India-Nepal Border: నేను ప్రధానమంత్రి అయ్యాక నాకు తెలిసిన ఓ వాస్తవం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది.. భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా చాలా చోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పుడు రెండు దేశాలు స్నేహితుల్లా కూర్చొని, వాస్తవాలను అధ్యయనం చేసి సమస్యను పరిష్కరించుకోవాలి.. ఇది నేపాల్ ప్రధాని బాలెన్ షా ఇచ్చిన స్టేట్‌మెంట్. ఆయన అక్కడితో ఆగలేదు. ఈ విషయాన్ని చైనా, యూకే దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు.. ఇక్కడ మొదలైంది అసలైన వివాదం.
ప్రధాని స్టేట్‌మెంట్‌లో రెండు కీలక విషయాలు ఉన్నాయి. ఒకటి.. ఏకంగా ప్రధాని హోదాలో ఉండి.. భారత్ భూభాగాలను ఆక్రమించామని ప్రకటించడం. రెండోది.. వివాదం పరిష్కరించేందుకు చైనా, యూకే సహాయం తీసుకుంటామని చెప్పడం. ఇప్పుడు ఒక్కో విషయం గురించి తెలుసుకుందాం.
ఫస్ట్.. భారత్ భూభాగాలను ఆక్రమించానని చెప్పడం. ఎప్పుడైతే పార్లమెంట్‌లో బాలెన్ షా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారో నేపాల్ పాలిటిక్స్‌లో హీట్ పెరిగింది. సొంత దేశమే భారత భూభాగాన్ని ఆక్రమించిందని ప్రధాని ఎలా అంటారని ప్రతిపక్ష నేపాలి కాంగ్రెస్, నేపాలి కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రధాని తన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని లేదా వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నేపాల్ మాజీ దౌత్యాధికారులు, సరిహద్దు నిపుణులు కూడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టారు. నేపాల్ ఎన్నడూ భారత భూభాగాన్ని ఆక్రమించలేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో సరైన గుర్తులు లేకపోవడంతో ఇరువైపుల రైతులు పరస్పరం భూములను వాడుకుంటున్నారని.. దానిని ఆక్రమణ అనలేమన్నారు.
పొలిటికల్ హీట్ పెరగడంతో నేపాల్ విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ప్రధాని వ్యాఖ్యలు నో-మ్యాన్స్ ల్యాండ్, సరిహద్దుల్లో పరస్పర భూ వినియోగం గురించి మాత్రమే అని.. అధికారిక ఆక్రమణల గురించి కాదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. నిజానికి లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై భారత్, నేపాల్‌ల మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాలు తమవే అనేది నేపాల్ వాదన. అవి ఉత్తరాఖండ్‌లో భాగమని భారత్ వాదన. 2021లో అప్పటి ఓలీ ప్రభుత్వం ఈ మూడు ప్రాంతాలను తమ భూభాగంలో చూపుతూ కొత్త మ్యాప్‌ను విడుదల చేయడంతో వివాదం ముదిరింది. ఇక బాలెన్ షా ప్రభుత్వం వచ్చిన తర్వాత కైలాస మానస సరోవర యాత్ర లిపులేఖ్ మీదుగా జరగడాన్ని కూడా నేపాల్ వ్యతిరేకించింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఇక రెండో విషయానికి వస్తే.. చారిత్రక ఆధారాలు, సర్వే రికార్డులు, నిపుణుల నివేదికలను పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని బాలెన్ షా చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పటికే ఈ విషయంపై యూకే, చైనాకు సమాచారం ఇచ్చామని ప్రకటించడం మరో అగ్గిని రాజేసే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ ఎప్పుడూ కూడా మూడో దేశం జోక్యాన్ని అంగీకరించదు. ఈ విషయం నేపాల్‌కు తెలిసి కూడా మూడో దేశాన్ని ఇందులోకి లాగాలని చూడటం ఏంటనేది మరో ప్రశ్న.
భారత్-నేపాల్ సరిహద్దు వివాదానికి మూలం 1816 నాటి సుగౌలీ ఒప్పందం. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, నేపాల్ రాజుకు మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ సంధి ప్రకారం మహాకాళి నది పశ్చిమ సరిహద్దుగా ఫిక్స్ చేశారు. కానీ ఆ నది ఎక్కడ పుట్టింది అనేదానిపై క్లారిటీ లేదు. బ్రిటీష్ వారు వెళ్లిపోతూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ పంచాయితీకి కారణం బ్రిటీష్ వారే కాబట్టి, లండన్ నుండి అసలు పాత మ్యాప్‌లు, రికార్డులను బయటకు తీయించి, బ్రిటన్‌ను ఇందులో ఒక మధ్యవర్తిగా చేర్చాలనేది బాలెన్ షా ఎత్తుగడలా కనిపిస్తోంది.
నిజానికి బ్రిటిష్ పాలన కాలంలో రూపొందిన సరిహద్దు ఒప్పందాలు, మ్యాపులకు ఈ వివాదంతో సంబంధం ఉన్నందున బ్రిటన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారంటే ఓ అర్థముంది. కానీ ఇందులో చైనా రోల్ ఏముందని.. ఆ దేశానికి సమాచారం ఇచ్చారనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కాలాపాని, లిపులేఖ్ అనేవి కేవలం భారత్-నేపాల్ సరిహద్దులు మాత్రమే కాదు… అవి భారత్-నేపాల్- టిబెట్ కలిసే ట్రై-జంక్షన్ ప్రాంతాలు కూడా.భారత్, చైనాలు కలిసి లిపులేఖ్ పాస్ ద్వారా వాణిజ్యం, కైలాస మానస సరోవర్ యాత్రను కొనసాగిస్తున్నాయి. దీనిపై నేపాల్ గతంలోనే అభ్యంతరం చెప్పింది. సో.. ఇప్పుడు చైనాను ఈ వివాదంలో భాగస్వామిని చేయడం ద్వారా భారత్‌ను ఇరుకున పెట్టవచ్చని నేపాల్ భావిస్తోంది. చైనా ఎలాగూ భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ను ఉపయోగించుకోవాలని చూస్తోంది కాబట్టి, బీజింగ్ మద్దతుతో భారత్‌తో బేరసారాలు జరపవచ్చనేది ప్రధాని బాలెన్ షా అసలు వ్యూహంలా కనిపిస్తోంది.
నేపాల్ చేస్తున్న వాదనలకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవనేది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట. ఏకపక్షంగా సరిహద్దులను పెంచుకుంటూ పోవడం చెల్లదని, అయితే ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించింది. నిజానికి ఇప్పటికే 90 శాతం సమస్య తీరిపోయిందని తెలుస్తోంది. కానీ బాలెన్ షా మాత్రం మరోసారి ఈ వివాదాన్ని పెద్దది చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది.
నేపాల్ రాజకీయాల్లో అత్యంత వేగంగా ఎదుగుతూ, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నేత బాలెన్ షా. ఖాట్మండు మేయర్ నుంచి తాజాగా నేపాల్ ప్రధాని పీఠాన్ని దక్కించుకునే వరకు ఎదిగారు. కానీ ఆయన మొదటి నుంచి భారత్‌కు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. సరిహద్దు వివాదం విషయంలో మాత్రమే కాదు.. ఆయన మేయర్‌గా ఉన్నప్పుడు కూడా యాంటీ ఇండియా నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత నూతన పార్లమెంట్ భవనంలో అఖండ భారత్ పెయింటింగ్‌ను ప్రదర్శించడాన్ని నిరసిస్తూ… బాలెన్ షా ఖాట్మండులోని తన అధికారిక కార్యాలయంలో గ్రేటర్ నేపాల్ మ్యాప్‌ను ఏర్పాటు చేశారు. ఇది పెద్ద వివాదానికే కారణమైంది. ఎందుకంటే ఈ మ్యాప్‌లో భారతదేశంలో ప్రస్తుతం భాగమైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలను నేపాల్ దేశ భూభాగాలుగా ఉన్నాయి. ఇది భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.
ఆదిపురుష్ సినిమాలో సీత భారతదేశ కుమార్తె అనే డైలాగ్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలెన్ షా ఖాట్మండు నగర పరిధిలో అన్ని బాలీవుడ్ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆయన మేయర్‌గా ఉన్నారు. ఆ డైలాగ్‌ను తొలగించే వరకు ఏ హిందీ సినిమాను ప్రదర్శించమని ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని నేపాల్ హైకోర్టు తప్పుబట్టడంతో ఆ తర్వాత నిషేధం ఎత్తేయాల్సి వచ్చింది.
అంతేకాదు మేయర్‌గా ఉన్న కాలంలో భారతదేశంలోని ప్రముఖ నగరాలతో సాంస్కృతిక, మౌలిక వసతుల మార్పిడి కోసం జరగాల్సిన పలు అధికారిక ట్విన్ సిటీ ఒప్పందాలను, చర్చలను కావాలనే పక్కన పెట్టారు. భారత్‌కు బదులు చైనా నగరాలతో సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు మొగ్గు చూపారు. నేపాల్‌లో సాధారణంగా భారత రాయబారికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కానీ బాలెన్ షా ప్రధాని కాకముందు నుండే భారత దౌత్యవేత్తలు లేదా అధికారులతో ఎలాంటి వ్యక్తిగత, అధికారిక వన్-టు-వన్ సమావేశాలు జరపడానికి నిరాకరిస్తూ విదేశాంగ విధానంలో ప్రోటోకాల్ గ్యాప్ క్రియేట్ చేశారు.
ఈ నిర్ణయాలన్ని ఆయనకు ప్లస్ అయ్యాయి. నేపాల్ యువతలో హీరో ఇమేజ్ తీసుకొచ్చాయి. బాలెన్ షా తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు, యాంటీ-ఇండియా సెంటిమెంట్ నేపాల్‌లోని ఓ వర్గం యువతను బాగా ఆకట్టుకుంది. సాంప్రదాయ రాజకీయ పార్టీలపై విసిగిపోయిన ప్రజలు ఆయనను ఓ హీరోగా చూశారు. ఈ క్రేజ్ ఆయనను ఖాట్మండు మేయర్ స్థాయి నుండి ఏకంగా నేపాల్ ప్రధాని రేస్‌లోకి వచ్చేలా చేసింది.
ఇదంతా ఆయన పొలిటికల్ కెరీర్‌కు ప్లస్‌గా మారినా.. భారత్-నేపాల్ దౌత్య సంబంధాలు మాత్రం క్షీణించడానికి కారణమయ్యాయి. ఒక చిన్న మున్సిపల్ మేయర్ అంతర్జాతీయ సరిహద్దులు, విదేశీ సినిమాలపై నిషేధం వంటి నిర్ణయాలు తీసుకోవడం భారతదేశానికి ఆగ్రహం తెప్పించింది. దశాబ్దాలుగా ఉన్న భారత్-నేపాల్ స్నేహ సంబంధాలు దెబ్బతినడానికి ఇవి కారణమయ్యాయి.
కానీ ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అధికారం చేపట్టిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుంచి కొనుగోలు చేసే 100 నేపాలీ రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులపై 5 నుంచి 80 శాతం వరకు కస్టమ్స్ ట్యాక్స్ విధించాలని బాలెన్‌షా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పెద్ద వివాదంగా మారింది. ఈ నిర్ణయం వల్ల బియ్యం, పప్పులు, ప్యాకేజ్డ్ ఫుడ్, బట్టలు వంటి రోజువారీ నిత్యావసరాలు కూడా భారత్ నుండి నేపాల్‌కు తీసుకువెళ్లడం కష్టతరంగా మారింది. ఈ నిబంధనల వల్ల సరిహద్దు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగడంతో, వీటిపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దీనిని పరిశీలించిన నేపాల్ సుప్రీంకోర్టు ఈ వివాదాస్పద పన్ను విధానంపై తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది.
ఇలా ఒకటికాకపోతే మరొకటి అన్నట్టుగా ఏదో ఒక విషయంపై భారత్‌లో డైరెక్ట్‌గానో.. ఇన్‌డైరెక్ట్‌గానే గిల్లికజ్జాలు పెట్టుకునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు బాలెన్ షా. ఇవన్నీ తాత్కాలికంగా యూత్‌లో క్రేజ్‌ను పెంచుతున్నా లాంగ్ టర్మ్‌లో దేశ ఆర్థిక వ్యవస్థపై, విదేశాంగ విధానంపై తీవ్రమైన ఎఫెక్ట్‌ను చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: గ్రేటర్ వరంగల్‌లో ప్రభుత్వ స్థలాల గుర్తింపు.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
Story by: Anup, Big Tv