ్. కొన్ని ప్రధాన బ్యాంకులు.. యూపీఐ విత్‌డ్రాయల్స్‌ని కూడా ఇకపై.. ఏటీఎం ఉచిత లావాదేవీల్లో కలపనుంది. దాంతో.. ఫ్రీ ట్రాన్సాక్షన్ల పరిమితి త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. లిమిట్ దాటాక ప్రతి లావాదేవీపై.. 23 రూపాయలు ఛార్జ్ చేయనున్నారు. బ్యాలెన్స్ లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే 25 రూపాయలు ఫైన్ వేస్తారు. క్రెడిట్ కార్డుల్లోనూ బ్యాంకులు రివార్డు పాయింట్లలో కోత విధించాయ్. రెంట్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఇచ్చే రివార్డు పాయింట్లని తగ్గించడం గానీ, నిలిపేయడం గానీ చేయనున్నాయ్. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే.. మినిమమ్ స్పెండ్ పరిమితిని పెంచే అవకాశం ఉంది.
ఇండియన్ రైల్వేస్.. రైల్ టికెట్ క్యాన్సిలేషన్ పాలసీని అప్‌డేట్ చేసింది. రైలు బయల్దేరే కనీసం 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ అస్సలు రాదు. అంతకుముందు ఇది 4 గంటలు ఉండేది. రైలు బయల్దేరనున్న కనీసం 24 గంటల నుంచి 8 గంటల వరకు అయితే.. 50 శాతం రిఫండ్ పొందొచ్చు. 24 నుంచి 72 గంటల్లోపు క్యాన్సిల్ చేస్తే.. టికెట్ ధరలో 25 శాతం కోత విధించి. మిగతాది రిఫండ్ చేస్తారు. కనీసం 72 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే.. కనీస ఛార్జీలతో మినహాయించుకొని మిగతా మొత్తం ఇచ్చేస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా BS7 ఉద్గార నియమాలు అమలు కానున్నాయ్. ఇది వాహనాల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్త వాహనాల్లో రియల్ టైమ్ ఎమిషన్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. టైర్లు, బ్రేక్ డస్ట్ వల్ల కలిగే కాలుష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఇండియాలో ఈ ఏప్రిల్ నుంచి కనిపించబోయే భారీ మార్పు.. మావోయిస్ట్ రహిత భారతదేశం. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ ముగిసింది. గడిచిన కొన్నేళ్లలో.. వందలాది మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. మరికొందరు లొంగిపోయారు. ఒకప్పుడు వందలాది జిల్లాల్లో ఉన్న మావోయిజం.. ఇప్పుడు ఒకట్రెండు ఏరియాలకే పరిమితమైంది. దేశంలో మావోయిజం అంతమైందని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. నక్సల్స్ రహిత భారతం ఆవిర్భవించిందని చెప్పారు. 2026 మార్చి 31లోగా దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని చెప్పినట్లే.. నక్సల్స్ రహిత భారత్ కల సాకారమైందన్నారు. బస్తర్‌లో కూంబింగ్ ఆపరేషన్ కూడా ముగిసిందని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు.
కేంద్రానికి సహకరించిన గిరిజనులకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామన్నారు. మొత్తానికి.. ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులు.. సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. గ్యాస్ ధరల నుంచి బ్యాంక్ ఛార్జీల దాకా, పన్నుల నుంచి ప్రయాణ ఖర్చుల దాకా ప్రతి అంశంలో మార్పులు కనిపిస్తాయ్.
Also Read: ఇరాన్‌లో ‘కుర్చీ’ లాట.. యుద్ధం వేళ అధ్యక్షుడికే ఎదురుదెబ్బ!
Story by: Anup, Big Tv