తలాపున పారుతుంది గోదారి.. నా చేను నా చెలక ఎడారి.. ఈ పాట మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఉద్యమానికి ఊపిరిలూదింది.కానీ గోదారి పారుతన్న జిల్లాలకే భారీ నీటి ప్రాజెక్టుగా చెప్పుకున్న కాళేశ్వరం ద్వారా నీరందలేదు. రైతుల ఆశలు తీరలేదు. ప్రజల గోసలకు తెరపడలేదు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినామని చెప్పుకున్న కేసీఆర్… దీని ద్వారా ఆపారమైన కీర్తి గడించాలని .. అదంతా తన క్రెడిటేనని చెప్పుకోవాలని ఆశపడ్డాడు. అందుకే డిజైన్ మారింది. అంచనాలు మారాయి. తుమ్మిడిహట్టి నుంచి అది మేడిగడ్డకు తరలింది. దీనిపై ఎంతగా వ్యతిరేకించినా కేసీఆర్ వినలేదు. అనుకున్నట్టే చేశారు. అంతా భావించినట్టే అది కుప్పకూలింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరమై కూర్చున్నది.
కేసీఆర్ ప్రభుత్వం పతనం కావడానికి గల కారణాల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు. దీనిపై విచారణ పూర్తయయ్యింది. ఇక శిక్షలే మిగిలి ఉన్నాయి. బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉంది. అది నిర్ణయం తీసుకోదు. బాధ్యులు, దోషులకు శిక్షలు పడవు. అది తేలిపోయింది. మరి లక్ష కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఏంటీ? ఇది పార్టీలకతీతంగా అందరినీ తొలిచివేసింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం వృథా కావడమే కాకుండా.. ఇంకా సమైక్య రాష్ట్రంలో పడుతున్న సాగునీటి వెతలు ఇంకా పడాలా? ఇవి ప్రశ్నలు వేధించాయి తెలంగాణ సమాజాన్ని.
కానీ సర్కార్ ఇప్పుడు దీన్ని చక్కదిద్దే పనికి పూనుకున్నది. తప్పుసరిదిద్ది.. మళ్లీ పాత పద్దతిలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంకురార్పణ చేయనుంది. మార్పులు, చేర్పులు, పాత డిజైన్లు ఆధారంగా అంచనాలు రూపొందుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆదిలాబాద్ వేదికగా స్వయంగా ప్రకటించారు ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి. కాళేశ్వరం పేరు ఇక వినిపించదు. పనిచేయని ప్రాజెక్టుకు మళ్లీ ప్రాణం పోయాలంటే పాత ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల ద్వారానే సాధ్యమని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ఆ చెప్పిన మాటను నిజం చేసే పనిలో ఉంది.
సాగునీరందని తెలంగాణ సమాజానికి ప్రాణహిత ద్వారా జీవం పోయనుంది. గోదారి తలాపున ఉన్న పల్లెలు, జిల్లాలు అన్నీ ప్రాణహితం ద్వారా జలసిరులకు ఆనవాళ్లుగా నిలవాలని సర్కార్ తలస్తోంది. ఇది అందరికీ శుభవార్తే. పార్టీలకతీతంగా అంతా ఈ వివాదానికి బ్రేక్‌పడి, జరిగిన నష్టానికి నివారణ జరిగి, తగిన పరిష్కారం కావాలని భావించారు. సర్కార్ చర్యలు ఇప్పుడు వడివడిగా అటే పడుతున్నాయి. ఇదే కోరుకుంది తెలంగాణ రైతాంగం. నేరానికి శిక్ష జనం వేసింది. ఇప్పుడు ఆ నేరానికి జనం బలికావొద్దనేదే అంతిమ పరిష్కారం. సర్కార్ తీరు.. తీర్పు ఆ దిశగానే సాగుతుండడం శుభపరిణామం. పచ్చని అడవి తల్లి సాక్షిగా సర్కార్ ఈ ప్రతిన పూనింది. అది పూర్తికావడమే మిగిలుంది.