Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం కేవలం ఇరాన్‌కు సంబంధించిన విషయం కాదు. మిడిస్ ఈస్ట్ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసే ఓ పెద్ద పరిణామం ఇది.. ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్తుని సందేహంలోకి నెట్టడమే కాదు, ప్రాంతీయ అస్థిరత ప్రమాదాన్ని సైతం పెంచింది. దశాబ్దాలుగా ఇరాన్ విదేశాంగ విధానం, న్యూక్లియర్ ప్రోగ్రామ్, ప్రాక్సీ గ్రూపుల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఆయనే. ఇప్పుడు.. ఖమేనీ భౌతికంగా లేకపోవడంతో ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీని గురించే చర్చిస్తోంది. ఎందుకంటే.. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. సుప్రీం లీడర్ అనేది అత్యున్నత పదవి. సైన్యం, న్యాయ వ్యవస్థ, మీడియా అన్ని ఆయన నియంత్రణలోనే ఉంటాయ్. 1989 నుంచి అలీ ఖమేనీ ఈ పదవిలో ఉన్నారు. ఈయన అధికారంలో లేని సమయం ఇరాన్ యూత్‌కి తెలియదు. ఇరాన్ అధికార వ్యవహారాలన్నింటికీ సుప్రీం లీడరే సెంటర్ పాయింట్. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ వ్యవహరమైనా ఈయన వీటో చేయగలరు. ప్రభుత్వ అధికారులను స్వయంగా ఎంపిక చేయగలరు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సహా మిలటరీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉండటం.. సుప్రీం లీడర్‌ని మరింత శక్తిమంతుడిని చేసింది.
అలీ ఖమేనీ మరణం తర్వాత.. ఇరాన్ అనేక సవాళ్లు ఎదుర్కొబోతోంది. ఈ క్రమంలోనే.. ఖమేనీ వారసుడి ఎంపిక గురించి ఇరాన్ ఓ ప్రకటన చేసింది. కొత్త సుప్రీం లీడర్‌ని ఎన్నుకునేంత వరకు.. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్, న్యాయాధిపతి, శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్‌కు చెందిన ఓ మతపెద్ద కలిసి సుప్రీం లీడర్ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తిస్తారు. ఆవిధంగా ఇరాన్‌లో చాలా ఏళ్ల తర్వాత సుప్రీం లీడర్ నుంచి పాలన కౌన్సిల్‌కు మారింది. ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి దేశ పాలనా పగ్గాలు చేరినట్లు.. ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఖమేనీ వారసుడి ఎంపిక బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌పైన ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం.. సాధ్యమైనంత త్వరగా ఎంపిక జరిగిపోవాలి. కానీ.. ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు, దాడుల దృష్ట్యా.. అసెంబ్లీ సభ్యులందరినీ సమావేశపరచడం భద్రతా కారణాలరీత్యా అంత తేలిక కాదు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. ఖమేనీ వారసుడిని ఎంపిక చేసే బాధ్యత.. ఆయన్ని ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌కే ఉంమటుంది. ఇందులో.. 88 మంది షియా మత గురువులు ఉంటారు. ఈ విభాగమే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత చూస్తుంది. ఇందులోని సభ్యులను, ప్రజలు ఎనిమిదేళ్లకోసారి ఓటు ద్వారా ఎన్నుకుంటారు. నిజానికి.. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు అత్యంత విధేయులైన మతపెద్దలకే పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అందువల్లే ప్రస్తుత అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు ఖమేనీ సిద్ధాంతాన్ని పాటించేవాళ్లే.
సుప్రీం లీడర్ వారసత్వంపై మతాధికారుల చర్చలు రహస్యంగా సాగుతాయ్. గతంలో ఖమేనీ శిష్యుడు ఇబ్రహీం రైసినీ వారసుడిగా పరిగణించారు. కానీ, 2024లో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అందువల్ల.. ఖమేనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే శక్తిమంతమైన నాయకుడు ప్రస్తుతం ఇరాన్‌లో స్పష్టంగా కనిపించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమేనీ కుమారుల్లో ఒకరైన 56 ఏళ్ల షియా మతాధికారి మోజ్తాబా ఖమేనీ వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయ్. అయితే.. వారసత్వ రాజకీయాలపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ అధికార పోరులో.. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కీ రోల్ పోషించే అవకాశం ఉంది.
కొన్నేళ్లుగా.. ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమాలు, దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై నిరసనలు మిన్నంటుతున్నాయ్. ఖమేనీ లాంటి బలమైన, పట్టున్న నాయకుడు లేని సమయంలో.. యువత, విద్యావంతులు, మేధావులు.. మత గురువుల పాలన కంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయ్. పాలనలో చీలికలు వచ్చి సంస్కరణవాదులు, కఠినవాదుల మధ్య అంతర్యుద్ధం తలెత్తే పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయ్. ప్రస్తుతానికి.. ఇరాన్ వ్యవస్థలో ఆ దేశ సైన్యమే, అత్యంత బలమైన శక్తి. మత గురువుల కంటే కూడా ఇప్పుడు సైన్యం చేతుల్లోనే అసలు అధికారం ఉంది. మతపరమైన ముసుగులో ఉంటూనే.. IRGC పూర్తిస్థాయిలో దేశాన్ని తన చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయ్. అదే జరిగితే.. ఇస్లామిక్ రిపబ్లిక్‌లో పక్కా మిలిటరీ పాలన వస్తుంది. ఒకవేళ ప్రజల నిరసనలు మిన్నంటి, అంతర్జాతీయ మద్దతు తోడైతే.. 1979 నాటి విప్లవానికి ముందున్న పరిస్థితులు వచ్చి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. కానీ.. ఇది అంత ఈజీ కాదనే అభిప్రాయాలున్నాయ్.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంతం తర్వాత.. పశ్చిమాసియాలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారిపోయాయ్. 1989 నుంచి ఇరాన్‌ని తిరుగులేని శక్తిగా నడిపించిన ఖమేనీ మరణం.. ఆ దేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ ప్రతీకార యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే.. మరోవైపు దేశాన్ని నడిపేదెవరు? నెక్ట్స్ సుప్రీం లీడర్ ఎవరనే చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. ఇరాన్ భవిష్యత్ డిసైడ్ అయ్యే కీలక సమయం ఇది. ఇప్పటికే.. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్, అమెరికా స్టేట్‌మెంట్స్ ఇచ్చాయి. ఖమేనీ అంతంతోనే తమ లక్ష్యం నెరవేరలేదని, అతని సన్నిహితులు, నమ్మకస్తులు, కీలక రక్షణ స్థావరాలు పూర్తిగా అంతమయ్యే వరకు ఊరుకునేది లేదని చెబుతున్నాయ్. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఎలా వ్యవహరించబోతోందనేది ఆసక్తిగా మారింది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత.. ఒకే ఒక్కసారి ఇరాన్‌లో అధికార బదిలీ జరిగింది. ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఖమేనీ స్థానాన్ని భర్తీ చేయడం సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల పేర్లు సుప్రీం లీడర్ రేసులో బలంగా వినిపిస్తున్నాయ్. అలి ఖమేనీ రెండో కుమారుడు మోజ్తబా ఖమేనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌తో ఇతనికి బలమైన సంబంధాలున్నాయ్. వారసత్వ రాజకీయం ఇరాన్ సిద్ధాంతాలకు విరుద్ధమని కొందరు అంటున్నా, ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మోజ్తబా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. ఇక.. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న అయతొల్లా అలీరెజా అరాఫీ కూడా రేసులో ఉన్నారు. హార్డ్ లైనర్‌గా పేరున్న అరాఫీకి మతపరమైన రాజకీయ పరమైన మద్దతు ఉంది. ఇక.. మహమ్మద్ మెహదీ మిర్భాఘేరి పేరు కూడా వినిపిస్తోంది. తీవ్రవాద భావజాలం ఉన్న మతగురువుగా ఇతనికి గుర్తింపు ఉంది. పాశ్చాత్య దేశాల పట్ల ఇతను అత్యంత కఠినంగా ఉంటాడు.
ఇప్పుడు ఇరాన్ ముందున్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే.. ఒకేసారి యుద్ధం, అంతర్గత స్థిరత్వం కాపాడుకోవడం. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్ మిసైల్ దాడులకు దిగుతోంది. రివేంజ్ అనేది ఇరాన్ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి, అక్కడి ప్రభుత్వం దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అయితే, సుప్రీం లీడర్ లేని సమయంలో.. ఇరాన్ సైనిక శక్తి అయిన రెవల్యూషనరీ గార్డ్స్ దేశంపై పూర్తి నియంత్రణ సాధించే అవకాశం ఉంది. దేశం సైనిక పాలన వైపు వెళ్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. పరిపాలనని పట్టించుకోకపోతే, ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల.. ఇరాన్ ఇప్పుడొక కన్ఫ్యూజన్ స్టేజ్‌లో ఉంది. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటూనే, లోపల తన అధికారాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ఖమేనీ మరణాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. కచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది.
ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ క్యాబినెట్ తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగొచ్చని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాలే లక్ష్యంగా భారీ ఆపరేషన్‌కు ఐఆర్‌జీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఇదంతా అయ్యే పనేనా? అనే డౌట్ కూడా వినిపిస్తోంది. ఇరాన్ దగ్గర ఎన్నో మిసైళ్లు ఉన్నా.. అవేవీ అమెరికాని తాకలేవు. అదే.. అమెరికా ధైర్యం. దీనికితోడు మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ.. అమెరికాకు అనుకూలంగానే ఉన్నాయ్. దాంతో.. ఈ యుద్ధంలో ఇరాన్ ఒంటరిగా పోరాడుతోంది.
మరోవైపు.. ఇజ్రాయెల్, అమెరికా.. ఇరాన్ ప్రజలనుద్దేశించి కీలక ప్రకటనలు విడుదల చేశాయ్. ఇరాన్‌లో నిరంకుశ పాలనని సవాల్ చేసేందుకు దేశంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపాయ్. పాలక వర్గాన్ని గద్దె దించడానికి ఇదే సరైన సమయమన్నారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడులతో.. ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని, రాబోయే రోజుల్లో ఇరాన్‌లోని అనేక స్థావరాలను టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని, భారీ ఎత్తున వీధుల్లోకి రావాలని అమెరికా, ఇజ్రాయెల్ పిలుపునిచ్చాయ్. ఇది జరిగితేనే.. ఇరాన్‌కు ఇంటా, బయట సెగ తగులుతుందని భావిస్తోంది. కానీ.. ఇది జరుగుతుందా? లేదా? అనే దానిపైనే ఇరాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇరాన్ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం ఈ పరిస్థితిని వాడుకుంటారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే.. ఖమేనీ శకం ముగియడమనేది ఇరాన్‌కు చిక్కు ప్రశ్న మాత్రమే కాదు, ఓ పెద్ద రాజకీయ భూకంపం లాంటిది. అందువల్ల.. ఇరాన్.. ఇస్లామిక్ రిపబ్లిక్‌గానే ఉంటుందా? ఆధునిక ప్రజాస్వామ్య దేశంగా మారుతుందా? అనేది అక్కడున్న సైన్యం వైఖరి, ప్రజల పోరాటంపై ఆధారపడి ఉంది. ఏదేమైనా.. రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంలోనూ, పశ్చిమాసియాలోనూ మునుపెన్నడూ చూడని మార్పులు రావడం ఖాయమనే చర్చ జరుగుతోంది.
Read Also: మొదలైన మూడో ప్రపంచ యుద్ధం? ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం..