Hema: తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఎంతో వినసొంపైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హేమా ఇకపై సినిమాలు చేయబోనని ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
“14 ఏళ్ల వయస్సు నుంచే సినిమాల్లో నటిస్తున్నా. ఇక చాలనిపిస్తోంది. ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలి అనిపించింది. ఇంతకాలం అందించిన ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు” అని హేమా తన భావాలను వ్యక్తపరిచారు.
సినిమాల నుంచి ఎందుకు బ్రేక్?
హేమా సినీ కెరీర్‌ను వీడటానికి కారణాలపై ఆసక్తిగా అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందిస్తూ, “ఇప్పటి వరకు నా జీవితం సినిమాల చుట్టూనే తిరిగింది. కానీ ఇకనుంచి నా కోసం బతకాలని అనిపిస్తోంది. హెల్త్‌గా ఉండటానికి ట్రై చేస్తున్నా. నన్ను నేను ప్రేమించుకోవాలి” అని చెప్పుకొచ్చారు.
అయితే, కొన్నాళ్ల క్రితం రేవ్ పార్టీ వివాదంలో హేమ పేరు తెరపైకి రావడం, పోలీసుల నుంచి నోటీసులు అందుకోవడం, విచారణకు హాజరుకావడం వంటి ఘటనలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదం తర్వాత హేమ ఎక్కువగా మీడియా ముందు కనిపించలేదు. సినిమాల్లో కూడా నటించలేదు. ఫైర్ బ్రాండ్‌గా మాట్లాడే హేమ, ఈ ఘటన తర్వాత మౌనంగా మారడం గమనార్హం. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేసి, సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకునేలా చేసిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
హేమా సినీ ప్రయాణం
హేమా తెలుగు సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా నటించింది. తన కెరీర్‌లో అనేక హిట్ సినిమాల్లో నటించి, ముఖ్యంగా కామెడీ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఈవి.వి. సత్యనారాయణ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి, అలాగే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరోలతో కలిసి నటించింది. “పోకిరి,” “గబ్బర్ సింగ్,” “అత్తారింటికి దారేది,” “మిస్టర్ పర్‌ఫెక్ట్” వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాలతో పాటు బుల్లితెర షోలలోనూ ఆమె తన హాస్యంతో అలరించారు.
ఫ్యూచర్ ప్లాన్స్?
సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పిన హేమా, ఇకపై వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.