E-Paper
Advertisement

Ayesha Meera: చేతులెత్తేసిన సీబీఐ.. చనిపోయిన 19 ఏళ్లకు అంత్యక్రియలు.. ఆయేషా మీరా కేసు క్లోజ్

Ayesha Meera: చేతులెత్తేసిన సీబీఐ.. చనిపోయిన 19 ఏళ్లకు అంత్యక్రియలు.. ఆయేషా మీరా కేసు క్లోజ్

Ayesha Meera: ఇప్పుడు సమాజం నుంచి తలెత్తుతున్న ప్రశ్నలివే. ఇది కేవలం ఓ సాధారణ కేసు ముగింపు కాదు. మన దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ ముందు సమాధానం దొరకకుండా మిగిలిపోయిన ఓ ప్రశ్న. 19 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో.. ఆయేషా మీరా కన్నవారి కన్నీళ్లు, కోర్టుల చుట్టూ వారు తిరిగిన ప్రదక్షిణలు, ఏదో ఒక రోజు తమ బిడ్డ చావుకు న్యాయం జరుగుతుందనే ఎదురుచూపులన్నీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయాయ్. తమ బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడి, అత్యంత దారుణంగా చంపినవాడికి శిక్ష పడుతుందని, ఆయేషా చావుకు ఏదో ఒక రోజు న్యాయం దక్కి తీరుతుందని భావించిన తల్లిదండ్రుల ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయిన క్షణాలివి. సరైన ఆధారాల్లేవు, నిందితులెవరో తెలియదనే మాటతో.. ఆయేషా మర్డర్ చాప్టర్ ముగిసిపోవడం గుండెని పిండేసే విషాదం.

19 ఏళ్ల న్యాయయాత్ర… అయినా న్యాయం ఎక్కడ?

2007 డిసెంబర్ 27న.. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ లేడీస్ హాస్టల్‌లో ఉంటూ.. ఫార్మసీ కోర్సు చేస్తున్న ఆయేషా మీరాపై బలాత్కారం జరిగింది. అత్యంత దారుణంగా హత్యకు గురైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అప్పుడు నమోదైన కేసు.. 19 ఏళ్ల తర్వాత సీబీఐ చేతులెత్తేయడంతో ఎటూ తేలకుండానే ముగిసిపోయింది. ఓ మధ్యతరగతి కుటుంబం.. తమ కూతురి బాగా చదువుకొని, జీవితంలో స్థిరపడాలని ఆశపడింది. కానీ.. వారికి మిగిలింది కూతురి మృతదేహపు తాలూకూ అవశేషాలు మాత్రమే. తమ కూతురిని చంపింది వీళ్లేనని ఆ తల్లిదండ్రులు కొందరి వైపు చూపిస్తే.. వ్యవస్థ మరో వైపు చూసింది. ఏళ్ల తరబడి విచారణ జరిగినా, చివరికి సీబీఐ రంగంలోకి దిగినా, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ఆయేషా మీరాని చంపిందెవరనే ప్రశ్నకు సమాధానం దొరకలేదంటే.. ఇది విచారణ సంస్థల వైఫల్యం అనుకోవాలా? వ్యవస్థలో ఉన్న లొసుగులని సరిపెట్టుకోవాలా?

సీబీఐ దర్యాప్తు విఫలం

ఆయేషా మీరా కేసుని క్లోజ్ చేసిన తీరుని చూశాక.. ఒక్కటే అర్థమవుతోంది. ఈ కేసులో సత్యం ఎప్పుడో సమాధి అయిపోయింది. ఏ పాపం తెలియని సత్యం బాబు ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించి, చివరికి.. నిర్దోషిగా బయటపడ్డాడు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ కూడా.. ఆయేషా మీరా కేసుని ఏమీ తేల్చకపోవడంతో.. సామాన్యులకు న్యాయంపై ఉన్న నమ్మకం సడలేలా చేసింది. ఆయేషా తల్లిదండ్రుల కళ్లలో.. 19 ఏళ్లుగా నీటి చుక్క లేదు. తమ కూతురిని చంపిందెవరో తమకు, ప్రపంచానికి తెలిసినా.. చట్టానికి మాత్రం తెలియకుండా పోయిందని ఆమె చేస్తున్న ఆర్తనాదం ఎవరికీ వినబడలేదు. నిందితులు రాజకీయంగా బలంగా ఉన్నారనే ఆరోపణల మధ్య, సాక్ష్యాలు, ఆధారాలు ఇన్నేళ్లలో ఒక్కొక్కటిగా కరిగిపోయాయ్.

రెండోసారి పోస్టుమార్టం… చివరికి కేసు క్లోజ్

ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి, సీబీఐ దాఖలు చేసిన తుది నివేదిక పరిశీలించిన తర్వాత.. సీబీఐ కోర్టు కేసుని క్లోజ్ చేసేసింది. కేసు దర్యాప్తులో భాగంగా, సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆస్పత్రి డాక్టర్ల అభిప్రాయం తీసుకున్నాక, ఆమె అవశేషాలను కోర్టు ముందు ఉంచారు. తమ కుమార్తె అవశేషాలను అప్పగించాలని కోరుతూ.. ఆయేషా తల్లిదండ్రులు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిబ్రవరి 27న ఆయేషా అవశేషాలకు, ప్రాసిక్యూషన్ అవసరమైన భద్రత, వాహన సదుపాయం కల్పించి, తల్లిదండ్రులతో పాటు వారి స్వస్థలమైన తెనాలికి పంపాలని కోర్టు సూచించింది.

ఆయేషా అంత్యక్రియలకు కోర్టు ఆదేశాలు

శ్మశాన వాటికలో వారి మతాచారం ప్రకారం ఆయేషా మీరా అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా సహకరించాలని అధికారులని ఆదేశించింది. ఆయేషా అంత్యక్రియల ప్రక్రియని వీడియో రికార్డ్‌ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఆ సమయంలో తప్పనిసరిగా హాజరుకావాలని జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఆయేషా మీరా కేసు ఫైల్ క్లోజ్ అయి ఉండొచ్చు. కానీ.. ఆయేషా ఆత్మకు శాంతి లభిస్తుందా? 19 ఏళ్ల క్రితం ఆ గదిలో జరిగిన ఘోరానికి సాక్ష్యం, ఆ దేవుడికి, ఆయేషాకు, ఆ హంతకుడికి మాత్రమే తెలుసు. చట్టం తన పని తాను చేసుకొని పోయినా, న్యాయం మాత్రం జరగలేదు. ఇది ఒక అమ్మాయి మరణానికి సంబంధించిన విషయమే కాదు, వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం.

తమ బిడ్డని చంపిన వాడెవడు

ఇప్పుడు ఆయేషా తల్లిదండ్రులని ఏమని ఓదార్చుతారు? తమ గారాలపట్టీని చంపిన ఆ కిరాతకుడు ఎవరని, వాళ్లడికే ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు? ఓ వైపు బిడ్డను కోల్పోయిన దుఃఖం, మరోవైపు న్యాయం కోసం చేసిన 19 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, కోర్టుల చుట్టూ, దర్యాప్తు సంస్థల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా.. చివరికి దక్కింది ఓ క్లోజర్ రిపోర్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నేర చరిత్రలో ఓ మాయని మచ్చ.. ఆయేషా మీరా కేసు. చట్టమే ఆ నర హంతకుడిని శిక్షిస్తుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకాన్ని, వ్యవస్థల మీద సామాన్యులకు ఉండే గౌరవాన్ని.. నిలువునా దహించేసిన ఉదంతం ఇది.

సీబీఐ కూడా చేతులెత్తేసిన ఆయేషా మర్డర్ కేసు

19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా నిందితుడెవరో తెలియదని దర్యాప్తు సంస్థలు ప్రకటించడం, సీబీఐ కోర్టు కేసు క్లోజ్ చేయడం.. ప్రజాస్వామ్య వ్యవస్థకే.. ఓ ప్రశ్నార్థకంగా మారింది. ఆయేషా మర్డర్ కేసులో సీబీఐ వైఫల్యం, వ్యవస్థాగత లోపాలు, బాధితులకు జరిగిన అన్యాయంపై.. తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. సంవత్సరాలు గడిచినా సరే.. ఆయేషాకు న్యాయం జరుగుతుందని అంతా భావించారు. కానీ.. చివరకి గెలిచింది అన్యాయమే. ఆయేషా మీరా కేసుని.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు విభాగమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. సీబీఐకి అప్పగిస్తేనే.. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందని, నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని అంతా భావించారు. ఏపీ పోలీసులు తేల్చలేని కేసుని.. సీబీఐ ఛేదిస్తుందని అంతా నమ్మారు. కానీ.. ఆయేషా మీరా కేసులో సీబీఐ కూడా చేతులెత్తేసింది. నిందితుడెవరో తేల్చకుండానే, సరైన ఆధారాలు కనిపెట్టకుండానే.. సైలెంట్‌గా కేసు క్లోజ్ అయ్యే స్థితికి తీసుకొచ్చింది. సైలెంట్‌గా తప్పుకుంది.

సాక్ష్యాధారాలు కోర్టులో ధ్వంసం

అయితే, సీబీఐ రంగంలోకి దిగే సమయానికే, కీలకమైన సాక్ష్యాధారాలు కోర్టులో ధ్వంసం అయ్యాయనే ప్రచారం ఉంది. ఇదంతా.. ఓ కుట్రగా కనిపిస్తున్నా, ఆ ధ్వంసం వెనుక ఉన్న పెద్ద తలకాలయను సీబీఐ పట్టుకోలేకపోయింది. రీ-పోస్ట్ మార్టం చేసినా, రీ-ఇన్వెస్టిగేషన్ చేసినా.. కొత్తగా ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ సంపాదించలేకపోయింది. ఓ సాధారణ మర్డర్ కేసు నిందితుడిని పట్టుకునేందుకు.. దేశంలోని అత్యున్నత సంస్థకు.. దాదాపు రెండు దశాబ్దాల కాలం సరిపోలేదా? లేక.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చేతులెత్తేసిందా? అనే అనుమానాలు ఇప్పుడు సాధారణంగానే తలెత్తుతున్నాయ్.

ఆయేషా కేసులో రాజకీయ జోక్యం..?

ఆయేషా కేసు.. మొదటి నుంచి తప్పుదోవ పట్టడానికి ప్రధాన కారణం, రాజకీయ జోక్యమేనని ఆయేషా తల్లిదండ్రులు మొదటి నుంచి గొంతు చించుకుంటున్నారు. అసలు హంతకుడిని వదిలేసి, అమాయకులను నిందితులుగా చూపి, శిక్షలు పడేలా చేశారు. కానీ, హైకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించినప్పుడు, అసలు నేరస్తులెవరనే ప్రశ్న మళ్లీ మొదటికొచ్చింది. ప్రశ్నగానే మిగిలిపోయింది. అందుకే.. రికార్డులు మాయం చేయడం దగ్గరి నుంచి, సాక్షులను బెదిరించడం దాకా అంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిందనే ఆరోపణలున్నాయ్. అసలు నేరస్తుడిని పట్టుకోలేక, కేసుని క్లోజ్ చేయడం కంటే వైఫల్యం మరొకటి ఉంటుందా?

ఆయేషా మీరా కేసు సూచనలు

వందలకొద్దీ సెక్షన్లు, వేల మంది పోలీసులు, సీబీఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఉన్నా.. ఓ ఆడపిల్ల హత్యకు కారణమైన వారిని గుర్తించలేకపోవడం భారతీయ న్యాయ వ్యవస్థకు చీకటి రోజు.
సీబీఐ లాంటి సంస్థలు సైతం సమర్థతను కోల్పోతున్నాయా? అధికార బలం ముందు మోకరిల్లుతున్నాయా? అనే అనుమానాలు రాక తప్పదు. న్యాయం ఆలస్యమైతే.. అది అన్యాయంతో సమానం. కానీ.. ఆయేషా మీరా కేసులో.. న్యాయం ఆలస్యం కావడమే కాదు, పూర్తిగా అంతరించిపోయింది.

అయ్యేషా కేసు లో న్యాయం అడ్డుకట్ట

ఆయేషా.. మమ్మల్లి క్షమించు తల్లీ..! కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ ఉన్నంతకాలం నీకు న్యాయం జరగదు! ఎన్నేళ్లు విచారణ జరిగినా.. నీ కేసు తేలనే తేలదు! తమ వాళ్లను తప్పించే పాలకులు ఉన్నంతకాలం.. నీలాంటి అభ్యాగ్యులు బలికావాల్సిందే! ఇలాంటి వ్యవస్థలో ఉన్నందుకు మనమంతా సిగ్గుపడాల్సిందే!

Story By: Anup, Big  Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×