Astronaut Sunita Family: అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ సాంకేతిక సమస్యతో సునీతా విలియమ్స్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఇన్ని నెలల పాటు జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచాన్ని ఉద్వేగానికి గురిచేశాయి. కేవలం 8 రోజుల్లోనే పూర్తికావాల్సిన ఆమె ప్రయాణం 9 నెలలు పట్టింది. ఆమె భూమిపైకి తిరిగి రావడాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనించారు.
సునీత విలియమ్స్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా.. గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఈమె తండ్రి న్యూరో అనామిస్ట్ గా వైద్య వృత్తిని కూడా కొనసాగించారు. సునీత విలియమ్స్ తల్లి ఉర్సులైన్ బోని పాండ్యా.. ఈమె స్లోవేకియాకు చెందినవారు. వీరికి సునీత, జేయ్ థామస్, దినా ఆనంద్ సంతానం. ఈమె 1965 సెప్టెంబర్ 19వ తేదీన ఒహియోలో జన్మించారు.
మసాచుసెట్స్‌లో 1983లో హైస్కూల్, 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి బీఎస్సీ, 1995లో ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో సునీత ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 1997లో మిలటరీలో చేరిన సునీత.. 30 రకాల విమానాలను 3 వేల గంటలు నడిపిన అనుభవం పొందారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. 2006 డిసెంబర్‌లో తొలిసారి ఐఎస్‌ఎస్ వెళ్లారు. అంతరిక్షంలో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అప్పట్లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు. నాలుగు స్పేస్‌వాక్‌లు చేశారు.
2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో తన సహచరుడు అయిన బుచ్ విల్మోర్ తో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఆమె చేరుకున్నారు. ఇక ప్లాన్ ప్రకారమే వారం రోజులకే భూమికి చేరుకోవాలి. కానీ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. వీరిద్దరూ లేకుండానే ఆ వ్యోమ నౌక భూమికి తిరిగి వచ్చింది. దాంతో వీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాన.. ఆస్ట్రోనాట్లు సేఫ్‌గా భూమికి చేరుకున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ.. మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లతో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది.
గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమివైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి.. ఒడ్డుకు చేర్చారు.
2012లో రెండోసారి, 2024లో మూడోసారి వెళ్లిన సునీత.. మొత్తంగా ఇప్పటివరకు తొమ్మిది సార్లు, 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసి.. అత్యధిక సమయం స్పేస్‌వాక్ చేసిన నాలుగో నాసా వ్యోమగామిగా నిలిచారు. అమెరికా రక్షణశాఖ అత్యున్నత పురస్కారం డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్ తో పాటు అనేక అవార్డులు పొందిన ఆమెకు భారత్ కూడా 2008లో పద్మ భూషణ్‌తో సత్కరించింది.
Also Read: అంతరిక్షంలో సునీత ఏం చేశారు?
సునీతా విలియమ్స్‌కు శునకాలంటే ఇష్టమట. ఆమెకు లాబ్రడార్ జాతికి చెందిన రెండు శునకాలున్నాయి. భర్త మైఖేల్ ప్రస్తుతం వాటి సంరక్షణ చూస్తున్నారు. భర్తతో కలిసి వాటిని వెంట పెట్టుకొని బయటకు వెళ్లడం, వర్కౌట్ చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, కార్లు, విమానాలు రిపేర్లు చేయడంతో పాటు ఔటింగ్ వెళ్లి ప్రకృతిలో గడపడమంటే సరదా. హిందూ మతాన్ని ఆచరించే సునీత.. 2006లో భగవద్గీతను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లారు.
రెండోసారి వెళ్లినప్పుడు ఓం గుర్తును, ఉపనిషత్తుల కాపీని వెంటపెట్టుకొని వెళ్లారు. గుజరాత్‌లోని ఝూలాసన్ ఆమె పూర్వీకుల గ్రామం. భారత్‌లో రెండుసార్లు పర్యటించారు. 2007లో అక్కడ పర్యటించిన సునీత.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. సునీతా విలియమ్స్‌ను అమెరికాలో సునీ, స్లొవేనియాలో సోంకా అనే పిలుస్తారట. ఫెడరల్ మార్షల్ మైఖేల్ విలియమ్స్‌ను సునీత వివాహం చేసుకున్నారు. టెక్సాస్‌లో ఉండే వీరిద్దరూ కెరీర్ ప్రారంభంలో హెలికాప్టర్లు నడిపేవారు.