Arava Sridhar: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని జనసేన పార్టీ లైట్ తీసుకుందా? ఘటన జరిగి రెండు నెలలు దాటుతున్న ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణాలేంటి? క్రమశిక్షణ చర్యలంటూ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ విచారణ జరిపి తేల్చినిందేంటి? కమిటీ ఏర్పాటు చేసి ఇన్ని రోజులు అయినా.. ఇంకా నివేదిక ఎందుకు ఇవ్వలేకపోయింది?.. అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన సైలెన్స్ కి కారణాలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…
అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్‌పై లైంగింక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. జనసేన ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ, ఒక ప్రభుత్వ ఉద్యోగిని వీడియోలు ఆడియోలు బయట పెట్టి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ ఇష్యూకి సంబంధించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పోరాటం చేస్తున్న హర్ష వీణ అనే ఆ మహిళకు న్యాయం జరిగే అవకాశాలు లేవనే చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది.
దానికి ప్రధాన కారణం ఇప్పటివరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. కనీసం విచారణ కమిటీ అంటూ ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వకపోవడం పైన విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీని నియమించి నిజానిజాలు వెలికితీయాలని ఆదేశించినప్పటికీ.. రోజులు, వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కనీసం ప్రాథమిక నివేదిక కూడా పార్టీ అధినేత వద్దకు చేరలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో అరవ శ్రీధర్ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయట. సాధారణంగా అధికార పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇలాంటి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఈ ఏడాది జనవరి లో అరవ శ్రీధర్ వ్యవహారం బయటికి వచ్చింది. వెంటనే స్పందించిన జనసేన పార్టీ… అరవ శ్రీధర్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరు వెళ్లి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పాటు పలువురు పార్టీ నేతలను విచారించింది. బాధితురాలు వీణ నేరుగా కమిటీ ముందు హాజరు కాకపోయినా.. ఈ కేసుకు సమబందించి పూర్తి వివరాలను కమిటీకి సీల్డ్ కవర్‌లో సబ్మిట్ చేశారు.
అయితే ఆ విచారణ ఆధారంగా కమిటీ ఏ నిర్ణయానికి వచ్చింది.. నివేదికను అధినేతకు సమర్పించిందా? లేదా అన్నదానిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ నివేదిక సమర్పించి ఉంటే అందులో ఏముందన్నదానిపై పార్టీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ అరవ శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో… అసలు విచారణ కమిటీ తన విచారణ పూర్తి చేసిందా? లేక ఇంకా విచారణ పేరుతోనే కాలయాపన చేస్తుందా అనే దానిపై స్పష్టత రావడం లేదు. మరోవైపు అరవ శ్రీధర్ వ్యవహారం , అతని వ్యక్తిగత వ్యవహారం అంటూ జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చెబుతున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని పార్టీ చాలా లైట్ తీసుకుందననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఈ వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ తనకు న్యాయం జరగడం లేదని, ఎమ్మెల్యేని కాపాడే ప్రయత్నం జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. తనకు న్యాయం జరగకపోగా తిరిగి పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయకపోవడం, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై బాధితురాలు వీణ కోర్ట్ కి వెళ్లడం ..పరిస్థితిని మరింత వివాదాస్పదంగా మార్చిందట.
ఓ మహిళా ఉద్యోగి ఏకంగా ప్రజాప్రతినిధిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. అయితే ఈ వ్యవహారంలో హర్ష వీణ కూడా అరవ శ్రీధర్‌ను డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరించిందన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో అసలు ఈ వ్యవహారంలో నిజా నిజాలు ఏంటి, నిజంగా ఎమ్మెల్యే తప్పు చేశారా?.. లేక ఎవరైనా కావాలనే ప్లాన్ చేసి ట్రాప్‌లో పడేశారా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయపరమైన కుట్ర ఏమైనా ఉందా? స్థానిక టిడిపి నేతలు రాజకీయ కోణంలో వ్యవహారాన్ని ముందుకు తెచ్చారా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయట. ఇవన్నీ పక్కన పెడితే ఘటన జరిగి ఇంతకాలం గడిచినా కమిటీ నివేదిక బయటకు రాకపోవడం, అలాగే పార్టీ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారానికి జనసేన అటకెక్కించడానికి నిర్ణయించుకుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ అంశంపై జనసేన నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందట.
మొత్తానికి అరవ శ్రీధర్ వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ నివేదిక ఏమైంది, అసలు నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? లేదా? అన్న అనుమానాలు ప్రభలుతున్నాయి. ఎమ్మెల్యేనే సదరు కమిటీని మేనేజ్ చేస్తున్నారా? లేక పార్టీ అధిష్టానమే ఈ వ్యవహారాన్ని నీరు గార్చడానికి చూస్తుందా? అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అరవ శ్రీధర్ వ్యవహారాన్ని ఇన్ని రోజులు నాన్చడం పార్టీని డ్యామేజ్ చేస్తోందని జనసైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారంట.
Also Read: గుంటూరు వైసీపీలో బిర్యానీ వార్.. జగన్ షెడ్యూల్ మార్పు వెనుక అసలు కథ ఇదే!
Story by: Apparao, Big Tv