గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారా? అని అటు పార్టీ కేడర్, కీలకనేతలు ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ అంటే అభిమానం ఉన్న ప్రజలు సైతం తమ ప్రియతమ నేత మరల క్రియాశీలక రాజకీయాలు చేయాలని, తామంతా ఆయనే వెంటే ఉన్నామన్న సంకేతాలను పంపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఫాంహౌస్ వీడి బయటకు వచ్చిన కేసీఆర్..మూడు జిల్లాల్లో సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా కృష్ణా నదీ పారే జిల్లాల్లో సభలు నిర్వహించి ఏపీ చేస్తున్న జలదోపిడీ.. రేవంత్ సర్కార్ సహకరిస్తున్న తీరును వివరిస్తామని చెప్పారు. కాగా, నాటి నుంచి నేటివరకు మరోసారి సభల ప్రస్తావన రాలేదు. కేసీఆర్ కాదు కదా.. కేటీఆర్, హరీశ్ రావు సైతం వీటి గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు.అసలు నిర్వహిస్తారా? లేదా? ఉంటే ఎప్పుడు అనేది కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇదిలాఉంటే తాజాగా కవితకు లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ రావడంతో కేసీఆర్ ఏం స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది. కొన్ని పొలిటికల్ రీజన్స్ వలన కవిత తన తండ్రికి దూరమయ్యారు. తాజాగా మరోసారి దగ్గర అయ్యేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ సైతం కూతురికి మరో చాన్స్ ఇద్దామా? అని ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
లిక్కర్ స్కామ్‌లో ఆమెకు క్లీన్ చిట్ రాకముందు నుంచే కవిత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావు,సంతోష్ రావు మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిదే కీలకపాత్ర అని ఆరోపించారు. సిట్ దర్యాప్తునకు పిలిస్తే హాజరై తన వద్దనున్న ఆధారాలు సమర్పిస్తానని ప్రకటించారు.తన భర్త, తన ఫోన్‌ను గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాపింగ్ చేయించిందని సైతం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె బహిరంగ విమర్శలు గుప్పించారు. రీసెంట్‌గా లిక్కర్ స్కామ్ కేసులో కవిత నిర్దోశి అని తేలాక..కేటీఆర్ చేసిన ట్వీట్ మరోసారి అన్నాచెల్లెళ్ల మధ్య వివాదానికి దారితీసింది. ‘లిక్కర్ స్కామ్ వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.. నిర్దోశిగా బయటపడిన కవితకు శుభాకాంక్షలు’ అంటూ ఆయన చేసిన పోస్టు వారి మధ్య మరింత గ్యాప్ పెంచింది.
బీఆర్ఎస్ ఓటమికి లిక్కర్ స్కామ్ కారణమని కేటీఆర్ కామెంట్ చేయడం పట్ల కవిత తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ఓటమిని తన మెడకు తగిలించవద్దని అన్నారు. ఉద్యమద్రోహులు, అవినీతిపరులకు టికెట్లు ఇవ్వడం, ప్రజావ్యతిరేకతే బీఆర్ఎస్ ఓటమికి కారణమని సోదరుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనతో బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని.. మే నెలలో పెట్టబోయే కొత్త పార్టీ ద్వారా అసలైన ఉద్యమకారులను గుర్తిస్తామని, వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. తన రాజకీయ శత్రువులకు త్వరలోనే గట్టి సమాధానం ఇస్తామని అన్నారు. కాగా, కవిత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడంపై గులాబీ బాస్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. దీనికి తోడు లిక్కర్ స్కామ్ లో ఆమెకు క్లీన్ చిట్ రావడంతో ఫ్యామిలీ వివాదాలకు చెక్ పెట్టాలని కేసీఆర్ చూస్తున్నట్టు సమాచారం.
Naralokesh : మాటలు కాదు.. చేతల్లో చూపిస్తాం.. వైసీపీకి ఇచ్చేపడేసిన లోకేశ్!
కేసీఆర్ నేరుగా కవితను పిలువకపోయినా మధ్యవర్తుల ద్వారా తిరిగి పార్టీలోకి రావాలని పిలిస్తే కవిత వెళ్తారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.కవిత ఒకవేళ పార్టీలోకి వెళ్లినా ఆమె ఎలాంటి పొజిషన్ ఆశించనున్నారు? హరీశ్ రావు, సంతోష్ రావుల విషయంలోనూ ఎటువంటి డిమాండ్లు కేసీఆర్ ముందు పెట్టనున్నారు? వారితో కలిసి మళ్లీ సాధారణంగా పనిచేయగలరా? అని అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా కొంత ప్లస్ అవ్వొచ్చని విశ్లేషకులు అంటున్నారు.ఎందుకంటే కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా విమర్శలు చేస్తుండగా..ఇతర పార్టీలకు పరోక్షంగా ప్లస్ అవుతున్న వాదనలు వినిపిస్తున్నాయి.